సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ).. అద్దె వాహన సేవలను ప్రారంభించింది. ‘మారుతీ సుజుకీ సబ్‌స్క్రైబ్’ పేరిట తాజా సర్వీసులను గురువారం అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానంలో కస్టమర్లు కారును కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా, లీజు పద్ధతిలో నచ్చిన కారును వినియోగించుకోవచ్చు. మారుతీ స్విఫ్ట్, డిజైర్, విటారా బ్రెజా, నెక్సా, బాలెనో, ఎర్టిగా, సియాజ్, ఎక్స్‌ఎల్ 6 కార్లను లీజు సభ్యత్వ సేవలో పొందవచ్చని కంపెనీ ప్రకటించింది. 24, 36, 48 నెలల కాలపరిమితితో ఈ కార్లను అందజేస్తున్నట్లు వివరించింది.
నెలవారీ చందాలోనే కారు నిర్వహణ, బీమా మొత్తాలు కలిపి ఉంటాయని స్పష్టం చేసింది. భారత్‌లో ఈ సేవలను అందించడం కోసం.. జపాన్‌కు చెందిన ఒరిక్స్ ఆటో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం బెంగళూరు, గురుగ్రామ్ నగరాల్లో లీజింగ్ సేవలను అందిస్తున్నామని, త్వరలోనే ఈ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీ ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment