
ముంబయి: మహారాష్ట్రలోని పుణె నగరానికి వరద ముప్పు పొంచి ఉందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) హెచ్చరించింది. భారీ వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నందున పుణెకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో రెండు టీమ్‌ల ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పుణె, చించ్‌వాడ్,బలివాడిలో సిద్ధంగా ఉంచారు.
పుణె, పింప్రి చించ్‌వాడ్ నగరాల్లోని పౌరులు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఆయా మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు కోరారు. రెండు నగరాల్లోని డ్యాముల నుంచి నీటిని కిందకు వదులుతుండటంతో వరదలు పోటెత్తే అవకాశముంది.
డిప్యూటీ సీఎం అజిత్‌పవార్ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. ముంబైలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో నగరానికి ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గత కొన్ని రోజులుగా ముంబైలో దట్టమైన గాలులతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి.