సాక్షి, గుంటూరు : మద్యం వల్ల అత్యాచారాలు, కిరాయి హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని, టార్గెట్లు పెట్టి మరీ ప్రభుత్వాలు మద్యాన్ని అమ్మిస్తున్నాయని వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో.. దశలవారీగా మద్యనిషేధం అమలుపై చర్చా వేదికలో మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన సమాజం ఉన్న దేశాలు ఆర్థికంగా ముందుకు వెళ్తున్నాయని అన్నారు. ఎన్నికల్లో మద్యం పంపిణీ వల్ల చిన్న పిల్లలు సైతం మద్యానికి బానిసలవుతున్నారని పేర్కొన్నారు. మద్యంపై అందరికీ అవగాహనం కలిగించినప్పుడే మార్పు వస్తుందని, వైఎస్ జగన్ దశలవారీగా మద్యపాన నియంత్రణ చేస్తానన్నారని పునరుద్ఘాటించారు.
ఇదే కార్యక్రమాని హాజరైన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. ‘అప్పట్లో ఎన్టీఆర్ మద్యనిషేధం చేస్తానంటే మహిళలు చాలా ఆనందించారు. కానీ ఇప్పటి ప్రభుత్వాలు మద్యాన్ని హోమ్ డెలివరీ చేసే వరకు దిగజారాయి. అనంతపురంలో మంచి నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే, మద్యం వల్ల ప్రభుత్వం రూ.244 కోట్లు ఆదాయం పొందింది. ఆ డబ్బుతో మంచి నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం తన ఖజానాలో వేసుకుంది. చిన్నపిల్లలు సైతం తాగుడుకు అలవాటు పడుతున్నారు.. తల్లిదండ్రులు కూడా పిల్లలను గమనిస్తూ వుండాలి. అందరూ బాధ్యతతో వ్యవహరిస్తే మద్యాన్ని నిర్మూలించవచ్చ’న్నారు.
మాజీ సీఎస్ అజేయ కల్లం మాట్లాడుతూ.. ‘మద్యపానం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రభుత్వాలు మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకూడదు. సమాజం మీద బాధ్యత లేనట్టు వ్యహరించకూడదు. మద్యపాన నిషేధంపై స్వచ్చంద సంస్థలు పోరాటం చేయాలి. దశలవారీగా మద్యపాన నిషేధంపై సమగ్ర చర్చ జరగాలి’ అని పేర్కొన్నారు. ‘మద్యం వల్ల చిన్న చిన్న కుటుంబాలు మరింతగా ఛిన్నాబిన్నం అవుతున్నాయి. డ్రైవర్లు తాగి వాహనం నడిపితే ఎన్నో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రోడ్డుప్రమాదాలపై సమీక్ష చేస్తే మద్యం వల్ల జరుగుతున్న ప్రమాదాలే ఎక్కువని తేలాయి. మద్యపాన నిషేధం అమలు చేయలేరా? అని నన్ను చాలామంది అడుగుతుంటారు. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే కచ్చితంగా అమలు చేయవచ్చ’ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment