సాక్షి, వరంగల్ జిల్లా: బీఆర్‌ఎస్, బీజేపీ మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకోవాలని చూస్తున్నాయని.. జెండా, అజెండా పక్కనపెట్టి మూసీ అభివృద్ధికి ప్రయత్నించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌కు దోచుకోవడమే తెలుసు, ప్రజల కష్టాలు తెలియవంటూ మండిపడ్డారు. శుక్రవారం ఆయన సంగెం-భీమలింగం-ధర్మారెడ్డిపల్లి కెనాల్ నుంచి నాగిరెడ్డిపల్లి వరకు మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర చేశారు. అనంతరం నాగిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు.
‘‘ఒకప్పుడు మూసీలో అరుదైన చేపలు బతికేవి. ఇప్పుడు మూసీ నదిలో చేపలు బతికే పరిస్థితి లేదు. మూసీ పరివాహక ప్రాంతంలో కల్లును అమ్ముకునే పరిస్థితి లేదు
మూసీ ఒకప్పుడు జీవనదిగా ఉండేది. మూసీ పరివాహక ప్రాంత వాసులకు వరంగా ఉండేది. మూసీ పరివాహక ప్రాంతంలో నీళ్లు, కూరగాయలు, పాలు కలుషితం అయ్యాయి. మూసీ నీటితో పండించిన పంటలకు మంచి ధర రావడం లేదు. నల్గొండ జిల్లాను ఓ వైపు ఫ్లోరైడ్, మరోవైపు మూసీ వెంటాడుతోంది. మూసీ పరివాహక ప్రాంతంలో పరిస్థితి దారుణంగా ఉంది’’ అని రేవంత్ చెప్పారు.
‘‘మూసీ కాలుష్యంతో అణుబాంబు కంటే ఎక్కువ నష్టం జరుగుతోంది. మోదీ సబర్మతి ఫ్రంట్ రివర్, గంగానది ప్రక్షాళన చేస్తే అద్భుతం అంటున్నారు. మరి మేం మూసీ నది ప్రక్షాళన చేసుకోవద్దా?. మూసీ ప్రక్షాళన చేయకపోతే నా జన్మ ఎందుకు?. ఎవరు అడ్డువచ్చినా మూసి ప్రక్షాళన చేసి తిరుతాం. ఎవరు వస్తారో రండి.. బుల్డోజర్ ఎక్కి తొక్కిస్తా’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment