నీటిలో ఆటలు.. ‘టూరిజం’ కళ్లకు గంతలు.! | - | Sakshi
Sakshi News home page

నీటిలో ఆటలు.. ‘టూరిజం’ కళ్లకు గంతలు.!

Jan 8 2024 12:58 AM | Updated on Jan 8 2024 9:41 AM

- - Sakshi

సాక్షి, విశాఖపట్నం :అనుమతులు లేవు. అయినా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదేళ్లగా పైగా సాగరతీరంలో స్పీడ్‌ బోట్లు నడిపించేశారు. స్కూబా డైవింగ్‌ చేయించేశారు. అయినా టూరిజం శాఖ అధికారులకు గానీ, సిబ్బందికి గానీ ఈ విషయం తెలీదంట. వాటర్‌ స్పోర్ట్స్‌ పేరుతో ప్రభుత్వానికి రూపాయి చెల్లించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి. ఇప్పటికే స్పీడ్‌ బోట్ల నిర్వహణ ఒప్పందాన్ని కుదర్చుకున్న ఓ సంస్థ అండతోనే టూరిజం కళ్లుగప్పి నిర్వహించినట్లు తెలుస్తోంది. వాటర్‌స్పోర్ట్స్‌లో నడుస్తున్న దందా గురించి ఆలస్యంగా తెలుసుకున్న టూరిజం శాఖ ఉన్నతాధికారులు క్రిమినల్‌ కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

వాటర్‌ స్పోర్ట్స్‌కు కేంద్రబిందువుగా రుషికొండ తీరం మారింది. ప్రతిరోజూ వంద మందికి పైగా పర్యాటకులు స్పీడ్‌బోట్స్‌, స్కూబా డైవింగ్‌ చేస్తూ ఉంటారు. ఇక్కడ వీటి నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం రెండు సంస్థలకు మాత్రమే అప్పగించింది. వీటితో పాటు టూరిజం శాఖకు చెందిన స్పీడ్‌ బోట్స్‌ కూడా ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తూ.. పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఐదేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి వాటర్‌స్పోర్ట్స్‌ నిర్వహణ ప్రారంభించాడు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా స్పీడ్‌ బోట్స్‌, స్కూబాడైవింగ్‌ ఇలా ఇష్టం వచ్చినట్లు వాటర్‌ స్పోర్ట్స్‌ నిర్వహిస్తూ రూ.లక్షల్లో ఆర్జించాడు. కానీ పర్యాటక శాఖకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు.

తెలిసినా తెలియనట్లు..
ఈ గుర్తింపు లేని వాటర్‌స్పోర్ట్స్‌ వ్యవహారాన్ని ఏపీటీడీసీ డివిజనల్‌ స్థాయి అధికారులు, సిబ్బంది మూడేళ్ల క్రితమే గుర్తించారు. అయినా తమకేమీ తెలీదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలం క్రితం ఇక్కడ వాటర్‌ స్పోర్ట్స్‌ నిర్వహించేందుకు ఒక సంస్థ పర్యాటక శాఖ నుంచి అనుమతులు తీసుకుంది. సదరు సంస్థకు చెందిన వ్యక్తి ద్వారా రుషికొండ బీచ్‌లోకి ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అనుమతిలేని వ్యక్తి ప్రవేశించినట్లు తెలుస్తోంది. చెల్లింపులు సైతం సదరు సంస్థకే అందజేస్తున్నారని వాటిలో కొంత భాగం డివిజనల్‌ కార్యాలయానికి చెందిన కొందరికి ముడుపులు ఇస్తున్నట్లు సమాచారం.

ఆలస్యంగా ఉన్నతాధికారుల దృష్టికి..
ఇటీవల పర్యాటక శాఖ ఉన్నతాధికారులు రుషికొండలో జరుగుతున్న వాటర్‌స్పోర్ట్స్‌ వ్యవహారాలపై సమీక్ష నిర్వహించారు. మరో సంస్థ స్కూబా డైవింగ్‌ నిర్వహించేందుకు అనుమతులు కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఇవన్నీ బయటపడ్డాయి. దీంతో సదరు యూపీకి చెందిన వ్యక్తిని టూరిజం ఉన్నతాధికారులు ప్రశ్నించగా ఇప్పుడెందుకు అడుగుతున్నారు.? ఎప్పటినుంచో ఉంది కదా అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న సంస్థపై కేసు పెట్టాలని డివిజన్‌ స్థాయి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అయితే ఇంత జరుగుతున్నా తెర వెనుక ఉండి ప్రోత్సహించి తమ లాభాలే తప్ప పర్యాటక శాఖకు రూపాయి కూడా రాకుండా వ్యవహరించిన టూరిజం శాఖ సిబ్బందిని మాత్రం వెనకేసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement