అద్దె కారు.. యమా జోరు! | reant a car new 11 models 50 cars starting service a revv | Sakshi
Sakshi News home page

అద్దె కారు.. యమా జోరు!

Published Sat, Jan 30 2016 12:00 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

అద్దె కారు.. యమా జోరు! - Sakshi

అద్దె కారు.. యమా జోరు!

కి.మీ. లెక్కన కాకుండా గంటల చొప్పున అద్దెకు కార్లు
11 మోడల్స్.. 50 కార్లు అందుబాటులో
హైదరాబాద్‌లో సేవలు ప్రారంభించిన రేవ్
1.5 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ
రెండు నెలల్లో ముంబై, పుణెలకూ విస్తరణ

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కారు.. ఒకప్పుడు సంపన్నుల చిరునామా! ఇపుడైతే సామాన్యులకు అవసరంగా మారిపోయింది. కానీ అవసరమే కదా అని కారు కొనాలంటే... మాటలు కాదు. అందుకే! ఆ అవసరాన్ని అద్దెకు తీసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేక సంస్థలు కూడా పుట్టుకొచ్చాయ్. అయితే ఏ సంస్థ పాలసీ చూసినా.. కిలోమీటర్ల చొప్పున అద్దె చెల్లించాలి.

అలాగని ట్యాక్సీ, క్యాబ్స్ సేవలను వినియోగించుకోనూలేం! ఎందుకంటే రెండు సందర్భాల్లోనూ జేబుకు భారమే! మరి కి.మీ.తో సంబంధం లేకుండా గంటల వారీగా కారును అద్దెకిస్తే! ఇదిగో... ఇలాంటి వ్యాపారమే చేస్తోంది రేవ్. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ... ఇటీవలే హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. మరిన్ని వివరాలు రేవ్ సహ వ్యవస్థాపకుడు కరణ్ జైన్ మాటల్లోనే...

నేను, అనుపమ్ అగర్వాల్ మెకెన్సీ సంస్థలో పన్నెండేళ్లు పనిచేశాం. అప్పట్లో పనిమీద విదేశాలకు వెళ్లేవాళ్లం. 2-3 రోజులు అక్కడ తిరగాల్సి వచ్చేది. దీంతో మాకెదురయ్యే మొదటి సమస్య రవాణానే. ట్యాక్సీని బుక్ చేసుకుంటే బిల్లు పేలిపోయేది. కంపెనీ డబ్బే కదా అని సరిపెట్టుకునే వాళ్లం.

ఇదే సమస్య సామాన్యులకూ ఎదురవుతుంది కదా!! అనిపించేది. కార్లను అద్దెకిచ్చే సంస్థను ప్రారంభించాలని అప్పుడే నిర్ణయించుకున్నాం. వినూత్నంగా ఉండాలనే ఉద్దేశంతో కి.మీ.లతో సంబంధం లేకుండా గంటల లెక్కన అద్దెకిచ్చే రేవ్ సం స్థను గతేడాది జూలైలో ప్రారంభించాం. ఇతర కార్ రెంటల్ సర్వీసులతో పోలిస్తే రేవ్‌లో 30-40% వరకు డబ్బు ఆదా అవుతుంది.

11 మోడల్స్... 50 కార్లు
ప్రస్తుతం మా వద్ద హోండా సిటీ, మహీంద్రా స్కార్పియో, రెనాల్ట్ డస్టర్, ఆడి క్యూ 3, హ్యూండాయ్ ఐ10 గ్రాండ్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, టొయోటా ఇన్నోవా... ఇలా 11 మోడళ్లకు చెందిన 50 కార్లున్నాయి. ఈ ఏడాది ముగిసేలోగా 250-300 సొంత కార్లు కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కారును బుక్ చేయగానే ఇంటికి లేదా ఆఫీసుకు వచ్చి డెలివరీ చేస్తాం. ధరల విషయానికొస్తే ప్రారంభ ధర గంటకు రూ.59 నుంచి రూ.400 వరకూ ఉంది. ఈ ధరల్లో పన్నులు, బీమా కలిపే ఉంటాయి. కారు మోడల్, సమయాన్ని బట్టి ధరలు మారుతుంటాయి. సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.5,000 చెల్లించాలి. ఇది రిఫండబుల్.

 2 నెలల్లో ముంబై, పుణెలకు విస్తరణ..
ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లో సేవలందిస్తున్నాం. ఇటీవలే మెకెన్సీ కంపెనీకి చెందిన 15 మంది డెరైక్టర్లు 1.5 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టారు. వీటితో మరో రెండు నెలల్లో ముంబై, పుణె నగరాల్లో సేవలు ప్రారంభిస్తాం. కంపెనీ ప్రారంభించిన ఆరు నెలల్లోనే 4 వేల మంది మా సేవలను వినియోగించుకున్నారు. ప్రస్తుతం రోజుకు 70-80 మంది కారును అద్దెకు తీసుకుంటున్నారు. వారాంతాలు, సెలవు రోజుల్లో అయితే ఈ సంఖ్య వందకు పైమాటే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement