పోలీసుల అదుపులో నిందితులు
నాగోలు: ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్లను అద్దెకు ఇప్పిస్తామని పలువురి వద్ద కార్లు తీసుకుని కుదువపెట్టి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు, మీర్‌పేట పోలీసులు బుధవారం అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.4,70 లక్షల నగదు, 23 కార్లును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎల్‌బీనగర్ క్యాంప్ కార్యాలయంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. బండగ్‌పేటకు చెందిన కండల శ్రీకాంత్‌చారి 2007లో ముఖ్యమంత్రి కార్యాలయంలో తాత్కాలిక డ్రైవర్‌గా పనిచేశాడు. అయితే అతడికి డ్రైవింగ్ సరిగా రాకపోవడంతో విధుల్లో నుంచి తొలగించారు. ఈ సందర్భంగా అతను అక్కడ అద్దెకు తీసుకునే వాహనాల వివరాలు తెలుసుకున్నాడు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు గాను మోసాలకు తెరలేపాడు. తనకు తెలిసిన వారి వద్ద నుంచి కార్లు తీసుకుని సీఎం కార్యాలయంలో అద్దెకు పెట్టిస్తానని నమ్మించి నెలకు రూ. 30 వేల చొప్పున కిరాయి ఇస్తానని చెప్పి 30 కార్లను తీసుకున్నాడు.
అనంతరం అమీర్‌పేట్‌కు చెందిన సదర్ మహేందర్ సింగ్‌తో కలిసి వాటిని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో కుదవపెట్టి రుణాలు తీసుకున్నాడు. ఈ డబ్బులతోనే కారు ఓనర్లకు మొదటి విడత కిరాయి చెల్లించేవాడు. ఆ తర్వాత కిరియి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఏడు కార్లకు జీపీఎస్ ఉండంతో యజమానులు వాటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మరి కొందరు అద్దె చెల్లించకపోవడం, కార్లు కనిపించపోవడంతో ఎస్‌ఓటీ పోలీసులకు ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు శ్రీకాంత్‌చారి, సర్దార్‌మహేందర్ సింగ్‌లను అరెస్ట్ చేసి వారని నుంచి 23 కార్లను స్వాధీనం చేసుకున్నారు.కాగా శ్రీకాంత్‌చారి డబుల్‌బెడ్ రూమ్ ఇప్పిస్తామని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రూ 10.65 లక్షల వసూలు చేసిన కేసులో నిందితుడిగా ఉన్నట్లు తెలిపాడు. అంతేగాక ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళను మోసం చేసినట్లు తెలిపారు. అతడిపై మీర్‌పేట పరిధిలో 6, సరూర్‌నగర్, వనస్థలిపురం, బంజారాహిల్స్, పంజాగుట్ట స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 23 కార్లు, రూ.4.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎస్‌ఓటీ అడిషనల్ డీసీపీ సురేందర్‌రెడ్డి, సీఐ రవికుమార్, ఎస్‌ఐ రాజు,యాదయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment