మీడియాతో మాట్లాడుతున్న అజేయ కల్లం. చిత్రంలో గోపాలకృష్ణ ద్వివేది
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలలో ఎలాంటి రాజకీయ జోక్యానికి తావులేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగుతోందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం తెలిపారు. రాజకీయ జోక్యం లేకుంటే ఏ పనిలోనైనా అధికారుల పనితీరు అద్భుతంగా ఉంటుందనేందుకు ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియే నిదర్శనమన్నారు. ఉద్యోగాల రాతపరీక్షల ముగింపు సందర్భంగా రాష్ట్ర స్థాయి పరీక్షల కమిటీ చైర్మన్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పరీక్షల కమిటీ కంట్రోలర్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్,మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్‌కుమార్, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్‌తో కలిసి అజేయ కల్లం సోమవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.
రికార్డు స్థాయిలో కొత్త ఉద్యోగాలు: అజేయ కల్లం
రికార్డు సంఖ్యలో ఉద్యోగాలకు ఎటువంటి తప్పులకు తావు లేకుండా అత్యంత పకడ్బందీగా, తక్కువ సమయంలో అంతా హర్షించే విధంగా పరీక్షలను నిర్వహించడం అద్భుతమన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒకే విడతలో 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను చేపట్టిన చరిత్ర ఎప్పుడూ లేదని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలల లోపే ఎన్నికల హామీ మేరకు రికార్డు స్థాయిలో ఉద్యోగాల భర్తీని చేపట్టారని తెలిపారు. ఇప్పుడు భర్తీ చేస్తున్నవి ఈ ప్రభుత్వం కొత్తగా సృష్టించిన ఉద్యోగాలని, ఇవేమీ ఖాళీ అయిన ప్రభుత్వ ఉద్యోగాలు కాదన్నారు. ఏ సర్కారైనా సంవత్సరానికి 1,000 ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేసే పరిస్థితుల్లో లేని సమయంలో ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలను కొత్తగా సృష్టించి, నియామకాలు చేపట్టడం ఒక చరిత్రగా అభివర్ణించారు. పరీక్షల నిర్వహణలో గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్, విజయకుమార్, జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర, జిల్లా స్థాయి సిబ్బంది పనితీరును ఆయన ప్రశంసించారు. ఎంపికయ్యే ఉద్యోగులను వారి సొంత ఊరిలో నియమించాలా.. వద్దా? అన్నదానిపై ఇంకా ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరగలేదని, దీనిపై విధాన పరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అజేయ కల్లాం తెలిపారు.
90 శాతం మంది హాజరు: గిరిజా శంకర్
ఉద్యోగ రాతపరీక్షలకు 21.69 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే, 19.49 లక్షల మంది హాజరయ్యారని, దాదాపు 90 శాతం మంది హాజరవడం విశేషమని పరీక్షల రాష్ట్ర స్థాయి కంట్రోలర్‌గా వ్యవహరించిన గిరిజా శంకర్ చెప్పారు. తొలిరోజు ఉదయం 12 లక్షల మందికి పైగా హాజరు కావాల్సిన పరీక్షకు ఏకంగా 93 శాతం మంది హాజరయ్యారన్నారు. పరీక్ష రాసే వారు ముఖ్యంగా మహిళా అభ్యర్ధులు ఇబ్బంది పడకూడదని వారు నివసించే ప్రాంతానికి 40–50 కిలోమీటర్ల లోపు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎన్నికల తరహాలో ఈ పరీక్షలను కూడా నిర్వహించినట్టు చెప్పారు. ఫలితాల వెల్లడి, నియామక ప్రక్రియలోనూ ఇంతే పారదర్శకంగా పని చేస్తామన్నారు. జవాబు పత్రాల స్కానింగ్ వేగంగా సాగుతుందని, ఈనెల 18, 19వ తేదీల్లో ఫలితాలు వెల్లడించేందుకు ప్రయత్నం చేస్తున్నామని ప్రకటించారు. సమర్ధంగా పరీక్షల నిర్వహణలో అభ్యర్ధుల సహకారం మరవలేనిదన్నారు.
చరిత్రాత్మక ఘట్టం: ద్వివేది
ఇన్ని లక్షల ఉద్యోగాల భర్తీ.. 22 లక్షల మందికి రాతపరీక్షలు.. ఇంత పకడ్బందీగా పరీక్షల నిర్వహణ.. ఇదో ‘హిస్టారిక్ ఈవెంట్’ అని పరీక్షల కమిటీ చైర్మన్ గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో చిన్న పొరపాటు దొర్లినట్టు ఎక్కడా చిన్న ఫిర్యాదు కూడా రాలేదన్నారు. డిగ్రీ అభ్యర్ధులు పోటీ పడే స్థాయిలో ప్రశ్నాపత్రం రూపకల్పన ఉందన్నారు. 25 శాతం సులభమైనవి, మరో 25 శాతం కఠినమైనవి, 50 శాతం యావరేజ్ ప్రశ్నలతో ఉందన్నారు. పరీక్ష పూర్తి పారదర్శకంగా జరిగిందనేందుకు అభ్యర్ధులకు ఓఎమ్మార్ షీటు నకలు ఇంటికే ఇచ్చామని, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి? ర్యాంకు ఎంత? అన్నది ఫలితాల్లో స్పష్టంగా తెలిసిపోతుందన్నారు. పరీక్షల నిర్వహణలో ఏపీపీఎస్‌సీ, ఏపీ ఎస్‌సీఈఆర్‌టీ తదితర సంస్థల సహకారం ఉందన్నారు. జిల్లాల వారీగా, పోస్టుల వారీగా, కేటగిరీలవారీగా ర్యాంకులను ప్రకటిస్తామన్నారు. ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వూ్యలు ఉండవని, ఇప్పటికీ కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని చెప్పారు.
యూపీఎస్‌సీ స్థాయిలో నిర్వహణ: విజయకుమార్
పారదర్శకంగా, స్వేచ్ఛగా పరీక్షలు నిర్వహించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజయవంతంగా పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ విజయకుమార్ తెలిపారు. పరీక్షల కంట్రోలర్ గిరిజా శంకర్ సూచనలు, జిల్లా కలెక్టర్లు, సిబ్బంది సహకారంతో యూపీఎస్‌సీ స్థాయిలో పరీక్షలు నిర్వహించగలిగామన్నారు. యూపీఏస్‌సీలోనూ ఒకే విడతలో 14 లక్షల మందికి మించి దరఖాస్తులు చేసుకోరని, అందులోనూ 7–8 లక్షల మందికి మించి హాజరు ఉండదన్నారు. దాదాపు 22 లక్షల మంది దరఖాస్తుదారుల్లో 90 శాతం మంది పరీక్షలకు హాజరు కావడం రికార్డుగా పేర్కొన్నారు. మార్కులు, మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment