సాక్షి, సిటీబ్యూరో: సోషల్‌మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో లవ్ ఆ్రస్టాలజర్ గోపాల్ శాస్త్రిగా ప్రకటనలు ఇచ్చి, సంప్రదించిన వారిని నిండా ముంచుతున్న పంజాబ్‌లోని మొహాలీ ప్రాంతానికి చెందిన లలిత్ ఎట్టకేలకు చిక్కాడు. నగర యువతి నుంచి రూ.47.11 లక్షలు కాజేసిన ఇతడిని అక్కడ అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చినట్లు జాయింట్ సీపీ డాక్టర్ గజరావ్ భూపాల్ సోమవారం ప్రకటించారు.
వివరాల ప్రకారం.. లలిత్ తండ్రి గోపాల్ చాంద్ జ్యోతిష్యుడు. ఆయన నుంచి వారసత్వంగా ఈ విద్యను నేర్చుకుని వృత్తి చేపట్టాడు. కొన్నాళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలు తెరిచిన లలిత్ ఆన్‌లైన్ జ్యోతిష్యమంటూ గూగుల్, యూట్యూబ్స్‌లో యాడ్స్ ఇచ్చాడు. నగరానికి చెందిన ఓ యువతి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. జాతకాలు, పూజలపై నమ్మకం ఉన్న ఆమె కొన్ని వ్యక్తిగత సమస్యల నేపథ్యంలో వాటి పరిష్కారం కోసం ప్రయత్నాలు చేసింది. ఇలా ఉండగా ఆన్‌లైన్‌లో వచ్చిన ఓ ప్రకటన ఆమె దృష్టిని ఆకర్షించింది. అందులోని ఫోన్ నంబర్‌లో సంప్రదించింది. తన విషయాన్ని గోపాల్ శాస్త్రిగా చెప్పుకున్న లలిత్‌కు చెప్పగా సమస్యలు పరిష్కరిస్తానంటూ నమ్మబలికాడు.
తొలుత ఆమె వివరాలు తెలుసుకున్న బురిడీ బాబా ఏదో పరిశీలనలు చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చాడు. చివరకు జాతకంలో కొన్ని దోషాలు ఉన్నాయని, నివారణ పూజలు చేసి సరిదిద్దుతానని నమ్మబలికాడు. పూజ ప్రారంభించడానికి, ఇతర ఖర్చులకు రూ.32 వేలు చెల్లించాలని కోరాడు. ఇలా మొదలెట్టిన అతగాడు పలు దఫాలుగా రకరకాల పేర్లు చెప్పి ఆమె నుంచి రూ.47.11 లక్షలు వసూలు చేశాడు. బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన ఆదేశాలతో కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ కె.హరిభూషణ్‌రావు నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసింది. లలిత్‌ను మొహాలీలో అరెస్టు చేసి పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చింది. గతంలో పాతబస్తీకి చెందిన ఓ మహిళ కూడా ఇదే తరహాలో రూ.4 లక్షలు కోల్పోయింది. ఆ నేరంలో ఇతడి ప్రమేయంపై ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment