ప్రసన్న వదనం...పనిలో ఘనం | ias vivek yadav Special interview | Sakshi
Sakshi News home page

ప్రసన్న వదనం...పనిలో ఘనం

Published Sun, Dec 17 2017 10:54 AM | Last Updated on Thu, Sep 27 2018 3:19 PM

ias vivek yadav Special interview - Sakshi

చూడ్డానికి ప్రశాంతంగా కనిపిస్తారు... అయినా పనిలో మాత్రం ప్రగతిచూపుతారు. ముంబైలో పుట్టి... వివిధ రాష్ట్రాల్లో విద్యనభ్యసించి... ఇప్పుడు విజయనగరం జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనే వివేక్‌యాదవ్‌. వివేకంతో ఆలోచించడం... పట్టుదలగా పూర్తి చేయడం ఆయన నైజం. నేవీ కుటుంబంలో పుట్టిన ఆయన ఇంజినీరింగ్‌ చదివి టెలికాం సెక్టార్‌లో ఉన్నత ఉద్యోగం చేశారు. అయినా తండ్రి కల నెరవేర్చేందుకు ఐఏఎస్‌ అయ్యారు. విజయనగరాన్ని బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్న సదాశయంతో ఓ భారీ క్రతువు నిర్వహిస్తున్నారు. ఐఏఎస్‌ అంటే ఉద్యోగం కాదని, అది ఓ బాధ్యతని అంటున్న వివేక్‌ యాదవ్‌తో ‘సాక్షి ప్రతినిధి’ ప్రత్యేక ఇంటర్వ్యూ ఈ వారం సండే స్పెషల్‌.

సాక్షి: నమస్తే సర్‌..మీ కుటుంబం, చదువు గురించి తెలుసుకోవాలని ఉంది..చెప్పండి?
కలెక్టర్‌: మా నాన్న మోతీలాల్, అమ్మ కాంతి.. నాన్న 1969లో నేవీలో జాయిన్‌ అయ్యారు. విశాఖపట్నంలోనే ట్రైనింగ్‌ తీసుకున్నారు. ఉద్యోగరీత్యా బదిలీపై చాలా ప్రాంతాలకు వెళ్లాం. 1981లో ముంబైలో ఉంటున్నప్పుడు నేను పుట్టాను. నేవీలో రిటైర్‌ అయిన తర్వాత నాన్న కొన్నాళ్లు ఉత్తర్‌ప్రదేశ్‌లో మావోయిస్టు ప్రభావిత మారుమూల ప్రాంతంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌లోని ఎన్‌టీపీసీ ప్రాజెక్ట్‌లో పనిచేశారు. నా స్టడీ అక్కడే కేంద్రీయ విద్యాలయంలో జరిగింది. లక్నో దగ్గర సుల్తాన్‌పూర్‌లోని స్టేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదివాను. చదువయ్యాక సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలీమాట్రిక్స్‌(సిడాట్‌)లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా చేరాను. మేం ఇద్దరం అన్నదమ్ములం. తమ్ముడు డాక్టర్‌. చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ (సీఎ) చదివిన రూలీ నా భార్యగా వచ్చారు. మాకు ఐదేళ్లు, ఏడాదిన్నర వయసున్న ఇద్దరు పిల్ల లున్నారు. నా భార్య ప్రస్తుతం గృహిణిగా పిల్లల్ని, నన్ను చూసుకుంటున్నారు. మొదటి పాప అనన్య తెలంగాణలోని వరంగల్‌లో పుడితే రెండవ పాప వరణ్య ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో పుట్టింది. మామగారు డీజీపీగా పనిచేసేవారు. 

సాక్షి: ‘ఐఏఎస్‌’ వైపు అడుగులెలా పడ్డాయి?
కలెక్టర్‌: బీటెక్‌ తర్వాత సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరాను. టెలికాం సెక్టార్‌లో పనిచేస్తూ మూడు సార్లు సివిల్స్‌ రాశాను. మూడోసారి ర్యాంకు వచ్చింది. మాది మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ. రూరల్‌ ఏరియాతో కూడా కొంత టచ్‌ ఉండేది. ఊళ్లలో ఉన్నవారు తమ పిల్లల్ని కలెక్టర్‌గాచూడాలని ఆశపడుతుంటారు. మా నాన్న కూడా అలాగే ఆశపడ్డారు. అలాగని ఎప్పుడూ నన్ను ఒత్తిడి చేయలేదు. నా ఇష్టానికే ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ ఆయన కోరిక మేరకు కలెక్టర్‌ అయ్యాను. ఫస్ట్‌పోస్టింగ్‌ అదిలాబాద్‌ జిల్లా మంచిర్యాలలో. తర్వాత వరంగల్, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో పనిచేసి విజయనగరం వచ్చాను.

సాక్షి: ఉద్యోగంలో చేరాక మర్చిపోలేని  అనుభవం ఏదైనా ఉందా?
కలెక్టర్‌: ఐఏఎస్‌ పూర్తిచేసి సబ్‌కలెక్టర్‌గా ఉద్యోగంలోకి చేరిన కొత్తలో నాకు మూడే మూడు తెలుగు పదాలు వచ్చేవి. ‘రండి, కూర్చోండి, చెప్పండి.’ ఈ మూడే మాట్లాడి పదివేల ఎకరాల భూసేకరణ చేశాను. ఆ సమయంలో నా దగ్గరకు  భూ సమస్యతో ధోతీ వేసుకున్న ఒక 70 ఏళ్ల వృద్ధుడు వచ్చారు. సింగరేణి గనులకు భూములు ఇచ్చిన ఆయన తన భూమికి అందాల్సిన పరిహారం కోసం మా సిబ్బందిని అడుగుతున్నారు. అతని మాటలు నేను విని పిలిచి కూర్చోబెట్టి సమస్య తెలుసుకున్నాను. మంచినీళ్ళు తాగించి పరిహారం డబ్బులకు సంబంధించిన ‘చెక్‌’ అతని చేతిలో పెట్టాను. అది నేను ఉద్యోగంలో చేరాక చేసిన మొదటి మంచిపని. ఆ రోజు అనిపించింది, ఐఏఎస్‌ అంటే ఉద్యోగం కాదు బాధ్యత అని. మన వల్ల చిన్న మంచి జరిగినా చాలని. చెక్‌ అందుకున్న ఆ పెద్దాయన కళ్లల్లో కనిపించిన కృతజ్ఞత నిండిన కన్నీళ్లు ఇప్పటికీ నా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి.

సాక్షి: ఓడీఎఫ్‌ను 14వ ఆర్థిక సంఘం నిధులతో ముడిపెట్టడానికి కారణం?
కలెక్టర్‌: ఓడీఎఫ్‌కు సంబంధించి 14వ ఆర్థిక సంఘ నిధుల్లో  ఫండ్‌ని కొంత ఆపాం. ఆ నిధులను ఓడీఎఫ్‌కి మార్చడం వల్ల చాలా మంది వచ్చి పంచాయతీలకు ఇబ్బంది కలుగుతోందని అన్నారు. ఫిబ్రవరి 15 కల్లా వారి గ్రామాలను  ఓడిఎఫ్‌ గ్రామాలుగా డిక్లేర్‌ చేస్తే ఆ నిధులు ఇచ్చేస్తామని, ముందే కావాలంటే ఆ మేరకు డిక్లరేషన్‌ ఇవ్వాలని చెప్పాం. ఇవి కేంద్రం నిధులు కనుక ఈ పారామీటర్స్‌ అందరూ పాటించాల్సిందే. గ్రామాల సంరక్షణ సర్పంచ్‌ పైనే ఉంటుంది. కేవలం కమిట్‌మెంట్‌ కోసమే ఆ మాట చెప్పాం.

సాక్షి: విజయనగరంలో విజయాలు, లక్ష్యాలు?
కలెక్టర్‌: 2014 లెక్కల ప్రకారం.. రూరల్‌ ఏరియాల్లో 9 శాతం మాత్రమే వ్యక్తిగత మరుగుదొడ్లు కలిగి ఉన్నారు. 4లక్షల40వేల కుటుంబాలు ఉంటే 40వేల కుటుంబాలకు మాత్రమే మరుగుదొడ్లు ఉండేవని అప్పటి లెక్కలో తేలింది. అక్కడి నుంచి ఉద్యమంలా మొదలుపెడితే ఈ రోజు 58 శాతానికి తీసుకురాగలిగాం. బిల్లులు మంజూరు సరళీకృతం చేయడంతో పాటు, టెక్నాలజీపై అవగాహన కల్పించాం. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు కూడా  బాగా సహకరిస్తున్నారు. ఫిబ్రవరి 15నాటికి ఓడీఎఫ్‌కు చేరాలన్న లక్ష్యంపై ఈ నెల 27న ఓ సదస్సు ఏర్పాటు చేయనున్నాం. మరుగుదొడ్లకు స్థలం లేని వారు కూడా చాలా మంది ఉన్నారు. వారికి ఆ గ్రామంలోనే సామూహిక మరుగుదొడ్లు కట్టబోతున్నాం. బహిరంగ ప్రదేశాలకు వెళ్ళే వారిని కూడా ఆపేలా చర్యలు తీసుకోడానికి విజిలెన్స్‌ కమిటీని కూడా ఏర్పాటు చేశాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement