హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో అధికారం కోసం కాంగ్రెస్ ఏదేదో చెప్పిందని.. తీరా అధికారంలోకి వచ్చాక ఇంకేదో చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. మూసీ సుందరీకరణ దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని మరోసారి ఆరోపించిన ఆయన.. హైడ్రా బాధితుల తరఫున పోరాడి తీరతామని ఉద్ఘాటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారాయన.
తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? ఇప్పుడు ఏం చేస్తోంది?. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంది. కళ్యాణలక్ష్మికి అదనంగా తులం బంగారం అని ప్రకటించింది. ఎన్నికల ముందు తెలంగాణలో చక్కర్లు కొట్టిన రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్లారు.
హైదరాబాద్ నగరంతో పాటు సూర్యాపేట,ఆదిలాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో ప్రభుత్వం దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. పేదల ఇల్లు కూల్చి పెద్దలకు లాభం చేయమని ఏ ఇందిరమ్మ,సోనియమ్మ చెప్పింది. వరి సాగులో తెలంగాణ టాప్ గా నిలిచింది ఇది కాళేశ్వరం ఘనత కాదా?. 2016లో బీఆర్ఎస్ హయాంలో చెరువులు, బఫర్, ఎఫ్.టి.ఎల్ డ్రా చేస్తూ జీవో ఇచ్చాం. మూసీలో మేము పేదల కడుపు కొట్టకుండా బ్యూటిఫికేషన్ చేశాం. ఎస్.టి.పి లు మేము పూర్తి చేశాం. మేము నిర్మాణం చేస్తే మీరు విధ్వంసం చేస్తున్నారు
మూసీ కోసం లక్షా 50 వేల కోట్లా?
తెలంగాణలో లంకెబిందెలు లేవని అంటున్నారు. మరి మూసీ అభివృద్ధి ఏం ఆశించి చేస్తున్నారు?. మరోవైపు మూసీకి లక్షా 50 వేల కోట్లు ఖర్చు పెడతామని అంటున్నారు. 2,400 కిలోమీటర్ల గంగానది ప్రక్షాళనకు పెట్టిన బడ్జెట్ 40 వేల కోట్లు. సబర్మతి రివర్ ప్రాజెక్టుకు 7,000 కోట్లు ఖర్చు అయింది. యమునా రివర్ ప్రాజెక్టుకు ఖర్చు అయింది వెయ్యి కోట్లు. అలాంటిది 55 కిలోమీటర్ల మూసీ సుందరీకరణ కోసం లక్షా 50 వేల కోట్లు ఖర్చు అవుతుందని సీఎం రేవంత్ అంటున్నారు. మూసీ సుందరీకరణ కాంగ్రెస్ పార్టీకి రిజర్వ్ బ్యాంకులాగా ఉందా?. మూసీ ప్రాజెక్టుతో మురిసేది ఎంతమంది?. మూసీ సుందరీకరణతో ఒక్క ఎకరానికి అయినా నీళ్లు వస్తాయా?. ఇది స్కామ్ కాక మరి ఏం అవుతుంది.
ఇల్లు అనేది పేద ప్రజల కళల సౌధం. మా నానమ్మ,అమ్మమ్మ ఊర్లు ప్రాజెక్టుల్లో మునిగిపోయాయి. 1994 లో కాంగ్రెస్ ప్రభుత్వం తమకు పట్టాలు ఇచ్చిందని భాదితులు అంటున్నారు.అలాంటప్పుడు లక్షమంది ప్రజలను నిరాశ్రయులను చేసే అధికారం రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారు?. ఇళ్లు కూలగొడుతుంటే ప్రజలు ఊరుకుంటారా?. లక్షలాది మంది జీవితం నాశనం చేస్తున్నారు.
సెక్రటేరియేట్ కూడా కూలుస్తారేమో!
హైడ్రా దెబ్బకు రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది. ఎవరి కోసం హైడ్రా తీసుకొచ్చారు?. పేదల ఇళ్లు కూల్చాలని ఎవరు చెప్పారు?. ప్రభుత్వ వైఖరితో పేదలు ఇబ్బంది పడుతున్నారు. కూల్చాల్సి వస్తే ముందు హైడ్రా ఆఫీస్‌నే కూల్చాలి. రెండోదిగా జీహెచ్ఎంసీ ఆఫీసును కూల్చాలి. నాలాపై ఉన్న జీహెచ్‌ఎంసీ ఆఫీసును కూలుస్తారా?. ఎఫ్.టి.ఎల్ లో సెక్రటేరియట్ ఉందని రేవంత్ రెడ్డి కూలుస్తారేమో అని అనుమానం ఉంది. కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేయడమే రేవంత్ రెడ్డి లక్ష్యం. ఇందిరమ్మ రాజ్యంలో పేదల ఇళ్లు కూలగొడుతున్నారు. మంత్రులు ఎందుకు మూసీ గురించి చెప్పడం లేదు. అధికారుల వెనక దాక్కుని కాలం వెల్లదీస్తున్నారు. ఇప్పటి వరకు మూసీ సుందరీకరణపై డి.పి.ఆర్ రెడీ కాలేదు. డి.పి.ఆర్ రెడీ కాకుండా ఇళ్ళు ఎందుకు కూలగొడుతున్నారు.
చట్ట ప్రకారం నడుచుకోవాలని హైడ్రా కమిషనర్ కు చెప్పిన తెలంగాణ హైకోర్టుకు ధన్యవాదాలు. బీఆర్‌ఎస్ లీగల్ సెల్ ఇప్పటికే లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. ఇప్పటికే మా నేతలు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. పొరపాటున కాంగ్రెస్ వాళ్లు మూసీ బాధితుల వద్దకు వెళ్లవద్దు.బాధితులకు మేం అండగా నిలబడతాము. బాధితులకు కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్తాము. సాగరహారం లాంటి ధర్నాలు తెలంగాణలో వచ్చే విధంగా ఉన్నాయి.
సావాస దోషంతోనే మంత్రి మాటలు
5 వేల రూపాయలకు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్‌బాబు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ లాగా పీసీసీ పదవిని అమ్ముకోవడం,సీఎం పదవిని అమ్ముకోవడం తెలంగాణ ప్రజలకు రాదు. సావాస దోషంతో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.రేవంత్ రెడ్డికి లక్కీడ్రాలో ముఖ్యమంత్రి పదవి వచ్చింది. 50 కోట్లకు పీసీసీ పదవీ , 500 కోట్లకు సీఎం పదవీ నీ కాంగ్రెస్ అమ్ముకుంది.
హామీలేమాయే?
సీఎం రేవంత్ రెడ్డి ఇంటి నుండి వచ్చే మురికినీరు ఎక్కడికి పోతుందో రేవంత్ రెడ్డికి తెలుసా?. కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇళ్ళు కుంటలో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి నివాసం ఎఫ్.టి.ఎల్ లో ఉంది. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే నీ సోదరుడి ఇళ్ళు కూలగొట్టు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పింఛన్లు పెంచారు. తెలంగాణలో పింఛన్లు ఎందుకు పెంచలేదు. రైతులకు ఇప్పటి వరకురైతు భరోసా ఇవ్వలేదు. ముందు వంద రోజుల్లో చేస్తామని చెప్పిన హామీలు రేవంత్ రెడ్డి అమలు చేయాలి
Comments
Please login to add a commentAdd a comment