సాక్షి, తాడేపల్లి: అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రెండో విడత డబ్బులు విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా నుంచి చంద్రశేఖర్ రావు అనే వాచ్‌మెకానిక్ మాట్లాడుతూ.. ‘‘ఐదు సంవత్సరాల పాటు అగ్రిగోల్డ్ కంపెనీలో రోజుకు 40 రూపాయల చొప్పున 18,500 కట్టాను. 2016లో సంస్థను ఎత్తేశారని తెలిసి ఎంతో బాధపడ్డాను. ఎక్కడ తిరిగినా మాకు న్యాయం జరగలేదు. మీరు పాదయాత్రలో మాకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. దానిలో భాగంగానే మొదటివిడతలో పదివేల రూపాయలలోపు బాధితులకు డబ్బులు ఇచ్చారు. రెండో విడతలో భాగంగా 20వేల రూపాయలోపు బాధితులమైన మాకు ఈ రోజు డబ్బులు ఇచ్చారు’’ అని తెలిపారు.
‘‘దీని గురించి వలంటీర్లు మా ఇంటికి వచ్చి.. వివరాలు తెలుసుకుని.. దగ్గరుండి అప్లికేషన్ నింపారు. ఆన్‌లైన్‌లో అప్లై చేశారు. ఈ నెల 24 న డబ్బులు వస్తాయని చెప్పారు. మమ్మల్ని ఆదుకున్నందుకు చాలా సంతోషం. ప్రైవేట్ కంపెనీలో డబ్బులు పెట్టి.. మోసపోతే.. ప్రభుత్వం ఆదుకోవడం నిజంగా చరిత్రే. పోయాయనుకున్న డబ్బులు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. మీలాంటి సీఎం ఉన్నందుకు గర్వపడుతున్నాను’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
గుంటూరు నుంచి ఉషా రాణి మాట్లాడుతూ.. ‘‘నా భర్త డెలివరీ బాయ్‌గా పని చేసేవారు. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బులు పొదుపు చేయాలని భావించి.. అగ్రిగోల్డ్‌లో నెలనెల పొదుపు చేశాం. కానీ 2016లో కంపెనీని ఎత్తేశారని తెలిసి మా కష్టం బూడిదలో పోసిన పన్నీరయ్యిందని బాధపడ్డాం. మా డబ్బులు తిరిగి ఇప్పించాల్సిందిగా గత ప్రభుత్వాలను అభ్యర్థించాం. మీకోసం కార్యక్రమంలో అప్లికేషన్ పెట్టినా లాభం లేదు. ఏడాదిన్నర పాటు నేను ఒక్కదానే ఆఫీసుల చుట్టూ తిరిగాను. ఆ బాధలు వర్ణించలేను. పాదయాత్రలో మీరు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. దాని ప్రకారమే మొదటి విడతలో పది వేల రూపాలయలోపు బాధితులకు డబ్బులు ఇచ్చారు. దాంతో నాకు నమ్మకం కలిగింది’’ అన్నారు.
‘‘ఈరోజు రెండో విడతలో భాగంగా 20 వేల రూపాలయ లోపు లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేశారు. నేను 15 వేల రూపాయలు కట్టాను. నా కష్టార్జితం తిరిగి వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇద్దరుపిల్లలు. వారికి అమ్మ ఒడి, విద్యా కానుకు ఇలా అన్ని పథకాలు అందుతున్నాయి. నాడు-నేడులో భాగంగా స్కూళ్ల రూపురేఖలు మార్చారు. ఇప్పుడవి గవర్నమెంట్ బడుల్లా లేవు.. కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే రీతిలో ఉన్నాయి. వలంటీర్లు ఇంటి దగ్గరకే వచ్చి అన్ని ఇస్తుండటంతో ఎంతో మేలు జరగుతుంది. మా ఆయనకు తెలియకుండా పెట్టిన డబ్బులు పొగొట్టుకుని.. ఎంత బాధపడ్డానే నాకే తెలుసు. ఓ అన్నలా మీరు నాకు తోడుండి.. నా డబ్బులు నాకు తిరిగి ఇస్తున్నారు. మీరు తండ్రిని మించిన తనయుడిగా నిలిచారు’’ అంటూ కృతజ్ఞతలు తెలిపింది.
కర్నూలు నుంచి చిరువ్యాపారం చేసుకునే విశాలాక్షి మాట్లాడుతూ.. ‘‘వాళ్లు, వీళ్లు చెప్పిన మాటలు విని అగ్రిగోల్డ్ సంస్థలో నెలకు ఐదు వందల రూపాయల చొప్పున 11,500 రూపాయలు దాచుకున్నాను. 2016లో అగ్రిగోల్డ్ సంస్థ ఎత్తేశారని తెలిసి చాలా బాధపడ్డాను. డబ్బులు తిరిగి వస్తాయా రావా అని ఆందోళన పడ్డాను. చంద్రబాబు ప్రభుత్వంలో దీని గురించి ఎన్ని అభ్యర్థనలు చేసినా ఫలితం లేదు. ఇక డబ్బులు రావని ఆశలు వదిలేసుకున్నాను. ఆ సమయంలో మీరు పాదయాత్రలో మా సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అప్పుడు అగ్రిగోల్డ్ సమస్య గురించి మీకు విన్నవించుకున్నాం’’ అన్నారు.
‘‘అధికారంలోకి వచ్చాకా మీరు వలంటీర్లను పంపి మా వివరాలను తెలుసుకుని.. మా డబ్బులు మాకు తిరగి ఇప్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీన్ని ఈ రాఖీ పండుగకు మీరు నాకు ఇచ్చిన కానుకగా భావిస్తున్నాను. డబ్బులు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మన ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి పథకం నాకు అందుతుంది. ఏ ప్రభుత్వం ప్రజల సమస్యల గురించి ఇంతలా ఆలోచించలేదు. మీరే ఎప్పటికి సీఎంగా ఉండాలి అని కోరుకుంటున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment