Andhra Pradesh: సంస్కరణలతో విద్యావిప్లవం | Andhra Pradesh: Radical Changes In Public Education System | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: సంస్కరణలతో విద్యావిప్లవం

Published Sat, Aug 7 2021 3:31 AM | Last Updated on Sat, Aug 7 2021 8:45 AM

Andhra Pradesh: Radical Changes In Public Education System  - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో విజేతలుగా నిలపడమే లక్ష్యంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. అభ్యసన నైపుణ్యాలను మెరుగుపరిచి ఉత్తమ విద్యార్థులుగా, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బృహత్తర బాధ్యతను ప్రభుత్వం తన భుజస్కందాలపై వేసుకుంది. విద్యాపరంగా, వ్యవస్థాపరంగా పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను ఆరు రకాలుగా వర్గీకరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో నిర్వహించారు.

సమావేశంలో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 2021–22కిగాను ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఆగస్టు 10న ఆర్థిక సహాయం అందించనున్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు రెండో దశ నగదు చెల్లింపులను మంత్రివర్గం ఆమోదించింది. అభ్యంతరంలేని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపింది. బందరు, భావనపాడు పోర్టుల రివైజ్డ్‌ డీపీఆర్‌లను ఆమోదించింది. కొత్తగా నాలుగు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చింది. మంత్రివర్గం సమావేశం వివరాలను రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని విలేకరులకు వెల్లడించారు. ఆ వివరాలు ఇవీ..

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

విద్యావేత్తలతో చర్చించి సంస్కరణలు..
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అభ్యసన స్థాయిలపై ప్రభుత్వం వివిధ సర్వేలను నిర్వహించింది. విద్యావేత్తలతో చర్చించి విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలను రూపొందించింది. ప్రస్తుతం ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలు, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, గిరిజన సంక్షేమ పాఠశాలల విధానంలో సంస్కరణలు తెస్తూ ఆరు రకాలుగా వర్గీకరించింది. 
శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూల్స్‌:  ప్రీప్రైమరీ 1, ప్రీప్రైమరీ 2 
ఫౌండేషన్‌ స్కూల్స్‌ :  ప్రీప్రైమరీ 1, ప్రీప్రైమరీ 2 లతోపాటు ఒకటి, రెండో తరగతులు
ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌ :  ప్రీప్రైమరీ 1 నుంచి ఐదో తరగతి వరకు
ప్రీ హైస్కూల్స్‌:   మూడో తరగతి నుంచి ఏడు (లేదా) ఎనిమిదో తరగతి వరకు
హై స్కూల్స్‌ : మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు
హై స్కూల్‌ ప్లస్‌ స్కూల్స్‌: మూడో తరగతి నుంచి 12వ తరగతి వరకు

ప్రభుత్వ విద్యా సంస్థలకు మహర్దశ
ఈ ఏడాది జగనన్న విద్యా కానుక పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదించింది. విద్యాకానుక, మనబడి, నాడు– నేడు ద్వారా ఇప్పటికే విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్న కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని మంత్రివర్గం పేర్కొంది. ప్రభుత్వ విద్యాసంస్థల దశ, దిశ మారుతోందని తెలిపింది. పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు నాడు – నేడు తొలి విడత కోసం రూ.3,669 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు చేసింది. ఈ పనుల కోసం మొత్తం రూ.16,021.67 కోట్లు వెచ్చించనుంది. తద్వారా కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దనుంది. 

10న ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’
వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం కింద ఆగస్టు 10న అర్హులైన నేతన్నల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. సొంత మగ్గం ఉన్న అర్హులైన చేనేత కార్మికుల కుటుంబాలకు రూ.24 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. అందుకోసం బడ్జెట్‌లో రూ.199 కోట్లు కేటాయించింది. 

అగ్రిగోల్డ్‌ బాధితులకు రెండో విడత చెల్లింపులు
అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం మరోసారి ముందుకు వచ్చింది. రెండో దశ చెల్లింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు డిపాజిట్‌దారులకు ఆగస్టు 24న పరిహారం పంపిణీ చేయనున్నారు. ఆగస్టు 5 వరకూ అందిన వివరాల ప్రకారం నాలుగు లక్షల మంది డిపాజిట్‌దారులకు ప్రభుత్వం దాదాపు రూ.511 కోట్లు చెల్లించనుంది. రూ.10 వేల లోపు డిపాజిట్‌దారులు 3.4 లక్షల మందికి గతంలోనే రూ.238.7 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. 

ఆక్రమణల క్రమబద్ధీకరణ ఇలా..
అభ్యంతరాలు లేని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను క్రమబద్ధీకరించేందుకు మంత్రివర్గం ఆమోదించింది. 300 చ.గజాల వరకు అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న ఆవాసాలను క్రమబద్ధీకరించేందుకు విధి విధానాలు ఇలా ఉన్నాయి...
ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి ఈ విధానం అమలులోకి వస్తుంది. 
2019 అక్టోబరు 15 నాటి వరకూ ఉన్న వాటిని క్రమబద్ధీకరిస్తారు. 
75 చ. గజాల వరకు భూమి బేసిక్‌ వాల్యూలో 75 శాతం రుసుము చెల్లించాలి. లబ్ధిదారుడు కేటగిరీ–1కు చెందినవారైతే ఉచితంగా పట్టా, డి ఫారం పట్టా పంపిణీ చేస్తారు. 
75 నుంచి 150 చ.గజాల వరకూ భూమి బేసిక్‌వాల్యూలో 75 శాతం రుసుము చెల్లించాలి.  
150 నుంచి 300 చ.గజాల వరకూ భూమి బేసిక్‌ వాల్యూలో 100 శాతం రుసుము వసూలు చేస్తారు. 
మాస్టర్‌ ప్లాన్, జోనల్‌ డెవలప్‌మెంట్, రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌లో ప్రభావితమైన భూములకు ఈ క్రమబద్ధీకరణ వర్తించదు. 
అప్రూవ్డ్‌ లే అవుట్లలోని నిర్మాణాలకు వర్తించదు.

అసైన్డ్‌ చట్టంలో సవరణలు..
అసైన్డ్‌ చట్టం–1977(పీవోటీ)లో సవరణలను మంత్రివర్గం ఆమోదించింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున అందుతున్న విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. చట్టంలోని సెక్షన్‌ 3(2ఎ), సెక్షన్‌ 3(2బీ) సవరించేందుకు ఆమోదం తెలిపింది. 
అసైన్డ్‌ ఇంటి స్థలం/అసైన్డ్‌ ఇల్లు విక్రయానికి ప్రస్తుతం ఉన్న గడువు 20 ఏళ్ల నుంచి పదేళ్లకు తగ్గించారు. 
సవరించిన చట్టం అమలులోకి వచ్చేనాటికి అసైన్డ్‌ ఇంటి స్థలం/అసైన్డ్‌ ఇంటిని ఎవరైనా విక్రయిస్తే వాటిని ఆమోదిస్తారు. 
చట్టం అమలులోకి వచ్చేనాటికి అసైన్డ్‌ ఇంటి స్థలం/అసైన్డ్‌ ఇంటిని అమ్మాలని అనుకుంటే నిర్దేశించిన రుసుములను అనుసరించి అనుమతులు ఇస్తారు. 

ప్రైవేట్‌ భూమి తీసుకుంటే బదులుగా మరోచోట..
గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు స్థలాల కొరత సమస్య తీర్చేందుకు మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ప్రైవేట్‌ భూమి తీసుకుని బదులుగా మరోచోట ప్రభుత్వ భూమి ఇవ్వాలని నిర్ణయించింది. ప్రాధాన్యత క్రమంలో గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భవనాలు నిర్మిస్తారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ కేంద్రాలు, డిజిటల్‌ లైబ్రరీలు, అంగన్‌వాడీ కేంద్రాలు, విత్తన అభివృద్ధి కేంద్రాలు, మల్లీ ఫెసిలిటీ కేంద్రాలు, 90 రోజుల్లోగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాలు మొదలైన వాటికి భూములు సేకరించి అవసరమైన నిర్మాణాలు చేపడతారు. నిర్దేశిత సమయంలో నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

రెండు పోర్టుల రివైజ్డ్‌ డీపీఆర్‌లకు ఆమోదం
బందరు, భావనపాడు పోర్టుల రివైజ్డ్‌ సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)లను మంత్రివర్గం ఆమోదించింది. రూ.5,155.73 కోట్లతో బందరు పోర్టు రివైజ్డ్‌ డీపీఆర్‌ రూపొందించారు. 36 నెలల్లో పోర్టు నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం. భావనపాడు పోర్టు మొదటి దశ కోసం రూ.4,361.90 కోట్లతో రివైజ్డ్‌ డీపీఆర్‌ రూపొందించారు. భూసేకరణ, పోర్టు మొదటి దశ నిర్మాణాన్ని 30 నెలల్లో పూర్తి చేయాలని నిర్దేశించారు.

కొత్తగా నాలుగు ఫిషింగ్‌ హార్బర్లు 
రాష్ట్రంలో కొత్తగా నాలుగు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి మంత్రివర్గం పరిపాలన అనుమతులు జారీ చేసింది. బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక(విశాఖపట్నం), బియ్యపుతిప్ప(పశ్చిమ గోదావరి), కొత్తపట్నం(ప్రకాశం)లలో ఈ ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తారు. అందుకోసం రూ.1,720.61 కోట్లతో డీపీఆర్‌ను ఆమోదించారు. 

స్వచ్ఛతకు ‘క్లాప్‌’
‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌(క్లాప్‌) కార్యక్రమాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ఇళ్ల వద్ద నుంచి చెత్త సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాలను నిర్వహిస్తారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 100 రోజులపాటు చైతన్య కార్యక్రమాలు చేపడతారు. 

పోలవరం నిర్వాసితులకు అదనంగా రూ.550 కోట్లు
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అదనంగా రూ.10 లక్షల ప్యాకేజీకి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. దీంతో ప్రభుత్వం దాదాపు రూ.550 కోట్లు అదనంగా ఖర్చు చేయనుంది. గతంలో నిర్వాసితులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

‘రుడా’ ఏర్పాటు
రాజమహేంద్రవర్గం పట్టణాభివృద్ధి సంస్థ (రుడా)ను ఏర్పాటు చేస్తూ మంత్రివర్గం తీర్మానించింది. రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు కొవ్వూరు, నిడదవోలు, గోదావరి పట్టణాభివృద్ధి సంస్థ, ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థలోని కొంత భాగాన్ని రుడా పరిధిలోకి తెచ్చారు. మొత్తం 3 పట్టణ స్థానిక సంస్థలు, 17 మండలాలు, 207 గ్రామాలతో 1,566.44 చ.కి.మీ. పరిధితో ‘రుడా’ ఏర్పాటు చేశారు. గోదావరి పట్టణాభివృద్ధి సంస్థ పేరును కాకినాడ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా)గా మార్చారు. మొత్తం 1,236.42 చ.కి.మీ. పరిధిలోని కుడాలో 5 పట్టణ స్థానిక సంస్థలు, 15 మండలాలు, 172 గ్రామాలు ఉన్నాయి. 

ఏపీఐఐసీ, ఏపీఎంబీ వాటాలు పెంపు
రాష్ట్ర గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీజీడీసీ)లో ప్రభుత్వ రంగ సంస్థలు ఏపీఐఐసీ, ఏపీఎంబీ వాటాలను గణనీయంగా పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. వాటి వాటాను 50 నుంచి 74 శాతానికి పెంచేందుకు ఆమోదముద్ర వేసింది. 

నెల్లూరు జిల్లా దగదర్తి వద్ద పీపీపీ పద్ధతిలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి టెక్నో ఎకనామిక్‌ ఫీజ్‌బిలిటీ అధ్యయన నివేదికకు ఆమోదం.
ఆంధ్రప్రదేశ్‌ ఛారిటబుల్‌ హిందూ రెలిజియస్‌ ఇనిస్టిట్యూషన్స్, ఎండోమెంట్‌ యాక్ట్‌ 1987లో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ జారీకి మంత్రివర్గం ఆమోదం. టీటీడీ ఆధ్వర్యంలో వివిధ దేవాలయాల అభివృద్ది, అర్చకుల సంక్షేమం కోసం చర్యలు తీసుకునేందుకు ఈ ఆర్డినెన్స్‌ రూపొందించారు. 
ధార్మిక పరిషత్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఏర్పాటుకు ఆమోదం. ఈ మేరకు చట్ట సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ జారీ కానుంది.
చిత్తూరు జిల్లా పుంగనూరు రవాణా శాఖ కార్యాలయంలో ఒక మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్, సీనియర్‌ /జూనియర్‌ అసిస్టెంట్లు, ముగ్గురు హోంగార్డు పోస్టుల మంజూరు. 
ఈ నెల 13న ప్రదానం చేయనున్న వైఎస్సార్‌ లైఫ్‌టైం ఎఛీవ్‌మెంట్‌ అవార్డులకు మంత్రివర్గం ఆమోదం. 
రాష్ట్ర హైకోర్టు అభిప్రాయం మేరకు హైదరాబాద్‌లో ఉన్న లోకాయుక్త కార్యాలయాన్ని కర్నూలుకు తరలించాలని నిర్ణయం.
హైకోర్టు అభిప్రాయాల మేరకే రాష్ట్ర మావన హక్కుల సంఘం కార్యాలయాన్ని కూడా కర్నూలుకు తరలించాలని నిర్ణయం. మానవహక్కుల సంఘం కార్యాలయంలో కార్యదర్శి, డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ –జ్యుడిషియల్, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, పీఆర్వో పోస్టులకు మంత్రివర్గం ఆమోదం. 
ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్తలో రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్, డైరెక్టర్‌ ఇన్వెస్టిగేషన్, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌–జ్యుడిషియల్, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ –అక్కౌంట్స్, లోకాయుక్త, ఉపలోకాయుక్త, రిజిస్ట్రార్లకు పీఏలు, అక్కౌంట్స్‌ ఆఫీసర్, లైబ్రేరియన్, మోటార్‌సైకిల్‌ మెసెంజర్‌  పోస్టుల మంజూరు. 
గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో డైరెక్టర్‌ పోస్టు మంజూరుకు ఆమోదం. 
రాష్ట్రంలో పశు సంపదను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌ బొవైనీ బ్రీడింగ్‌ ఆర్డినెన్స్‌– 2021కి మంత్రివర్గం ఆమోదం. 
మత్స్య ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం. ఉత్పత్తిలో 30 శాతం స్థానికంగానే వినియోగించేందుకు తగిన మౌలిక సదుపాయాల కల్పన. ప్రీ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, ఆక్వాహబ్‌లు, వీటికి అనుబంధంగా రిటైల్‌ దుకాణాల ఏర్పాటు. 
పశు సంవర్థకశాఖలో 19 ల్యాబ్‌ టెక్నీషియన్, 8 ల్యాబ్‌ అటెండెంట్ల పోస్టుల మంజూరు. కాంట్రాక్టు పద్ధతిలో టెక్నీషియన్లను, అవుట్‌ సోర్సింగ్‌పై అటెండెంట్లను నియమిస్తారు. 
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల్లో విత్తన ఉత్పత్తి పాలసీ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం. ఉద్యానవన పంటల సాగు చట్ట సవరణకు ఆమోదం.  

ఖరీఫ్‌లో ఇప్పటిదాకా 42.27 లక్షల ఎకరాల్లో సాగు 
రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగు, పంటల పరిస్థితుల వివరాలను అధికారులు మంత్రివర్గానికి వివరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 42.27 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో లోటు వర్షపాతం ఉంది. వైఎస్సార్‌ జిల్లాలో 70.2 శాతం, అనంతపురం జిల్లాలో 65.6 శాతం, కర్నూలు జిల్లాలో 25.5 శాతం, చిత్తూరు జిల్లాలో 58.6 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. అగ్రికల్చర్‌ అడ్వైజరీ సమావేశాలు, పంటల ప్రణాళికను అధికారులు మంత్రివర్గానికి వివరించారు. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులు, ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్‌ వివరాలను వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలియచేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement