బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి మాటల స్ఫూర్తితో ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం అడుగుకో బార్‌కు అనుమతులు ఇచ్చేయనుంది. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో గల ఆహార పార్లర్స్‌లోను, బీచ్‌లలోనూ మద్యం విక్రయాలకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా బార్ లైసెన్స్ ల నిబంధనల్లో సవరణలు తీసుకువస్తూ గురువారం జీవో జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం జీవో 470ను జారీ చేశారు. బీచ్‌ల్లోను, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎక్కడపడితే అక్కడ బార్లను తెరవడానికి వీలుగా కనీసం నిర్మాణ జాగాను తగ్గించేశారు. కనీసం 200 చదరపు మీటర్ల నిర్మాణ స్థలం ఉండాల్సి ఉండగా ఇప్పుడు బార్ల ఏర్పాటునకు కనీసం 100 చదరపు మీటర్లు ఉంటే చాలని నిబంధనల్లో సవరణలు చేశారు.