మూసీ పరీవాహకంలోని చారిత్రక భవనాలపై సీఎం రేవంత్
హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే ప్రతి కట్టడాన్ని పరిరక్షిస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: మూసీనది పరీవాహక ప్రాంతంలో చారిత్రక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు ముందుకురావాలని ఆయన పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతోపాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళుతోందని తెలిపారు. హైదరాబాద్‌లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు సీఐఐ(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ)తో రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఒప్పందం చేసుకుంది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ మూసీ ప్రక్షాళనను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ప్రస్తుతం పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తున్నామని, త్వరలోనే అందులో శాసనమండలి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం శాసనమండలి ఉన్న జూబ్లీహాలుకు చారిత్రక ప్రాధాన్యం ఉందని, ప్రత్యేక టెక్నాలజీతో ఆ భవనాన్ని నిర్మించారని, భవిష్యత్‌లో దాన్ని పరిరక్షించాల్సిన అవసరముందన్నారు. జూబ్లీహాలును కూడా దత్తత తీసుకొని పరిరక్షించాలని ఆయన సీఐఐకి సూచించారు.
ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని పరిరక్షిస్తామని, ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ స్టేడియానికి తరలిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. హైకోర్టు భవనం, హైదరాబాద్ సిటీ కాలేజ్ భవనంతో పాటు పురానాపూల్ బ్రిడ్జి వంటి కట్టడాలను కూడా పరిరక్షిస్తామని, ఇప్పటికే చారి్మనార్ పరిరక్షణ ప్రాజెక్ట్ కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్, సీఐఐ తెలంగాణ చైర్మన్ సాయిప్రసాద్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు.
పురాతన మెట్ల బావులను దత్తత తీసుకున్న పారిశ్రామికవేత్తలు
⇒ నగరంలో పురాతన మెట్ల బావులను పునరుద్ధరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. ఈ మేరకు సీఎం రేవంత్‌కు వారు ఒప్పందపత్రాలు అందజేశారు.
⇒ ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖా మెట్ల బావి పునరుద్ధరణకు ఇన్ఫోసిస్ సంస్థ ఒప్పందం చేసుకుంది.
⇒ సాయిలైఫ్ సంస్థ మంచిరేవుల మెట్ల బావిని దత్తత తీసుకుంది.
⇒ భారత్ బయోటెక్ సంస్థ సాలార్ జంగ్, అమ్మపల్లి బావులను పునరుద్ధరించనున్నది.
⇒ అడిక్‌మెట్ మెట్ల బావిని దొడ్ల డెయిరీ, ఫలక్‌నుమా బావిని ఆరీ్టసీ, రెసిడెన్సీ మెట్ల బావిని కోఠి ఉమెన్స్ కాలేజీ పునరుద్ధరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment