rental cars
-
కారు ఒకరిది.. డాబు వాళ్లది
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): సెల్ఫ్ డ్రైవింగ్ పేరుతో కార్లను అద్దెకు తీసుకోని తాకట్టు పెడుతున్న ఇద్దరు ఘరానా నిందితులను రాచకొండ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. వారి నుంచి రూ. 2.50 కోట్ల విలువ చేసే 15 కార్లను స్వాదీనం చేసుకున్నారు. ఆయా వివరాలను మల్కాజ్గిరి డీసీపీ జానకి బుధవారం విలేకరుల సమావేశం లో వెల్లడించారు. ఖమ్మం జిల్లా తాళ్లగూడెం గ్రామానికి చెందిన బొల్లు రాజేష్ హైదరాబాద్‌కు వలస వచ్చి , ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉంటూ డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చిన్న పలుగుతండాకు చెందిన బానోతు నరేందర్ అలియాస్ నాగేంద్ర ఘాట్ కేసర్ లోని కొర్రెముల గ్రామంలో నివాసం ఉంటున్నాడు. వీళ్లిద్దరూ మంచి స్నేహితులు. విలాసవంతమైన జీవనానికి అలవాటు పడిన ఇరువురూ అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో పథకం ప్రకారం రాజేష్ తానొక బ్యాంకు వెండర్ అని ప్రచారం చేసుకుంటూ.. కార్లను అద్దెకు తీసుకుంటానని అమాయకులను నమ్మించేవాడు. నెలకు రూ.60 వేలు అద్దె చెల్లిస్తానని చెప్పి యజమానుల నుంచి కార్లు అద్దెకు తీసుకునేవాడు. ఆ తర్వాత కారు యజమానులతో కమ్యూనికేషన్ కట్ చేసేవాడు. ఓనర్లు వాహనాలను ట్రాకింగ్ చేయకుండా కార్లలోని జీపీఎస్ వ్యవస్థను ధ్వంసం చేసేవారు. ఆపై వారి కంట పడకుండా తప్పించుకొని తిరిగేవారు. ఈ కార్లను తెలిసిన వాహన డీలర్లు, వర్తకుల వద్దకు తీసుకెళ్లి, సొమ్ము అత్యవసరం ఉందని చెప్పి వారిని నమ్మించేవారు. కారుతో పాటు ప్రామిసరీ నోటు, చెక్‌లను తనఖాగా పెట్టి వారి నుంచి సొమ్ము తీసుకునేవారు. ఇలా ఇప్పటివరకు ఇరువురు నిందితులు 13 మంది అమాయకులను మోసం చేసి, 15 వాహనాలను తనఖా పెట్టి, రూ.30 లక్షలు సొమ్ము చేసుకున్నారు. ఉప్పల్ పీఎస్ పరిధిలో 6 కార్లు, మేడిపల్లిలో 2, చైతన్యపురిలో 2, ఖైరతాబాద్ పీఎస్ పరిధిలో 5 కార్లు తాకట్టు పెట్టిన కేసులు నమోదయ్యాయి. దీంతో ఉప్పల్ పోలీసులు నిందితులు రాజేశ్, నరేందర్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి 9 ఇన్నోవాలు, 2 స్విట్ డిజైర్లు, 2 టొయోటో ఎటియోస్, ఒకటి ఇన్నోవా క్రిస్టా, ఒకటి బాలెనో కార్లను స్వాదీనం చేసుకున్నారు. -
లీజుకు మారుతీ కార్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ).. అద్దె వాహన సేవలను ప్రారంభించింది. ‘మారుతీ సుజుకీ సబ్‌స్క్రైబ్’ పేరిట తాజా సర్వీసులను గురువారం అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానంలో కస్టమర్లు కారును కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా, లీజు పద్ధతిలో నచ్చిన కారును వినియోగించుకోవచ్చు. మారుతీ స్విఫ్ట్, డిజైర్, విటారా బ్రెజా, నెక్సా, బాలెనో, ఎర్టిగా, సియాజ్, ఎక్స్ఎల్ 6 కార్లను లీజు సభ్యత్వ సేవలో పొందవచ్చని కంపెనీ ప్రకటించింది. 24, 36, 48 నెలల కాలపరిమితితో ఈ కార్లను అందజేస్తున్నట్లు వివరించింది. నెలవారీ చందాలోనే కారు నిర్వహణ, బీమా మొత్తాలు కలిపి ఉంటాయని స్పష్టం చేసింది. భారత్‌లో ఈ సేవలను అందించడం కోసం.. జపాన్‌కు చెందిన ఒరిక్స్ ఆటో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం బెంగళూరు, గురుగ్రామ్ నగరాల్లో లీజింగ్ సేవలను అందిస్తున్నామని, త్వరలోనే ఈ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీ ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. -
కార్లు అద్దెకు తీసుకోవడం.. ఆపై అమ్మేయడం
నెల్లూరు(క్రైమ్): ఫైనాన్స్ వ్యాపారిని అంటూ నమ్మిస్తాడు. కార్లను అద్దెకు తిప్పుతానని నెలవారీ అద్దెకు ట్రావెల్స్ వద్ద నుంచి కార్లు తీసుకుని ఉడాయిస్తాడు. అనంతరం వాటిని కుదవ పెట్టడం లేదా విక్రయించి సొమ్ము చేసుకుని జల్సాగా జీవించసాగాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన నెల్లూరులోని బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డి మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఐశ్వర్యరస్తోగి నిందితుడి వివరాలను వెల్లడించారు. తోటపల్లిగూడూరు మండలం వరిగొండ గ్రామానికి చెందిన అశోక్‌కుమార్‌రెడ్డి అలియాస్ అశోక్‌కుమార్ జల్సాలకు బానిసై నేరాలకు పాల్పడసాగాడు. కొంతకాలంగా అతను ఫైనాన్స్ వ్యాపారినని వాహనాలకు ఫైనాన్స్ ఇప్పిస్తానని పలువురిని నమ్మించాడు. ఈక్రమంలో ఆయనకు ట్రావెల్స్ యజమానులతో పరిచయాలయ్యాయి. కార్లు అద్దెకు తిప్పుతానని అందుకు గానూ రూ.25 వేలు నెలకు అద్దె చెల్లిస్తానని ట్రావెల్స్ యజమానులను నమ్మించేవాడు. అనంతరం కార్లు తీసుకుని వాటితో ఉడాయించేవాడు. వాహనాలను ఇతర ప్రాంతాల్లో కుదవ పెట్టడం లేదా రూ.లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకుని జల్సాగా జీవించసాగాడు. ఫిర్యాదుతో వెలుగులోకి.. ఇటీవల అశోక్‌కుమార్ నెల్లూరు నగరానికి చెందిన ప్రజీత్‌రెడ్డి వద్ద కారును నెలవారీ అద్దెకు తీసుకున్నాడు. అనంతరం ఆ కారును అమ్మివేశాడు. నెలలు దాటుతున్నా కారును ఇవ్వకపోవడంతో ప్రజీత్‌రెడ్డి బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం సాయంత్రం రామలింగాపురం సెంటర్ వద్ద అశోక్‌కుమార్ ఉన్నాడనే పక్కా సమాచారం అందుకున్న బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీసు స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో విచారించగా వేదాయపాళెం, ఇందుకూరుపేటల్లో ఇదే తరహాలో మోసాలకు పాల్పడినట్లు అంగీకరించడంతో అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.40 లక్షలు విలువచేసే ఐదు కార్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలో దొంగతనం కేసులో.. నిందితుడు గతంలో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్‌గా పనిచేశాడు. ఆ సమయంలో తన స్నేహితులతో కలిసి రికవరీ సొత్తు రూ.లక్షలను దొంగతనం చేశాడు. ఈ కేసులో అరెస్టై జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన అశోక్‌కుమార్‌రెడ్డి ఆర్థిక మోసగాడిగా అవతారమెత్తి కార్లు అద్దెకు తీసుకుని వాటిని అమ్మి సొమ్ము చేసుకోసాగాడు. సొంత బంధువుల వద్ద సైతం అతను ఇదే తరహాలో మోçసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై గతంలో నెల్లూరు చిన్నబజారు పోలీసులు సస్పెక్ట్ షీటు తెరిచారు. అనంతరం షీట్‌ను టీపీ గూడూరు పోలీసు స్టేషన్‌కు బదలాయించారు. సిబ్బందికి అభినందన నిందితుడిని అరెస్ట్ చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్న బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డి, ఎస్సై రమేష్‌బాబు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి అభినందించారు. అనంతరం వారికి నగదు ప్రోత్సాహకాలను అందించారు. సమావేశంలో ఏఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి, నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, చిన్నబజారు ఇన్స్పెక్టర్ షేక్ అన్వర్‌బాషా తదితరులు పాల్గొన్నారు. -
అద్దెకు కార్ల పేరుతో మోసం
నాగోలు: ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్లను అద్దెకు ఇప్పిస్తామని పలువురి వద్ద కార్లు తీసుకుని కుదువపెట్టి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు, మీర్‌పేట పోలీసులు బుధవారం అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.4,70 లక్షల నగదు, 23 కార్లును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎల్బీనగర్ క్యాంప్ కార్యాలయంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. బండగ్పేటకు చెందిన కండల శ్రీకాంత్‌చారి 2007లో ముఖ్యమంత్రి కార్యాలయంలో తాత్కాలిక డ్రైవర్‌గా పనిచేశాడు. అయితే అతడికి డ్రైవింగ్ సరిగా రాకపోవడంతో విధుల్లో నుంచి తొలగించారు. ఈ సందర్భంగా అతను అక్కడ అద్దెకు తీసుకునే వాహనాల వివరాలు తెలుసుకున్నాడు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు గాను మోసాలకు తెరలేపాడు. తనకు తెలిసిన వారి వద్ద నుంచి కార్లు తీసుకుని సీఎం కార్యాలయంలో అద్దెకు పెట్టిస్తానని నమ్మించి నెలకు రూ. 30 వేల చొప్పున కిరాయి ఇస్తానని చెప్పి 30 కార్లను తీసుకున్నాడు. అనంతరం అమీర్‌పేట్‌కు చెందిన సదర్ మహేందర్ సింగ్‌తో కలిసి వాటిని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో కుదవపెట్టి రుణాలు తీసుకున్నాడు. ఈ డబ్బులతోనే కారు ఓనర్లకు మొదటి విడత కిరాయి చెల్లించేవాడు. ఆ తర్వాత కిరియి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఏడు కార్లకు జీపీఎస్ ఉండంతో యజమానులు వాటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మరి కొందరు అద్దె చెల్లించకపోవడం, కార్లు కనిపించపోవడంతో ఎస్ఓటీ పోలీసులకు ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు శ్రీకాంత్‌చారి, సర్దార్మహేందర్ సింగ్‌లను అరెస్ట్ చేసి వారని నుంచి 23 కార్లను స్వాధీనం చేసుకున్నారు.కాగా శ్రీకాంత్‌చారి డబుల్‌బెడ్ రూమ్ ఇప్పిస్తామని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రూ 10.65 లక్షల వసూలు చేసిన కేసులో నిందితుడిగా ఉన్నట్లు తెలిపాడు. అంతేగాక ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళను మోసం చేసినట్లు తెలిపారు. అతడిపై మీర్‌పేట పరిధిలో 6, సరూర్‌నగర్, వనస్థలిపురం, బంజారాహిల్స్, పంజాగుట్ట స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 23 కార్లు, రూ.4.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సురేందర్‌రెడ్డి, సీఐ రవికుమార్, ఎస్ఐ రాజు,యాదయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బతికున్న వాళ్లను చనిపోయినట్లుగా..
బంజారాహిల్స్: గుర్రపు పందేలకు బానిసైన ఓ యువకుడు... బతికున్న వాళ్లను చనిపోయినట్లుగా చిత్రీకరిస్తూ కటకటాల పాలయ్యాడు. మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని పోరంకి గ్రామానికి చెందిన పొట్లూరి శ్రీ బాలవంశీకృష్ణ (31) మణికొండ పుప్పాలగూడ సమీపంలోని వినాయనగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. జల్సాలకు, గుర్రపు పందేలకు బానిసై అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించేందుకు ప్రణాళికలు రూపొందించాడు. కార్లు అద్దెకు తీసుకొని రెండు నెలలు గడిచిన తర్వాత సంబంధిత కారు యజమాని చనిపోయినట్లుగా పత్రాలు సృష్టించి దానిని ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టసాగాడు. కొనుగోలుదారులకు ఆ కారు యజమాని చనిపోయాడని తనకే విక్రయించాడంటూ నమ్మించేవాడు. ఇప్పటి వరకు ఎనిమిది మంది దగ్గర ఇలా కార్లు అద్దెకు తీసుకొని ఆ యజమానులు చనిపోయినట్లుగా పత్రాలు సృష్టించి ఓఎల్ఎక్స్లోనే వాటిని అమ్మకానికి పెట్టాడు. ఇలా రూ.30 లక్షలు వసూలు చేశాడు. గత నెల గుర్రపు పందేల్లో రూ.25 లక్షల వరకు నష్టపోయాడు. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీటీ నగర్‌కు చెందిన శ్రీలత అనే మహిళకు ఇలాగే ఓ కారును విక్రయించాడు. ఆ కారు యజమాని సురేష్ జాదవ్ చనిపోయినట్లుగా పత్రాలు సృష్టించడంతో ఆమె రుణసౌకర్యం కోసం బ్యాంకుకు వెళ్లి ప్రశ్నించింది. అసలు విషయం అక్కడ బయటపడింది. దీంతో నిందితుడిని విచారించగా ఇప్పటి వరకు చేసిన మోసాలన్నీ ఒప్పుకున్నాడు. నెట్లోకి వెళ్లి చనిపోయిన వారి డేటా తీసుకొనేవాడు. అందులో వారిపేర్లు చెరిపేసి తాను అద్దెకు తీసుకున్న కారు యజమాని పేరును రాసి చనిపోయినట్లుగా చిత్రీకరించేవాడని పోలీసులు తెలిపారు. కార్ల పేరుతో ఎనిమిది మందిని మోసం చేశారని తెలిపారు. కేసును ఛేదించిన ఎస్ఐ బచ్చు శ్రీనును డీసీపీ అభినందించారు. -
కారులు..కాసులు
జిల్లాకు చెందిన ఓ ఎంపీడీఓ తన సొంత వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ వాహనం పేరుతోనే ప్రతి నెలా రూ.35 వేలు డ్రా చేస్తున్నారు. ఈ వాహనాన్ని కూడా ఎప్పుడో ఒకసారి తీస్తారంతే. ఆ ఎంపీడీఓనే సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటారు. బినామీ పేరుతో అద్దె సొమ్మును ఎంచక్కా లాగేస్తున్నారు. ఆ సొంత వాహనంలో ఏ రోజూ క్షేత్ర పర్యటనకు వెళ్లిన దాఖాలాలు లేవు. అడపాదడపా సిబ్బందితో సమీక్షలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఉపాధి పథకం నుంచి వచ్చే ప్రయోజనాలన్నీ పొందుతున్నారు. కేవలం ఆ ఒక్క ఎంపీడీఓనే కాదు సింహభాగం ఎంపీడీఓలదీ అదే పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా 90 శాతం మందిదీ ఇదే తంతు. సాక్షి, మచిలీపట్నం: కష్టజీవుల ఆకలి తీర్చి, ఉపాధి కల్పించేందుకు ప్రారంభించిన గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసులు కురిపిస్తోంది. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నిధులు దోచేయడం, దొంగ బిల్లులు పెట్టి స్వాహా పర్వానికి తెర తీస్తున్నారు. ఇది నిత్యం జరిగే ప్రక్రియ. ఇదిలా ఉంటే అందులో మరో కోణం దోపిడీకి సాక్ష్యంగా నిలుస్తోంది. పనుల పర్యవేక్షణకు ప్రభుత్వం కేటాయిస్తున్న వాహనాల వాహనాల అద్దె పేరుతో దోపిడీ దారి వెతుక్కున్నారు. నెల గడవడమే ఆలస్యం ఠంచనుగా ఎక్కడికక్కడ నిధులు డ్రా చేసేస్తున్నారు. అసలు వాహనాలనే అద్దెకు తీసుకోలేదు. అతికొద్ది మంది మాత్రమే అద్దె వాహనాలు తీసుకున్నారు. అయినా అద్దెకు వాహనాలు తీసుకున్నట్లు రికార్డులు చిత్రీకరించారు. కొందరు అతి తెలివి ఉపయోగించి.. నెలలో రెండు మూడు రోజులు మాత్రమే అద్దెకు తీసుకుంటున్నారు. వీరితోనే ఖాళీ బిల్లు తీసుకుని అద్దె డ్రా చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదీ కథ! జిల్లాలో 49 మండలాలుండగా.. అన్ని మండాల్లో ఉపాధి పనులు సాగుతున్నాయి. ఎంపీడీఓలు క్షేత్రస్థాయికి వెళ్లి ఉపాధి పనులు తనిఖీ నిర్వహించేందుకు అద్దె ప్రాతిపదిక వాహన సౌకర్యం కల్పిస్తారు. ఇలా ఎంపీడీఓకు నెలకు వాహన అద్దెకు రూ.35 కేటాయిస్తారు. ఆ నిధులు వారు ఎప్పుడైన డ్రా చేసుకోవచ్చన్న వెసలుబాటు కల్పించారు. ఇలా 49 మండలాలుంగా 47 మండలాల్లో కార్లు వినియోగిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తప్పకుండా అద్దె వాహనం ఏర్పాటు చేసుకోవాలి. సొంత వాహనాలనే అద్దె వాహనాలుగా చలామని చేస్తున్నారు. ఇలా ఒకటి రెండు కాదు.. జిల్లా వ్యాప్తంగా 90 శాతానికిపైగా ఇదే తంతు సాగుతోంది. వాస్తవానికి ఎవరు ఏ వాహనాన్ని తీసుకున్నారు? ఆ యజమాని ఎవరు? డ్రైవర్ పేరు.. అతడి లైసెన్సు వంటి వివరాలన్నీ డ్వామా పీడీ కార్యాలయానికి పంపాలి. కానీ ఆ ఊసేలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే.. దోపిడీ ఏ స్థాయిలో సాగుతుందో ఇదే నిదర్శనం. అద్దె వాహనాలు పెట్టారా? లేదా? అన్నది డ్వామా అధికార యంత్రాంగం కూడా కనీస శ్రద్ధ చూపలేదు. జిల్లా కేంద్రం నుంచి పీడీ, అదనపు పీడీలు, సహాయ పీడీలు క్షేత్ర పర్యటనకు వెళ్లే సంబంధిత ఉపాధి సిబ్బంది మాత్రమే వారి వెంట వెళ్తున్నారు. స్థానికంగా ఎంపీడీఓలు అసలు వెళ్లడం లేదు. ఉపాధి తమకు సంబంధం లేదన్న నిర్లక్ష్యం వైఖరి వీడలేదు. మండల స్థాయి పథక అధికారి (పీఓ) ఎంపీడీఓనే ఉంటారు. అందుకే ఆయన పేరుపైనే డిజిటల్ సంతకాల తాళం (డీఎస్కే) ఉంటుంది. ప్రతి బిల్లు చెల్లింపు ఎంపీడీఓ/ఏపీఓ ద్వారానే సాగుతుంది. నెలకు అద్దె రూ.35 వేలు... మండల స్థాయిలో ఉపాధి కీలక అధికారి ఎంపీడీఓనే. పూర్తిస్థాయి పర్యవేక్షణాధికారి ఆయనే. ఆయన ఒక్కరే రెగ్యులర్ అధికారి. మిగిలిన ఏపీఓ, ఈసీ, టీసీ, సీఓ.. వంటి కేడర్ల సిబ్బంది మొత్తం హెచ్ఆర్ పాలసీ కింద ఉన్నారు. అందుకే డీఎస్కే పీఓగా ఉన్న ఎంపీడీఓకే ప్రాధాన్యం ఇచ్చారు. మండలం అంతా విస్తృతంగా తిరిగి కూలీలకు పని దినాలు కల్పించడం. వారి సమస్యలు, బిల్లుల చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించడం.. వంటి సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కరించాలనే ఉద్దేశంతో అద్దె వాహన వసతిని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. సంబంధిత మండల సిబ్బందిని వెంట పెట్టుకుని మండలంలో తిరగాలి. ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబరు నుంచి వాహన వసతిని సమకూర్చారు. ఈ ఏడాది మార్చి దాకా ఈ సౌకర్యాన్ని కల్పిస్తూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి కమిషనర్ (సీఆర్డీ) ఉత్తర్వు ఇచ్చారు. మొదట్లో రెండు నెలలకు ఒకేసారి రూ.70 వేలు తీసుకున్నారు. ప్రస్తుతం ప్రతి నెలా తప్పుకుండా డ్రా చేస్తేన్నారు. ఇలా ఒక్కో ఎంపీడీఓ అద్దె వాహనం రూపంలో రూ.లక్షలు డ్రా చేశారు. మొత్తంగా నెలకు రూ.16.45 లక్షలు అద్దె వాహనాలకే వెళ్తోంది. ఎంపీడీఓలు ఏ వాహనం వాడుతున్నారు. దీనికి సంబంధించి వివరాలను నిర్దేశిత వెబ్సైట్లో అప్లోడ్ చేయడంతో నేరుగా సీఆర్డీ కార్యాలయం నుంచే అద్దె చెల్లించారు. ఈ వాహనాలకు సంబంధించి పీడీ కార్యాలయంలో ఏ వివరాలు లేవు. ఊసేలేని క్షేత్ర పర్యటన! ఉపాధి పనుల సీజన్ మొదలైంది. పల్లెలకు వెళ్లి కూలీలతో మాట్లాడాలి. గ్రామ సభలు నిర్వహించాలి. వలసలను నియంత్రించేలా పనులు చూపాలి. ఇందుకు సిబ్బందితో నిత్యం సమీక్షలు జరపాలి. జిల్లాలో ఎక్కువ శాతం ఎంపీడీఓలు ఇవేమీ పట్టడం లేదు. నివాస ప్రాంతాల నుంచి తమ కార్యాలయాలకు వెళ్లడం.. సిబ్బందిపై కర్ర పెత్తనం చెలాయించడానికే పరిమితం అయ్యారు. డ్వామా అధికారులు కూడా వారితో పనిచేయించడం లేదు. వారితో ఏనాడూ సమీక్ష జరపలేదు. అందుకే పని దినాలు కూడా రోజూ 60 వేలు కూడా దాటం లేదు. మరోవైపు.. వ్యక్తిగత పనులకే వాహనాలు ఎక్కువ శాతం వినియోగిస్తున్నారు. అత్యధిక శాతం మంది ఎంపీడీఓలు పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటుండటం, అక్కడి నుంచి ఎంపీడీఓ కార్యాలయానికి రావడం.. తిరిగి వెళ్లిపోవడం.. దీంతోనే ప్రభుత్వం కేటాయించిన 2,000 కిలో మీటర్లు ముగుస్తున్నాయి. ఇక తమకు కేటాయించిన దూరం తిరిగేశామని మిన్నకుండిపోతున్నా. ఈ విషయమై డ్వామా పీడీని వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. -
అధికారుల షి‘కారు’!
కలెక్టరేట్లోని అక్షర ప్రణాళిక భవన్లో గల ఓ శాఖకు చెందిన ద్వితీయ శ్రేణి అధికారి ఒకరు.. తన రెండు కార్లను తాను పని చేస్తున్న శాఖలోనే అద్దెకు పెట్టాడు. ఆ శాఖలో కొన్నేళ్లుగా అవే వాహనాలు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను అద్దెకు పెట్టినట్లు సదరు శాఖ జిల్లా అధికారికి తెలిసినా పట్టించుకోవడం లేదు. ఒక్క సదరు శాఖలోనే కాకుండా మరికొన్ని శాఖల్లో అధికారులు, ఉద్యోగులకు చెందిన వాహనాలనే ‘అద్దె’ ప్రాతిపదికన వినియోగిస్తున్నారు. కొంత మంది మండల స్థాయి అధికారులైతే నిబంధనలకు విరుద్ధంగా తెల్లరంగు నెంబర్ ప్లేట్ కలిగిన సొంత, బంధువుల కార్లను వాడుతున్నారు. ఇందూరు(నిజామాబాద్ అర్బన్): అక్రమార్జన కోసం కొందరు అధికారులు అడ్డదారి తొక్కుతున్నారు. వాహనాల అద్దెను కూడా అక్రమంగా వెనుకేసుకుంటున్నారు. తాము పని చేస్తున్న సొంత శాఖల్లో కొందరు జిల్లా అధికారులు తమ సొంత వాహనాలను లేదా బంధువులవి పెట్టుకుని ‘అద్దె’ డబ్బులను నెక్కొస్తున్నారు. ఇటు మండల స్థాయిలోనూ తహసీల్దార్లు, ఎంపీడీవోలు కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, దండిగా వేతనాలు పొందుతున్న అధికారులే.. ఇలా అద్దె డబ్బులపై కన్నేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా జిల్లాలో సుమారు 60 శాతం వరకు సొంత కార్లు, బంధువులవి అద్దె ప్రాతిపదికన కొనసాగుతున్నాయని సమాచారం. నిబంధనల ప్రకారం ప్రభుత్వ శాఖల్లో జిల్లా అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించడం కోసం అద్దె వాహనాలను పెట్టుకోవచ్చు. అయితే, సదరు వాహనాలకు పసుపు రంగు నెంబర్ (టాక్సీ) ప్లేట్ తప్పనిసరిగా ఉండాలి. తెల్ల రంగు నెంబర్ (ప్రైవేట్) ప్లేట్ కలిగిన వాహనాలను వినియోగించకూడదని కచ్చితమైన నిబంధనలున్నాయి. కానీ చాలా మంది అధికారులు తెల్ల రంగు నెంబర్ ప్లేట్ కలిగిన వాహనాలనే ఉపయోగిస్తూ ఆర్టీఏ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. అలాగే, అద్దె వాహనాలకు గతంలో 2500 కిలోమీటర్లు తిరిగినందుకు నెలకు రూ.25వేలు చెల్లించిన ప్రభుత్వం.. ప్రస్తుతం దీనిని రూ.35 వేలకు పెంచింది. అయితే కొన్ని సంవత్సరాల నుంచే ఆయా శాఖల్లో కొంత మంది జిల్లా అధికారులు అద్దె వాహనాలను వినియోగించకుండా సొంతవి లేదా బంధువులవి వినియోగిస్తున్నారు. డ్రైవర్ని పెట్టుకుని నెల నెల వేతనాలు చెల్లించగా, మిగతా డబ్బులు అధికారుల జేబుల్లోకి వెతున్నాయి. అదే విధంగా మండల స్థాయి అధికారులైన చాలా మంది తహసీల్దార్లు, ఎంపీడీవోలు కూడా సొంత వాహనాలను బహిరంగంగానే వినియోగిస్తున్నారు. వీటికి కూడా తెల్లరంగు కలిగిన నెంబర్ ప్లేట్లే ఉన్నాయి. తహసీల్దార్లు, ఎంపీడీవోలు తమ కార్యాలయాల్లో పని చేసే వీఆర్ఏలను, సిబ్బందిని డ్రైవర్లుగా పెట్టుకుని వాహనాలను నడిపిస్తున్న వారు కూడా కొందరున్నారు. మరి కొందరైతే డ్రైవర్‌కి వేతనం ఇచ్చే బదులు, వారే స్వయంగా వాహనాలను నడుపుతున్నారు. మండల స్థాయి అధికారులకు కలిసి వచ్చిన విషయం ఏంటం టే తహసీల్దార్లకు, ఎంపీడీవోలకు ప్రభుత్వం నెల వారీగా అద్దె డబ్బులు విడుదల చేయదు. ఎనిమిది నెలలు, సంవత్సరానికి ఒకసారి నిధులను ఒకే సారి మంజూ రు చేస్తుంది. దీంతో ప్రైవేటు వ్యక్తులు అద్దెకు నడపడానికి ముందుకు రావడం లేదనే ఉద్దేశంతో వారి సొంత కార్లను వినియోగిస్తున్నారు. -
ఇదో రకం ‘కార్’చిచ్చు
► తహసీల్దార్లకు ఏజెన్సీల ద్వారా అద్దె కార్లు ►కలెక్టరుకు ప్రభుత్వం ఉత్తర్వులు విజయనగరం గంటస్తంభం: అద్దె వాహనాల బిల్లులు డ్రా చేసుకుంటూ సొంత వాహనాల్లో తిరగడం తహసీల్దార్లకు ఇకపై కుదరదు. ఏజెన్సీల ద్వారానే అన్ని మండలాల తహసీల్దార్లుకు వాహనాలు సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఏజెన్సీల ద్వారా వాహనాలను సమకూర్చాలని, ఈ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు కలెక్టరు వివేక్‌యాదవ్ ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నారు. విధుల నేపథ్యంలో తహసీల్దార్లు పర్యటించడానికి ప్రభుత్వం వాహన సదుపాయం కల్పించిన విషయం విదితమే. తాలూకా కేంద్రాల్లో ఇందుకు ప్రభుత్వ వాహనాలుండగా మిగతా చోట్ల అద్దె వాహనాలు ఉండేవి. ప్రస్తుతం పురపాలకసంఘాల్లో మినహా ఎక్కడా సొంత వాహనాలు లేవు. ఈనేపధ్యంలో అందరూ అద్దె వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. సగానికిపైగా సొంత వాహనాలే జిల్లాలో 34మండలాలు ఉండగా అందులో 30మండలాల్లో అద్దె వాహనాలను వాడుతున్నట్లు తహసీల్దార్లు బిల్లులు డ్రా చేస్తున్నారు. ఒక్కో తహసీల్దారుకు ఇందుకు రూ.24వేలు విడుదల చేయాల్సి ఉండగా ప్రభుత్వం బడ్జెట్ తక్కువగా విడుదల చేస్తున్నందున నెలకు రూ.16వేల నుంచి రూ.22వేల మధ్య బిల్లును ప్రభుత్వం ఇస్తోంది. అరుుతే ఈ బిల్లులు డ్రా చేస్తున్న సగం మందకి పైగా తహసీల్దార్లు సొంత వాహనాలనే అద్దె వాహనాలుగా వాడుతున్నారు. మరి కొందరు వాహనాలు వాడకుండా ద్విచక్ర వాహనాలపై తిరిగేసి బిల్లులు డ్రా చేసుకుంటున్నారు. 10శాతం మంది మాత్రమే అద్దె వాహనాలను నిజంగా వాడుతున్నారు. ఒకే ఏజెన్సీ ద్వారా అద్దె వాహనాలు ఇకపై జిల్లా వ్యాప్తంగా ఒకే ఏజెన్సీ ద్వారా అద్దె వాహనాలు సమకూర్చాలని ప్రభుత్వం కలెక్టరుకు ఉత్తర్వులు జారీ చేసింది. పారదర్శకంగా ఒక ఏజెన్సీని ఎంపిక చేసి, వారు సమకూర్చే వాహనాలు తహసీల్దార్లకు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఒక్కో వాహనానికి రూ.36వేలు బిల్లు చెల్లించాలని, నెలకు ఆవాహనం 2,200 కిలోమీటర్లు తిరగాల్సి ఉంటుందని సూచించింది. ఈనేపథ్యంలో ఇక అందరూ ఏజెన్సీ సమకూర్చే వాహనాలు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇందుకు కలెక్టరు వివేక్‌యాదవ్ కూడా రంగంలోకి దిగారు. పారదర్శకంగా ఏర్పాటు చేయాలని సూచించడంతో టెండర్ల పక్రియ ద్వారా ఏజెన్సీని నిర్ణరుుంచాలని కలెక్టరు భావిస్తున్నారు. టెండరు నోటిఫికేషన్‌కు కలెక్టరేట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అరుుతే ఎటువంటి వాహనాలు సమకూర్చాలో చెప్పకపోవడంతో దీనిపై స్పష్టత లేదు. టెండరు విడుదల నాటికి ఒక నిర్ణయానికి వస్తారని అధికార వర్గాలు చెబుతున్న మాట. అరుుతే తహసీల్దార్లు మాత్రం బోలెరో వాహనాలు ఇవ్వాలని అడుగుతున్నారు. అంత మొత్తానికి ఆ వాహనాలు ఏజెన్సీలు సమకూరుస్తాయో లేదో అన్న చర్చ జరుగుతోంది. ఇదిలాఉండగా డ్రైవర్లను తాము సూచించిన వారినే పెట్టాలని తహసీల్దార్లు అడుగుతున్నారు. రెవెన్యూలో కొన్ని బయటకు చెప్పలేని విషయాలు ఉంటాయని, వాటిని వాహనాల్లో డిస్కస్ చేస్తే బయటకు పొక్కే అవకాశం ఉందంటున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంది. దీనిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. మొత్తానికి తహసీల్దార్లకు బల్క్‌గా అద్దె వాహనాలు సమకూర్చడం ఖాయం. -
ఆ కార్లనే తాకట్టు పెట్టాడు...
బీజింగ్: అద్దెకు తీసుకున్న కార్లనే తాకట్టు పెట్టాడు చైనాకు చెందిన ఓ ప్రబుద్ధుడు. వెన్జౌ నగరంలో నివసించే షీ(35) అనే వ్యక్తి అద్దెకు ఇచ్చే సంస్థలు, వ్యక్తుల నుంచి ఆడి, బిఎండబ్ల్యు, పోర్షే లాంటి ఖరీదైన కార్లను అద్దెకు తీసుకున్నాడు. 2014 మార్చి-సెప్టెంబరు మధ్య మొత్తం 23 కార్లను తాకట్టు పెట్టి రూ.6.5 కోట్ల రుణం తీసుకున్నాడు. కోటి రూపాయలు విలువ చేసే ఆడి ఆర్8 కారుని రూ. 28 లక్షలకు అద్దెకు తీసుకుని రూ. 63 లక్షలకు తాకట్టు పెట్టాడు. గతేడాది జూన్‌లో బాధితుల ఫిర్యాదు మేరకు అతడ్ని అరెస్టు చేశారు. కోర్టు అతనికి పన్నెండేళ్ల జైలు శిక్ష, రూ. 2.5 లక్షల జరిమానా విధించింది. -
అద్దె కారు.. యమా జోరు!
♦ కి.మీ. లెక్కన కాకుండా గంటల చొప్పున అద్దెకు కార్లు ♦ 11 మోడల్స్.. 50 కార్లు అందుబాటులో ♦ హైదరాబాద్‌లో సేవలు ప్రారంభించిన రేవ్ ♦ 1.5 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ ♦ రెండు నెలల్లో ముంబై, పుణెలకూ విస్తరణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కారు.. ఒకప్పుడు సంపన్నుల చిరునామా! ఇపుడైతే సామాన్యులకు అవసరంగా మారిపోయింది. కానీ అవసరమే కదా అని కారు కొనాలంటే... మాటలు కాదు. అందుకే! ఆ అవసరాన్ని అద్దెకు తీసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేక సంస్థలు కూడా పుట్టుకొచ్చాయ్. అయితే ఏ సంస్థ పాలసీ చూసినా.. కిలోమీటర్ల చొప్పున అద్దె చెల్లించాలి. అలాగని ట్యాక్సీ, క్యాబ్స్ సేవలను వినియోగించుకోనూలేం! ఎందుకంటే రెండు సందర్భాల్లోనూ జేబుకు భారమే! మరి కి.మీ.తో సంబంధం లేకుండా గంటల వారీగా కారును అద్దెకిస్తే! ఇదిగో... ఇలాంటి వ్యాపారమే చేస్తోంది రేవ్. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ... ఇటీవలే హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. మరిన్ని వివరాలు రేవ్ సహ వ్యవస్థాపకుడు కరణ్ జైన్ మాటల్లోనే... నేను, అనుపమ్ అగర్వాల్ మెకెన్సీ సంస్థలో పన్నెండేళ్లు పనిచేశాం. అప్పట్లో పనిమీద విదేశాలకు వెళ్లేవాళ్లం. 2-3 రోజులు అక్కడ తిరగాల్సి వచ్చేది. దీంతో మాకెదురయ్యే మొదటి సమస్య రవాణానే. ట్యాక్సీని బుక్ చేసుకుంటే బిల్లు పేలిపోయేది. కంపెనీ డబ్బే కదా అని సరిపెట్టుకునే వాళ్లం. ఇదే సమస్య సామాన్యులకూ ఎదురవుతుంది కదా!! అనిపించేది. కార్లను అద్దెకిచ్చే సంస్థను ప్రారంభించాలని అప్పుడే నిర్ణయించుకున్నాం. వినూత్నంగా ఉండాలనే ఉద్దేశంతో కి.మీ.లతో సంబంధం లేకుండా గంటల లెక్కన అద్దెకిచ్చే రేవ్ సం స్థను గతేడాది జూలైలో ప్రారంభించాం. ఇతర కార్ రెంటల్ సర్వీసులతో పోలిస్తే రేవ్‌లో 30-40% వరకు డబ్బు ఆదా అవుతుంది. 11 మోడల్స్... 50 కార్లు ప్రస్తుతం మా వద్ద హోండా సిటీ, మహీంద్రా స్కార్పియో, రెనాల్ట్ డస్టర్, ఆడి క్యూ 3, హ్యూండాయ్ ఐ10 గ్రాండ్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, టొయోటా ఇన్నోవా... ఇలా 11 మోడళ్లకు చెందిన 50 కార్లున్నాయి. ఈ ఏడాది ముగిసేలోగా 250-300 సొంత కార్లు కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కారును బుక్ చేయగానే ఇంటికి లేదా ఆఫీసుకు వచ్చి డెలివరీ చేస్తాం. ధరల విషయానికొస్తే ప్రారంభ ధర గంటకు రూ.59 నుంచి రూ.400 వరకూ ఉంది. ఈ ధరల్లో పన్నులు, బీమా కలిపే ఉంటాయి. కారు మోడల్, సమయాన్ని బట్టి ధరలు మారుతుంటాయి. సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.5,000 చెల్లించాలి. ఇది రిఫండబుల్. 2 నెలల్లో ముంబై, పుణెలకు విస్తరణ.. ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లో సేవలందిస్తున్నాం. ఇటీవలే మెకెన్సీ కంపెనీకి చెందిన 15 మంది డెరైక్టర్లు 1.5 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టారు. వీటితో మరో రెండు నెలల్లో ముంబై, పుణె నగరాల్లో సేవలు ప్రారంభిస్తాం. కంపెనీ ప్రారంభించిన ఆరు నెలల్లోనే 4 వేల మంది మా సేవలను వినియోగించుకున్నారు. ప్రస్తుతం రోజుకు 70-80 మంది కారును అద్దెకు తీసుకుంటున్నారు. వారాంతాలు, సెలవు రోజుల్లో అయితే ఈ సంఖ్య వందకు పైమాటే.