ఏ విలువలకీ విష సంస్కృతి?
రెండో మాట
సంస్కరణల తదుపరి మొదలైన విశృంఖల పాలనా పద్ధతులలో భాగమే పర్యాటక పరిశ్రమకు ప్రోత్సాహం పేరిట పాశ్యాత్య విష సంస్కృతిని ప్రోత్సహించడం. ఏపీ ప్రభుత్వం దేశ విదేశాల నుంచి 9 వేల జంటలను ఆహ్వానించి బీచ్ లవ్ ఫెస్టివల్‌ను నిర్వహించబోవడం ఇందులో భాగమే. గోవాకే పరిమితమైన ‘బీచ్ లవ్’ సంస్కృతిని బీజేపీ మద్ధతుతో నడుస్తున్న టీడీపీ ప్రభుత్వం కూడా ఆశ్రయిస్తోంది. భారతీయ ప్రాచీన సంస్కృతిని ఆరాధకుల మనే బీజేపీ పాలకులకు ఈ ‘బీచ్ లవ్’ ఎలా నప్పిందో ప్రజలకు వారు వివరించాలి.
పెట్టుబడిదారీ వ్యవస్థ విశృంఖల విహారాన్ని నేడు మన దేశంలో వివిధ స్థాయిలలో కళ్లారా చూస్తున్నాం. రకరకాల మార్గాలలో ఇది ప్రదర్శితమ వుతోంది. 1991లో ప్రపంచబ్యాంకు-అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు జమిలిగా ‘‘నూతన సమాచార వ్యవస్థ’’ వెన్నుదన్నుగా ప్రజా వ్యతిరేక ‘సంస్కరణ’లకు తెరఎత్తాయి. తద్వారా అమెరికా పతనమవుతున్న తమ సామ్రాజ్య పెట్టుబడి వ్యవస్థ ఆర్థిక చట్రాన్ని, కోల్పోతున్న మార్కెట్‌ను రక్షించుకునే ప్రయత్నంలో ‘ప్రపంచీకరణ’ మంత్రదండంతో వర్ధమాన దేశా లను తన సరుకులతో నింపదలచింది. పర్యవసానంగా భారత పాలకవర్గాలు (కాంగ్రెస్-బీజేపీ) ప్రపంచ బ్యాంకు ద్వారా అమలులోకి తెచ్చిన సంస్కర ణలలో భాగంగానే అన్నిరకాల అవలక్షణాలు ఆర్థికంగానే గాకుండా సాంస్కృ తికంగా కూడా మన దేశాన్ని ముప్పెరగొన్నాయి. వాటిలో భాగమే మన పాలకులు ఆ సంస్కరణలపై బేషరతుగా ముద్రవేయడం. ఆ ‘ముద్ర’ కాస్తా దేశం ఉసురు తీస్తోంది. యువతను పక్కదారులు పట్టించి చెడగొట్టే విష సంస్కృతిని వ్యాపింపజేయడంద్వారా, ప్రజావ్యతిరేక సంస్కరణల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను, సంస్కృతి, సంప్రదాయాలను వినాశనం వైపుగా మళ్లించి, తమకు శాశ్వత బానిసగా పడి ఉండే ఇండియాను తయారు చేయ డమే అమెరికా లక్ష్యం.
సంస్కరణలవల్లే కుక్కమూతి పిందెల సంస్కృతి
1991లో ఈ ప్రక్రియను ప్రారంభించిన మన్మోహన్ సింగ్, నాటి ప్రధాని పీవీ నరసింహారావుకన్నా వరల్డ్ బ్యాంకు ‘సంస్కరణల’ను దేశంలోని ఇతర రాష్ట్రాలకన్నా మూడేళ్లు ముందుగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆచరణలో పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కాగా, బీజేపీ నాయకునిగా. ప్రధాన మంత్రి హోదాలో వాజ్‌పేయి మరొక అడుగు ముందుకు వేసి సంస్కరణ లను పెద్ద ఎత్తున అమలులోకి తెచ్చే ప్రక్రియను ‘‘వెలిగిపోతున్న భారతం’’ అన్నారు. నాయకులు, వారి అనుయాయులంతా ఆర్థికంగా ‘వెలిగి’పోయా రుగానీ, దేశ సామాన్య ప్రజాబాహుళ్యం బతుకులు మాత్రం చీకట్లోకి జారు కున్నాయి. ఆనాటి నుంచి ఈనాటి దాకా సామాజికంగానే గాక సాంస్కృతి కంగా కూడా ఈ సంస్కరణలు బతుకు విలువల్ని నైతిక విలువలను దిగజా రుస్తూనే వచ్చాయి. ఈ సర్వవ్యాపిత పతన సంస్కృతిలో భాగంగానే సాంస్కృ తిక రంగంలోనూ కుక్కమూతి పిందెలు మొలకెత్తి ఎదిగిపోతున్నాయి.
ఇందుకు ఉదాహరణ దేశంలో పలు చోట్ల మహిళలు, విద్యార్థులు, వృత్తిదా రులు, కార్మిక, బలహీన వర్గాలపైన అనేక అత్యాచారాలు, దాడులూ పెరిగి పోతున్నాయి, హత్యల సంఖ్య రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతోంది. ముఖ్యంగా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఈ ప్రజా వ్యతిరేక కార్యకలాపాల్ని బహిర్గతం చేసే పాత్రికేయులపైన, పత్రికలపైన, విశ్వవిద్యాలయాలు, విద్యార్థి సంఘాలపైన, వాటి నాయకులపైన ప్రివెంటివ్ డిటెన్షన్, సెడిషన్ (రాజద్రోహ నేరం) చట్టాలను ప్రయోగించేందుకు పాలకులు సాహసిస్తు న్నారు. ఈ సంస్కరణల తదుపరి ఈ 20 ఏళ్లలోనే స్త్రీల మధ్యనే వివక్ష చూపే అందాల పోటీలు, బ్యూటీపార్లర్లు, క్యాట్వాక్లూ, ఆహార్యం, సౌందర్య పోషణ పేరిట వింత పోకడలూ చోటు చేసుకున్నాయి. సమానతా సూత్రం ప్రాతిపదికపై వనరుల పంపిణీ పద్ధతిలోగాక ప్రభుత్వాలు దుబారా పర్యటన లకు, మంత్రుల, ముఖ్యమంత్రుల విహార యాత్రలకూ మంచినీళ్లప్రాయంగా ఖర్చుపెడుతూ ప్రజల కనీస అవసరాలను తుంగలో తొక్కుతున్నారు.
పర్యాటక వృద్ధి పేరిట విశృంఖలత
ఈ విశృంఖల పాలనా పద్ధతులలో భాగమే పర్యాటక పరిశ్రమను ప్రోత్సహిం చడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి వనరులు సమకూర్చుకోవాలన్న యత్నం. స్థానిక, సంప్రదాయ కళల ద్వారా సంగీత, నృత్య విభావరులు పునాదిగా, దేశంలోని వివిధ స్థానిక సంస్కృతులకు ఆలవాలమైన జానపదుల కళారూపాల ద్వారా కూడా పర్యాటక రంగ ఆదాయ వనరులను పెంపొందించుకోవచ్చు. కానీ పాశ్చాత్య సంస్కృతి ద్వారా విష సంస్కృతిని పెంచి పోషించడం, స్థానిక యువత అభిరుచుల్ని పక్కదారులు పట్టించే ప్రయత్నాలు అభ్యంతరకరం. దేశ విదేశాల నుంచి 9 వేల జంటలను ఆహ్వా నించి, అందాల పోటీలు, హాలీవుడ్- బాలీవుడ్ తారల నృత్యాలు, వలంటైన్ (ప్రేమికుల) దినోత్సవాన్ని కలుపుకుంటూ ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 12 నుంచి 14 వరకూ ‘‘బీచ్ లవ్’’ ఉత్సవాలను నిర్వహించబోవడం ఇందులో భాగమే. అందుకే మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజా స్వామిక శక్తులూ ఈ ‘బీచ్ లవ్’ ఉత్సవాలను వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికి గోవాకే (బీజేపీ పాలన) పరిమితమైన ‘బీచ్ లవ్’ సంస్కృతిని బీజేపీ మద్ద తుతో నడుస్తున్న టీడీపీ ప్రభుత్వం కూడా ఆశ్రయిస్తోంది. నిత్యమూ భార తీయ ప్రాచీన సంస్కృతిని ఆరాధిస్తున్నట్టు కన్పించే బీజేపీ పాలకులకు ఈ ‘బీచ్ లవ్’ ఎలా నప్పిందో ప్రజలకు వారు వివరించాలి.
ఆచరణలో రాజ్యాంగానికి, రాజ్యాంగంలోని ప్రాథమిక పౌర బాధ్యతల అధ్యాయంలో 51-ఎ (హెచ్) అధికరణకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాల కులు పాలనకు అనర్హులవుతారు. సెక్యులర్ వ్యవస్థను రక్షించలేని వారు రాజ్యాంగ వ్యతిరేకులు. బ్యాంకు సంస్కరణలు అమలులోకి వచ్చిన తరువాత సమాజంలోని వివిధ సామాజిక వర్గాలపైన వాటి చెడు ప్రభావం ఎలా విస్తరిస్తూ వచ్చిందో, ముఖ్యంగా దేశ మహిళల జీవితాలపైన ఎలాంటి ప్రభావానికి దారిదీశాయో ‘బ్యాంక్-ఐఎంఎఫ్ సంస్కరణల కింద భారత మహిళల పనిపాటపైన ఎలాంటి ప్రభావం పడిందో’ ప్రసిద్ధ పరిశోధకురాలు రజనీ దేశాయ్ (1998 ఏప్రిల్ 24) వివరించారు. ఆమె ఇలా అన్నారు: ‘‘ఈ సంస్కరణలవల్ల పని చేసుకుంటూ దోపిడీకి గురైన శ్రామిక వర్గ మహిళలు అత్యధికులు. కేవలం ఆర్థిక కారణాలవల్ల ఆహారం, ఇతర నిత్యావసరాలు అందని పేద కుటుంబాలున్నాయి. ఈలోగా ప్రపంచబ్యాంకు ‘పొదుపు’ కార్య క్రమాలూ, ‘పథకాలు’ దూసుకు వచ్చిన ఫలితంగా ఆహార ధాన్యాల రేషన్ ధరలు బహిరంగ సంతలో రెట్టింపుకు పెరిగిపోయాయి.
ఈ మహిళా కార్మికుల్లో ఐదింట నాలుగు వంతులు వ్యవసాయ కూలీలు లేదా పేద రైతులు. వీరంతా అసంఘటిత కార్మికులు. ఈ ఆర్థిక దోపిడీకి తోడుగా నూతన ‘ఆర్థిక సంస్కరణల’ పేరు చాటున మహిళలపైన సాంస్కృతికం గానూ, సామాజికంగానూ దాడులు ముమ్మరం అయ్యాయి. సంస్కరణలు ప్రారంభమైన తరువాత అందాల పోటీల పేరిట మహిళల మధ్య ఒక రకమైన ఉన్మాద వాతావరణాన్ని ప్రేరేపిస్తున్నారు. ఈ ‘అందాల పోటీలు’ ఆధారంగా తమ సౌందర్యోపకరణ సరుకుల్ని విస్తృతంగా ప్రచారం చేసుకోవడానికి వీలు చిక్కింది. పట్టణాల్లోని మహిళల మనస్సులపైన, ముఖ్యంగా మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి యువతులపైన ఈ పోటీల ప్రభావం పడింది’’. దీంతో దేశ మంతటా బ్యూటీపార్లర్లు తామరతంపరగా వ్యాపించాయి. అందంగా ముఖాలు కనబడేలా చేసే ఫేసియల్ క్రీమ్స్ వచ్చాయి. అలా, మార్కెట్ ఎకా నమీ (సంత దోపిడీ) తత్వాన్నిబట్టి వ్యభిచార వృత్తిని కూడా ఒక ‘సేవా రంగం’గా పరిగణించే సంస్కృతిని పెంచేశారు.
స్త్రీని విపణి సరకుగా మార్చే విష సంస్కృతి
ఈ సంస్కరణల ప్రభావంతోనే కొన్ని దేశాల్లో విదేశీ మారక ద్రవ్య సంపాదన కోసం పర్యాటక పరిశ్రమలో భాగంగా ‘సెక్స్ టూరిజాన్ని’ ప్రవేశపెట్టారు. చివరికి పూర్వపు సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ దేశాల్లో కూడా బ్యాంక్-ఐఎంఎఫ్‌ల సంస్థాగత మార్పుల పేరిట ఈ సెక్స్ టూరిజాన్ని ప్రవేశ పెట్టారు. అలాగే ఇండియాలో కూడా అవే సంస్కరణల పేరిట టూరిజం ద్వారా ఆదాయం సంపాదించేందుకు ప్రభుత్వాలు సిద్ధం అయిన కొద్దీ ఈ విష సంస్కృతి ప్రబలిపోయే అవకాశాలూ పెరిగాయని కూడా రజనీ దేశాయ్ వివరించారు. అలాగే ప్రపంచీకరణ జపం ఫలితంగా సౌందర్య పోషకాల (కాస్మెటిక్స్) పరిశ్రమ కూడా దూసుకు వచ్చింది. ఇందుకు కార్పొరేట్లు ప్రచార, ప్రసార మాధ్యమాలైన మీడియాను విస్తారంగా వాడుకోవడం ప్రారంభించారు. ఫలితంగా ఈ పరిశ్రమ పదేళ్ల వ్యవధిలోనే (1991-2000) రూ.2,311 కోట్ల వ్యాపారం నుంచి రూ. 18,900 కోట్లకు పెరిగిపోయింది.
ఇక ‘మిస్ ఇండియా’ పోటీలూ పెరిగిపోయాయి. ఈ జాడ్యం కళాశాలల నుంచి ‘గల్లీల’కూ పాకిపోతూ వచ్చింది. ఈ పోటీలు స్త్రీల మధ్య వ్యత్యాస భావనను పనిగట్టుకుని మరీ పెంచేసిందని మరచిపోరాదు. అందుకే ఆనాడు గురజాడ స్త్రీల కన్నీటి గాథలకు కారణం నాకు తెలుసని అంటే, శ్రీశ్రీనే కాదు, ‘‘స్త్రీ స్త్రీ’’ని కూడా అన్నాడు. అలాగే ‘మనిషే బంగారమని’ వ్యత్యాస సంస్కృ తిని సాహిత్యపరంగా తుత్తునియలు చేసినవాడు మహాకవి రాబర్ట్ బర్న్స్. కానీ ప్రజా వ్యతిరేక ‘సంస్కరణ’లు దేశంలోనూ అంతర్జాతీయంగానూ ప్రవేశ పెట్టిన ఆంగ్లో-అమెరికన్ వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్‌లు మాత్రం ‘మహిళల్ని వ్యాపార వస్తువులు’గా పరిగణించే విష సంస్కృతికి తలుపులు తెరిచాయి. ఆ ఎంగిలిని మన పాలకులూ అభిమానించి, ఆదరించడం దుస్సహకారణమవు తోంది. బహుశా అందుకే వస్తుదాహ సంస్కృతిలో ఇంద్రజాల, మహేంద్ర జాల శక్తిని గుత్త పెట్టుబడిదారీ వ్యవస్థ శాశ్వత ప్రక్రియగా మార్చింది.
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in