ప్రభుత్వ ఖజానాకు గండికొట్టే అక్రమార్కులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిఘా ముమ్మరం చేశారు. ఏడాది కాలంలో లక్ష్యానికి మించి ఆదాయాన్ని సమకూర్చారు. ప్రజా పంపిణీ బియ్యం అక్రమ రవాణ , ఇసుక రీచ్‌ల అవకతవకలకు బాధ్యులైన కొంతమంది అధికారులపై నివేదికలు తయారుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 విజిలెన్స్ యూనిట్లలో గుంటూరు అధికారులు అధిక స్థాయిలో కేసులు నమోదు చేసి భారీ మొత్తంలో జరిమానా వసూలు చేశారు.సాక్షి, గుంటూరు: ప్రభుత్వ ఖజానాకు చేరకుండా పన్ను ఎగవేత జరుగుతున్న చోట విజిలెన్స్ అధికారులు ప్రత్యక్షమవుతున్నారు. 2012-2013 ఆర్థిక సంవత్సరానికి రూ.150 కోట్లు లక్ష్యం కాగా, రూ.250 కోట్లకు పైగా ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు సమకూర్చి లక్ష్యాన్ని అధిగమించారు.
ఆర్థిక సంవత్సరం పూర్తవడానికి ఉన్న మూడు నెలల కాలంలో మరో రూ.40 నుంచి రూ.50 కోట్లు ఆదాయం రావచ్చని విజిలెన్స్ ఎస్పీ ఎంఎన్ అమ్మిరెడ్డి తెలిపారు. రెవెన్యూ, మైనింగ్, వ్యవసాయం, వాణిజ్య తదితర శాఖలకు సంబంధించిన అక్రమాలపై ఇప్పటికే 300కు పైగా కేసులు నమోదు చేశారు. దాడులు చేసి వాణిజ్యశాఖ పన్ను ఎగవేతకు సంబంధించి రూ.121 కోట్లు, మైనింగ్ శాఖలో రాయ ల్టీ, సీనరే జీలకు సంబంధించి రూ.9 కోట్లు, వ్యవసాయశాఖకు సంబంధించి రూ.50 కోట్లు ఆదాయాన్ని రాబట్టగలిగారు.
పౌరసరఫరాల శాఖలో అక్రమాలు
జిల్లాలో పౌరసరఫరాల శాఖ లో అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా జాయిం ట్ కలెక్టర్ వివేక్‌యాదవ్, ఆ శాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పకడ్బందీ ప్రణాళికలు చేపడుతున్నప్పటికీ, పీడీఎస్ బియ్యం, నీలి కిరోసిన్ అక్రమ తరలింపు మాత్రం ఆగడం లేదు. విజిలెన్స్ అధికారుల దాడులే ఇందుకు నిదర్శనం. ఇప్పటి వరకు వీరి దాడుల్లో రూ.1.45 కోట్ల విలువైన 8826 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సరుకులు తరలిస్తున్న 100 వాహనాలను సీజ్‌చే శారు. వీటికి సంబంధించి 244 (6ఏ) కేసులు, 86 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. 200 మందికి పైగా అరెస్టుచేశారు. బియ్యం అక్రమ తరలింపులో పల్నాడు, నీలి కిరోసిన్ అక్రమాలు రేపల్లె, నిజాంపట్నం ప్రాంతాల్లో చోటుచేసుకోవడం గమనార్హం. వీటిపై ప్రభుత్వానికి 500 నివేదికలు పంపగా, అందుకు బాధ్యులైన కొందరు అధికారులపై చర్యలకు కూడా సిఫార్సు చేశారు.
వాహనాల తనిఖీ ముమ్మరం
ప్రభుత్వ ఖజానాకు పన్ను ఎగవేస్తూ అక్రమ మార్గంలో నడిచే సరుకుల రవాణాపై విజిలెన్స్ దృష్టిసారించి, వాహనాల తనిఖీని ముమ్మరం చేసింది. దీని ద్వారా ఆదాయ సేకరణ లక్ష్యం రూ.2.59 కోట్లు కాగా, లక్ష్యానికి మించి రూ.2.83 కోట్లు ఆదాయం వచ్చింది. వ్యవసాయశాఖకు సంబంధించి 59 క్వింటాళ్ల ఎరువులు, పురుగుమందులు, నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇసుక రీచ్‌ల దందాపై నివేదికలు.. బినామీ సొసైటీల పేరుతో నడుస్తున్న ఇసుక రీచ్‌ల వ్యవహారాలపై కూడా విజిలెన్స్ అధికారులు నివేదికలు తయారుచేశారు. అమరావతి, అచ్చం పేట, మల్లాది, జువ్వలపాలెం, తుళ్లూరు, గొడవర్రు రీచ్‌లకు సంబంధించిన అక్రమాలపై ఇప్పటికే ప్రభుత్వానికి పలు నివేదికలు అందాయి. అదేవిధంగా మందుల కొనుగోలులో అక్రమాలపై నిజాలు నిగ్గుతేల్చిన విజిలెన్స్ నివేదిక ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది.
సరుకుల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి
Published Wed, Dec 18 2013 4:29 AM | Last Updated on Mon, Oct 22 2018 2:02 PM
Advertisement
Advertisement