సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన ‘కల్లం’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అజేయ కల్లం మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సీఎస్‌గా వ్యవహరించిన సత్యప్రకాష్ టక్కర్ విధుల నుంచి రిలీవ్ అవుతూ కల్లంకు బాధ్యతలు అప్పగించారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో కల్లంతో పాటు మరో నెలరోజుల్లో కొత్త సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్న దినేశ్‌కుమార్‌ను, రిటైరైన ఎస్‌పీ టక్కర్‌ను సీఎం చంద్రబాబు సత్కరించారు. 1983 బ్యాచ్‌కు చెందిన కల్లం ఆర్థిక, రెవెన్యూశాఖలతో పాటు పలు కీలకశాఖల్లో పనిచేశారు. మార్చి నెలాఖరుతో ఆయన పదవీ విరమణ చేయనున్నారు.
ఆయన అనంతరం అదే బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న దినేశ్‌కుమార్ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టేలా ప్రభుత్వం జీవో జారీచేసిన సంగతి తెల్సిందే. కాగా, సీఎస్‌గా బా«ధ్యతలు చేపట్టిన అజేయ కల్లంకు మరో ఆరునెలలు గడువు పొడిగించేలా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ కోరారు. ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద టక్కర్, కల్లంలకు సచివాలయ ఉద్యోగులు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు.