
అన్ని వర్గాలతో చర్చించాకే నిర్ణయం
‘బీచ్ లవ్’పై పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీకాంత్ వివరణ
సాక్షి, విశాఖపట్నం: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖపట్నంలో నిర్వహించతలపెట్టిన బీచ్ లవ్ ఫెస్టివల్‌పై అన్ని వర్గాలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. ‘బాబు సర్కారు సమర్పించు బీచ్ లవ్’ శీర్షికతో ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలు సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేవిగానే ఉంటాయని పేర్కొన్నారు. బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహణకు బాధ్యులైన అధికారులు ఆ కార్యక్రమం ప్రతి దశలోనూ వ్యక్తిగతంగా డిప్యూటీ కలెక్టర్(విశాఖ) నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అనుమతి లేనిదే ఏ కార్యక్రమాన్నీ అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఇక్కడ సంస్కృతి, వారసత్వం, ప్రకృతి అందాలను అంతర్జాతీయంగా పర్యాటకుల దగ్గరకు తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ అభిమతమన్నారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు అమితంగా ప్రేమించే కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.
అది ప్రైవేటు కార్యక్రమం: టూరిజం రీజనల్ డెరైక్టర్
విశాఖలో బీచ్ లవ్ ఫెస్టివల్ పూర్తిగా ప్రైవేటు కార్యక్రమమని పర్యాటక శాఖ రీజనల్ డెరైక్టర్(విశాఖ) శ్రీరాములునాయుడు వివరణ ఇచ్చారు. దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందించడం లేదని స్పష్టం చేశారు. ఉత్సవం పేరుతో సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా కార్యక్రమాల నిర్వహణను అనుమతించబోమన్నారు. ఈ ఫెస్టివల్‌లో చేపట్టే కార్యక్రమాలపై కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించాకే అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు.