
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని పెద్ద ఎత్తున బదిలీలు చేస్తూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 50 మంది ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కల్పించారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో పాటు సీఎం ముఖ్య సలహాదారుగా నియమించిన అజేయ కల్లంతో చర్చించి, సీనియర్లకు తగిన ప్రాధాన్యం ఇస్తూ బదిలీలపై సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలలో భాగంగా రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ)ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశారు.
సీఆర్‌డీఏ కమిషనర్, అదనపు కమిషనర్‌లను బదిలీ చేశారు. సీఆర్‌డీఏ కొత్త కమిషనర్‌గా లక్ష్మీనరసింహంను నియమించారు. జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో ఆదిత్యనాధ్ దాస్‌ను నియమించారు. శశిభూషణ్ కుమార్‌ను జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. సీఆర్‌డీఏ కమిషనర్, జెన్‌కో మాజీ ఎండీతోపాటు పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్‌డీగా ఐఏఎస్ అధికారి జె.మురళిని నియమించారు. ఉభయ గోదావరి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, విశాఖపట్టణం, అనంతపురం, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment