సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట కల్పిస్తూ రూ.20 వేలలోపు డిపాజిట్ చేసిన వారికి ఆగస్టు 24వ తేదీన డబ్బులు చెల్లించనున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఇప్పటికే రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లించిన విషయం తెలిసిందే. ‘స్పందన’లో భాగంగా సీఎం మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఆగస్టులో చేపట్టనున్న కార్యక్రమాలను ప్రకటించడంతో పాటు కోవిడ్, ఉపాధి హామీ పనులు, వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్, గృహ నిర్మాణం, ఇళ్ల స్థలాల పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతం సవాంగ్, ల్యాండ్ అడ్మినిస్టేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి(హెచ్‌ఆర్) శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు. సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ..
ఇళ్ల నిర్మాణ పనులపై సమీక్ష
మొదటి విడతలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం. ఇందులో 10.01 లక్షల ఇళ్ల పనులు ప్రారంభం అయ్యాయి. లే అవుట్లలో నీరు, కరెంట్ చాలావరకూ కల్పించారు. మిగిలిపోయిన సుమారు 600కిపైగా లే అవుట్లలో నీటి వసతిని కల్పించేలా వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న ఆప్షన్‌ను 3.18 లక్షల మంది ఎంచుకున్నారు. వీరిలో 20 మందితో ఒక గ్రూపు ఏర్పాటు చేయాలి. స్థానికంగా మేస్త్రీలను గుర్తించి పనులను ఆ గ్రూపులకు అనుసంధానం చేయాలి. ఆగస్టు 10 కల్లా గ్రూపుల ఏర్పాటు పూర్తికావాలి. వర్షాలు ప్రారంభమైనందున ఇసుక పంపిణీలో అవాంతరాలు లేకుండా చూసుకోవాలి. ఇళ్ల నిర్మాణం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. టిడ్కో ఇళ్లకు అనర్హులైన వారి స్థానంలో కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయాలి. వచ్చే స్పందన లోగా ఈ పని పూర్తి కావాలి.
ఇక ముందూ ఫోకస్డ్‌గా టెస్టులు
ఇక ముందూ ఫోకస్డ్‌గా కోవిడ్ టెస్టులు జరగాలి. లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలి. ఎవరైనా కోరితే వారికి కూడా పరీక్షలు చేయాలి. ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలి. థర్డ్‌వేవ్ వస్తుందో లేదో తెలియదు కానీ మనం అప్రమత్తంగా ఉండాలి. మందులు, బయోమెడికల్ ఎక్విప్‌మెంట్లను సిద్ధం చేసుకోవాలి.
వ్యాక్సినేషన్
రాష్ట్రంలో 1.53 కోట్ల మందికి ఇప్పటివరకూ ఒక డోసు వాక్సిన్ ఇచ్చాం. దాదాపు 7 కోట్ల డోసులు అవసరం ఉంటే 1.53 కోట్ల డోసులు వేశాం. వ్యాక్సినేషన్ విషయంలో ఇంకా మనం చాలా దూరం వెళ్లాల్సి ఉంది. 45 ఏళ్లకు పైబడ్డ వారికి 75.89 శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చాం. దీన్ని 90 శాతం వరకూ తీసుకెళ్లాలి. తర్వాత మిగిలిన ప్రాధాన్యతా వర్గాలకు వ్యాక్సిన్లు ఇవ్వాలి. టీచర్లు, గర్భిణులు, కాలేజీ విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 2.82 శాతం ఉంది. రెండో వేవ్‌లో కొన్ని జిల్లాల్లో 25 శాతం పాజిటివిటీ రేటు చూశాం. క్రమంగా తగ్గుతూ వచ్చింది. కోవిడ్ నివారణకు కలెక్టర్లు నుంచి గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, ఆశావర్కర్‌లు, డాక్టర్లు, ఏఎన్‌ఎంలు అందరూ కలసికట్టుగా పనిచేశారు. అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా.
నిర్మాణ పనులు వేగవంతం కావాలి
గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ హెల్త్‌క్లినిక్స్, ఏఎంసీ, బీఎంసీల నిర్మాణంపై దృష్టిపెట్టండి. రాష్ట్రవ్యాప్తంగా 10,929 గ్రామ సచివాలయాలను నిర్మిస్తున్నాం. సచివాలయాల నిర్మాణంలో కృష్ణా, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాలు వెనకబడి ఉన్నాయి. కలెక్టర్లు దీనిపై ధ్యాస పెట్టాలి. సెప్టెంబరు 30 కల్లా నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. 10,408 ఆర్బీకేలు నిర్మిస్తున్నాం. ఆర్బీకేలలో బేస్‌మెంట్ లెవల్లో తూర్పు గోదావరి, కృష్ణా, కర్నూలు జిలాల్లో నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. డిసెంబరు 31 కల్లా పూర్తిచేసేలా దృష్టిపెట్టాలి. 4,530 గ్రామ పంచాయతీలకు ఫైబర్ కనెక్షన్లు డిసెంబర్ కల్లా వస్తాయి. ఆ సమయానికి డిజిటల్ లైబ్రరీలను పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలి. డిజిటల్ లైబ్రరీలను పూర్తిచేస్తే సంబంధిత గ్రామాల నుంచే వర్క్‌ఫ్రం హోం అవకాశాలను కల్పించగలుగుతాం. ఆగస్టు 15 కల్లా వీటి నిర్మాణాలు ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. స్పందన కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించడం సంతోషకరం. కోవిడ్ కారణంగా ఇన్నాళ్లుగా జరగలేదు. మళ్లీ పునఃప్రారంభం కావడం సంతోషకరం. ప్రజలకు మంచి జరిగే కార్యక్రమం ఇది.
ఇళ్ల పట్టాల పంపిణీ
మొదటి దశలో 30 లక్షలకుపైగా ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 3,69,448 మందికి కోర్టు కేసుల కారణంగా అందలేదు. ఈ కేసులు త్వరగా పరిష్కారమై వారికి మంచి జరగాలని దేవుడిని కోరుకుంటున్నా. ఇళ్ల పట్టాల మంజూరుకు సంబంధించి 10,007 దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. వీటిని వెంటనే పరిశీలించి అర్హులను గుర్తించాలి. అర్హులుగా తేల్చిన 1,90,346 మందికి వెంటనే పట్టాలు ఇవ్వాలి. ఇందులో ప్రస్తుతం ఉన్న లే అవుట్లలో దాదాపు 43 వేల మందికి పట్టాలు, మరో 10,652 మందికి ప్రభుత్వ స్థలాల్లోనే పట్టాలు ఇవ్వాలి. మరో 1.36 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు భూ సేకరణ చేయాల్సి ఉంది. ఆ ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలి.
15 నుంచి జగనన్న పచ్చతోరణం..
ఆగస్టు 15 నుంచి 31 వరకూ రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. దీన్ని చేరుకునేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలి. ఆగస్టు 5 నాటికి మొక్కల కొనుగోలుకు సంబంధించి టెండర్లు ఖరారు కావాలి. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. గ్రామాల్లో సర్పంచులు, వలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి. మొక్కలు నాటగానే సరిపోదు. నీరు పోయడం, సంరక్షణపై దృష్టిపెట్టాలి. మొక్కలు పచ్చగా కళకళలాడేలా శ్రద్ధ వహించాలి.
Comments
Please login to add a commentAdd a comment