(సాక్షి, ప్రత్యేక ప్రతినిధి): నిస్సందేహంగా ఇదో సంచలనమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఆవేదనను ఆధారాలతో సహా భారత ప్రధాన న్యాయమూర్తితో పంచుకుంది. ఎందుకంటే దర్యాప్తు దశలో స్టే ఇవ్వవద్దని సుప్రీం కోర్టు పదే పదే చెబుతున్నా.. రాష్ట్ర హైకోర్టులో మాత్రం అలాంటి ‘స్టే’లు మంజూరైపోతున్నాయి. ఏ దర్యాప్తూ కదలకుండా ముందరికాళ్లకు బంధాలు పడిపోతున్నాయి. ఇక చిన్న చిన్న కేసుల్లో సైతం తీర్పుల సంగతలా ఉంచితే... రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిర్వీర్యమైపోయిందన్న స్థాయిలో తీవ్రమైన వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. వెంటనే ఓ వర్గం మీడియాలో అవన్నీ విపరీతమైన ప్రాధాన్యంతో ప్రసారమౌతూ అచ్చయిపోతున్నాయి. ఎందుకిలా అవుతోందని ఆరా తీసిన ప్రభుత్వం... అవన్నీ సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ ఎన్.వి.రమణ జోక్యంతో జరుగుతున్నాయని తెలుసుకుని ఆధారాలతో సహా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేకు అందజేసింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయటమే కాక... తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అడ్వొకేట్ జనరల్‌గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్‌తో కలిసి జస్టిస్ ఎన్.వి.రమణ ఎలా ఆస్తులను పోగేసుకున్నారో అందులో వివరించారు. జస్టిస్ రమణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నపుడు మామూలు న్యాయవాదిగా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్‌కు అనుకూలంగా ఎన్ని ఉత్తర్వులిచ్చారో కూడా ముఖ్యమంత్రి ఆధారాలతో సహా వివరించారు. వీటన్నిటితో పాటు చంద్రబాబు నాయుడికి, జస్టిస్ ఎన్.వి.రమణకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని వెల్లడించే మరో ఆధారాన్ని కూడా సీఎం తన లేఖలో ప్రస్తావిస్తూ అందజేశారు. గతంలో ఓ ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం సభ్యుడిగా జస్టిస్ ఎన్.వి.రమణ వ్యక్తం చేసిన అభిప్రాయం... అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసిన అభిప్రాయం అచ్చు గుద్దినట్లు ఒక్కటేనని... కింద సంతకాలు మాత్రమే మారాయని... ఈ విషయాన్ని అప్పట్లో కొలీజియం సభ్యుడిగా ఉన్న జస్టిస్ చలమేశ్వర్ స్వయంగా చెప్పారని కూడా సీఎం పేర్కొన్నారు. ఈ కుమ్మక్కు కారణంగా తాము ఏ అక్రమాన్ని వెలికితీయాలనకున్నా అడ్డుపడుతున్నారని, దానికి అన్ని స్థాయిల్లోనూ ఒత్తిళ్లు తెస్తున్నారని జగన్ వివరించారు. ఈ మేరకు ఆధారాలను కూడా సీజేఐకి అందజేసినట్లు శనివారం ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం తెలియజేశారు. రాత్రి 9 గంటల సమయంలో మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలు వెల్లడించారు. ( జస్టిస్ రమణ ఆస్తులు, దమ్మాలపాటి కేసుల్లో ఇచ్చిన తీర్పుల వివరాల తాలూకు పత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!)
సీజేఐకి లేఖ, ధ్రువపత్రాలు కూడా...
అమరావతి భూ కుంభకోణంగా ప్రభుత్వం పేర్కొంటున్న వ్యవహారంలో కేబినెట్ సబ్‌కమిటీ విచారణను, సిట్ దర్యాప్తును నిలిపేస్తూ ఇటీవల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వి.సోమయాజులు ఇచ్చిన ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేయటం మీకు తెలుసు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి సైతం... ఈ కుంభకోణంలో మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు సిటింగ్ జడ్జి కుటుంబ సభ్యులపై జరుగుతున్న దర్యాప్తును నిలిపేశారు. అంతేకాక దానికి సంబంధించిన వార్తలు మీడియాలో రాకుండా గ్యాగ్ ఉత్తర్వులిచ్చారు. వీటినీ సుప్రీం కోర్టులో సవాల్ చేశాం.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరుగుతున్న పరిణామాలను... ప్రత్యేకించి ఏపీ హైకోర్టు వ్యవహారాల్లో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ జోక్యాన్ని దేశ ప్రధాన న్యాయమూర్తికి తెలియజేశాం. దీనికి సంబంధించిన వివిధ పత్రాలనూ ఈ నెల 8న ఆయనకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి అందజేశారు. ఇవన్నీ జస్టిస్ ఎన్.వి.రమణకు, టీడీపీ అధిపతి నారా చంద్రబాబు నాయుడితో ఉన్న అనుబంధాన్ని, టీడీపీ నేతల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలను బయటపెట్టేవే. ఇక జస్టిస్ ఎన్.వి.రమణ తాను హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నపుడు దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించిన కేసుల్లో ఆయనకు అనుకూలంగా ఇచ్చిన ఉత్తర్వులైతే న్యాయ వ్యవస్థ దుర్వినియోగాన్ని బయటపెడతాయి. ఈ పరిణామాలన్నిటినీ సీజేఐకి లేఖ రూపంలో ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర హైకోర్టు వ్యవహారాలను జస్టిస్ ఎన్.వి.రమణ నేరుగా ఎలా ప్రభావితం చేస్తున్నారో తెలియజేశారు. అమరావతి భూ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారాలను, దాంట్లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి ముందుంచారు’’ అని కల్లం వివరించారు.
మీడియా సమావేశంలో భాగంగా వివిధ పత్రాలను మీడియాకు కూడా అందజేసినా... అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి ఇటీవల దమ్మాలపాటి, సుప్రీం న్యాయమూర్తి కుమార్తెలపై ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ కాపీని, దానికి సంబంధించిన ఫిర్యాదును మాత్రం ఇవ్వలేదు. హైకోర్టు ఈ వ్యవహారాన్ని మీడియాలో ప్రచురించకుండా “గ్యాగ్’ ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో ఇలా చేసినట్లు కల్లం తెలిపారు. అయితే ఈ సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి మాత్రం అందజేశామన్నారు. ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ విషయంలో ముందుకెళ్లేటపుడు అఫిడవిట్లతో సహా ఈ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటుందని స్పష్టంచేశారు. ( జస్టిస్ రమణ ఆస్తులు, దమ్మాలపాటి కేసుల్లో ఇచ్చిన తీర్పుల వివరాల తాలూకు పత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!)
న్యాయ వ్యవస్థపై అమితమైన గౌరవం ఉంది...
ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి హైకోర్టుపై, సుప్రీంకోర్టుపై, న్యాయవ్యవస్థపై అత్యంత గౌరవ ప్రపత్తులున్నట్లు కల్లం తెలిపారు. సీఎం తన లేఖలోనూ ఈ విషయం పేర్కొన్నారని చెప్పారు. “ఇదంతా కొద్ది మంది గౌరవ న్యాయమూర్తుల వ్యవహార శైలిని సుప్రీంకోర్టుకు వివరించే ప్రయత్నమే. ముఖ్యమంత్రిగానీ, ప్రభుత్వం గానీ ఎప్పుడూ చట్టాలకు, రాజ్యాంగానికి లోబడే పనిచేస్తాయి. ఏ వ్యవస్థతోనయినా గౌరవపూర్వకమైన విభేదాలే ఉంటాయి’’ అని కల్లం ఉద్ఘాటించారు.
టీడీపీ ప్రయోజనాలే లక్ష్యంగా.. హైకోర్టు ఉత్తర్వులివీ
తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను పరిరక్షించేందుకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లోని వాస్తవాలు ఇవీ అని పేర్కొంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుప్రీం సీజేకు అనుబంధ పత్రాలు అందజేశారు.. దానిలోని అంశాలు చూస్తే..
చంద్రబాబు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ వ్యవస్థలను గౌరవనీయ సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జిల ద్వారా రాజకీయాలకు వినియోగించుకోవడం బాధ, ఆవేదన కలిగిస్తోంది. ప్రజాస్వామికంగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, పడగొట్టడానికి గౌరవప్రదమైన హైకోర్టును ఉపయోగించుకుంటున్న దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మాయని మచ్చలాంటి తీర్పుల వెనుక జస్టిస్ ఎన్వీ రమణ ద్వారా చంద్రబాబు సాగిస్తున్న బహిరంగ, రహస్య కార్యకలాపాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అమరావతిలో వివిధ సంస్థలకు చెందిన వారు భూములు కొన్న విషయం ప్రజలకు తెలిసిందే. అసెంబ్లీ ఆమోదించిన మూడు రాజధానులు, ఒక కీలకమైన చర్చ జరిగిన విషయాన్ని సవాలు చేస్తూ ఈ ఏడాది జనవరి నుంచి వరుసగా రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. అమరావతిలో తమ స్వార్థ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఈ పిటిషన్లు వేశారు. ఈ సందర్భంలో అక్కడ జరిగిన నిరసనలకు స్వార్థపూరిత వ్యక్తులే నిధులు సమకూర్చారని నివేదికలు చెబుతున్నాయి. వివిధ దశల్లో 30 వరకూ పిల్స్ దాఖలయ్యాయి. ముఖ్యమంత్రిని ప్రతివాదిగా కూడా పేర్కొన్నారు.
కొత్త ప్రభుత్వం 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేపట్టినప్పటి నుంచి ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలో న్యాయ పరిపాలనను హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ద్వారా జస్టిస్ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారనే విషయం స్పష్టమైంది. ఆ ప్రభావం ఈ విధంగా ఉంది.
► చంద్రబాబునాయుడు నిర్ణయం మేరకు ఆయన ప్రయోజనాలు కాపాడే విధంగా జడ్జిల సిట్టింగ్ రోస్టర్‌ను ప్రభావితం చేశారు. ఆ జడ్జిల్లో జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ డి.రమేశ్ తదితరులు ఉన్నారు.
► న్యాయంవైపు లేకుండా ఉన్న, హైకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న పిల్స్‌ను అనుమతించే దిశగా ప్రభావం.
► కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభావం
టీడీపీ ప్రయోజనాలను పరిరక్షించిన ప్రత్యేక సందర్భాలు
అమరావతి ల్యాండ్ స్కామ్ : అమరావతి భూ కుంభకోణంపై ఎఫ్‌ఐఆర్ నమోదైన వెంటనే హైకోర్టు స్టే విధించింది.
జస్టిస్ కె. లలిత
జడ్జిల్లో తెలుగుదేశం ప్రయోజనాలను కాపాడే వాళ్లలో జస్టిస్ కె. లలిత ఒకరు. మెడికల్ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టయ్యారు. ఆయన ఒక వారం రోజులు జైల్లో లేకుండానే.. ఆ జడ్జి ఆ మాజీ మంత్రిని ఆస్పత్రికి మార్చాలని ఆదేశాలిచ్చారు. తర్వాత ఇంకో ఆస్పత్రికి మార్చారు. తుదకు ఆస్పత్రి నుంచే విడుదల అయ్యే విధంగా బెయిల్ ఇచ్చారు. ఆ ఆదేశాలను ఆపాలని కోరుతూ ప్రభుత్వం వేసిన పిటిషన్లపై వాదనలు వినలేదు. దీంతో అచ్చెన్నాయుడుకు ప్రయోజనం చేకూరింది. ( జస్టిస్ రమణ ఆస్తులు, దమ్మాలపాటి కేసుల్లో ఇచ్చిన తీర్పుల వివరాల తాలూకు పత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!)
అలాగే రక్షిత స్థలంలో ఉన్న ఇళ్లను, కట్టడాలను తొలగించడానికి గతంలో ఉన్న ఏపీసీఆర్‌డీఏ ప్రక్రియ మొదలు పెట్టింది. ఆ ఇళ్లలో చంద్రబాబు నివాసం కూడా ఉంది. ఆ ప్రక్రియపై స్టే ఉంది. వరదల సమయంలో నది నీళ్లు ఆ ఇళ్లలోకి చేరాయి. అలాగే ఆ కట్టడాలు ప్రవాహానికి ఆటకం కలిగించాయి.
జస్టిస్ డి.రమేష్
జస్టిస్ రమేష్‌ను క్రిమినల్ కేసుల్లో క్వాష్ పిటిషన్ల విచారణ, రిట్ పిటిషన్ల పరిధిలో వ్యూహాత్మకంగా ఉంచారు. గత ప్రభుత్వం హయాంలో అడ్వొకేట్ జనరల్‌కు ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా జస్టిస్ రమేష్ ఉండేవారు. టీడీపీకి అనుబంధంగా ఉన్న వారి విషయంలో ఆయన వ్యవహారం ఇలా ఉంది..
► రమేష్ హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్ రమేష్ దాఖలు చేసిన పిటిషన్‌కు అనుకూలంగా, ఆయనపై తదుపరి చర్యలు తీసుకోకుండా జస్టిస్ రమేష్ స్టే ఇచ్చారు. రమేష్ ఆస్పత్రి నిర్వహించిన కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 10 మంది చనిపోయిన విషయంలో జస్టిస్ రమేష్ ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ డాక్టర్ రమేష్ పరారీలోనే ఉన్నారు. జస్టిస్ రమేష్ ఆదేశాలను సుప్రీం కోర్టు పక్కన పెట్టింది.
► ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ కోరుతూ రాష్ట్ర ఎన్నికల అధికారి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కొన్ని రోజుల నిందితుడు అదే ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ కోరుతూ రెండో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణకు స్వీకరించినపుడు రెండు పిటిషన్లు కోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొనడం గమనార్హం. అయితే కారణాలు ఏమీ చెప్పకుండా జస్టిస్ రమేష్ మాత్రం దర్యాప్తుపై స్టే విధించారు.
సత్యనారాయణ మూర్తి
జస్టిస్ సత్యనారాయణమూర్తి గత పది సంవత్సరాల నుం జస్టిస్ ఎన్వీ రమణకు విశ్వసనీయమైన వ్యక్తిగా ఉన్నారు. ప్రభుత్వంపై ఆయన వ్యతిరేకత ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పరిపాలనలో హైకోర్టు జోక్యం చేసుకున్న ప్రతి విషయంలోనూ ఆయన పాత్ర స్పష్టంగా కనబడుతుంది. రాజధానుల విచారణ విషయంలో అన్ని సందర్భాల్లో (ఆయన పక్కన కానీ లేదా ఫుల్ బెంచ్ అయినా కానీ) జస్టిస్ సత్యనారాయణ మూర్తి తనతో ఉన్నట్లు చీఫ్ జస్టిస్ నిర్ధారించారు. ప్రభుత్వ న్యాయవాదులపై ఆయన దారుణంగా వ్యవహరిస్తూ ఉంటారు.
► ఇంటర్ కాలేజీల సంఘం దాఖలు చేసిన పిటిషన్ విషయంలో.. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 365 విషయంలో అడ్వొకేట్ జనరల్‌కు సూచనలు చేస్తూ జస్టిస్ మూర్తి వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విషయంలో కౌంటర్‌ను పట్టించుకోకుండా కేవలం పిటిషనర్ అఫిడవిట్ ఆధారంగా జస్టిస్ మూర్తి విచారణను రిజర్వ్‌లో ఉంచారు. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో కూడా పలుమార్లు ప్రభుత్వాన్ని ఆయన వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ పథకాలపై కూడా ఆయన పలుమార్లు విమర్శలు చేశారు.
► మాజీ అడ్వొకేట్ జనరల్, జస్టిస్ ఎన్వీ రమణకు ఆప్తుడు అయిన దమ్మాలపాటి శ్రీనివాస్‌పై నమోదైన క్రిమినల్ కేసు విషయంలో దర్యాప్తు కొనసాగకుండా జస్టిస్ మూర్తి స్టే ఇచ్చారు.
జస్టిస్ డి.సోమయాజులు
► పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నుంచి నవయుగ ఇంజనీరింగ్‌ను తొలగించిన విషయంలో ఆ కంపెనీ దాఖలు చేసిన రిట్ పిటిషన్ జస్టిస్ సోమయాజులు వద్దకు విచారణకు వచ్చింది. హైకోర్టు వెబ్‌సైట్‌లో ఆయన ప్రొఫైల్ చూస్తే.. జస్టిస్ సోమయాజులు గతంలో నవయుగ కంపెనీకి లీగల్ సలహాదారుగా ఉన్నారు. విచారణ సమయంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించలేదు. ఆయన ఇచ్చిన ఆదేశాలను మరో జడ్జి వెకేట్ చేశారు. అయితే చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్.. జస్టిస్ సోమయాజులు ఇచ్చిన పూర్వ ఆదేశాలను తిరిగి అనుమతించింది.
► కేబినెట్ కమిటీ, సిట్ నివేదికలకు సంబంధించి అన్ని ప్రభుత్వ ఆదేశాలపై జస్టిస్ సోమయాజులు స్టే విధించారు. ఈ కేసు విషయంలో రిట్ పిటిషన్లు దాఖలు చేసిన వారు టీడీపీ కార్యకర్తలే. తమ పార్టీ ప్రతిష్టకు భంగం అంటూ ఆ పిటిషన్లు దాఖలు చేశారు.
సర్కారుకు వ్యతిరేకంగా ‘ఎల్లో పిల్స్’
తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ ఆ పార్టీ ఎజెండాను మోస్తున్న ఆంధ్రజ్యోతి, టీవీ5 న్యూస్ చానెల్ రాష్ట్ర ప్రభుత్వంపై పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్) దాఖలు చేయడానికి కారణమయ్యాయి. ముందుగా ఆయా అంశాలపై ఈ రెండు మీడియా సంస్థలు కథనాలు ఇవ్వడంతోపాటు చర్చలు నిర్వహిస్తాయి. ఇలా జరిగిన కొద్ది రోజులకే వాటిపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో పలు పిల్స్ దాఖలు అవుతాయి. వీటిలో కొన్ని..
జడ్జిల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని పిల్
రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తోందంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ఆగస్టు 15న ఒక కథనం ప్రచురించింది. అదే రోజు ఆ కథనాన్ని రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి ఖండించారు. ఆ పత్రిక రాసింది తప్పుడు కథనమని హైకోర్టు రిజిస్ట్రార్‌కు తెలిపారు. ఇది జరిగిన రెండు రోజులకే అంటే ఆగస్టు 17న హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై హైకోర్టు ఎలాంటి ప్రామాణికత లేని ఆ పత్రిక కథనాన్ని ఆధారం చేసుకుని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే ఆ పత్రిక కథనం ఆధారంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రంలో హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇందులో విచిత్రమేమిటంటే.. అటు హైకోర్టు.. ఇటు చంద్రబాబు ఫోన్ల ట్యాపింగ్ ఎలాంటి ఆధారాలను చూపకపోవడం గమనార్హం.
విశాఖలో టీడీపీ ర్యాలీకి అనుమతి నిరాకరణ
విశాఖలో బహిరంగ ర్యాలీ నిర్వహించడానికి టీడీపీని అనుమతించకపోవడానికి సంబంధించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. విశాఖ వెళ్లడానికి చంద్రబాబును ప్రభుత్వం అనుమతించని ఒక రోజు తర్వాత, సీఆర్పీసీ సెక్షన్ 151 కింద ఆయనకు నోటీసు జారీ చేసి అరెస్టు చేశాక ఈ పిల్ దాఖలు చేయడం గమనార్హం. దీనిపై కోర్టు డీజీపీని కోర్టుకు పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా అని నిలదీసింది.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ పిల్
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఒక నాయకుడు కోవిడ్–19 మార్గదర్శకాలను ఉల్లంఘించారని, భౌతికదూరాన్ని పాటించడం లేదని ఆరోపిస్తూ ఈ పిల్‌ను దాఖలు చేశారు. విచారణ చేసి ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేశామని ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. అయితే దీనిపై సంతృప్తి చెందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉల్లంఘనలపై సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నానని పేర్కొన్నారు. ఇది జరిగిన మరుసటి రోజు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని కోర్టులో పిల్ దాఖలైంది. ఈ రెండు పిల్స్‌ను కలిపి విచారించిన హైకోర్టు దీనికి సీబీఐ విచారణ అవసరం లేదని పేర్కొంది.
పలు విషయాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పులు..
1. గ్రామ పంచాయతీ కార్యాలయాల అధికార పార్టీ జెండా రంగులేస్తోందని పిల్స్
2. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమం ప్రవేశపెట్టడంపై పిల్
3. రాష్ట్ర ఎన్నికల సంఘానికి, మరెన్నో అంశాలకు సంబంధించి రిట్ పిటిషన్లు
4. జస్టిస్ ఈశ్వరయ్య, సస్పెన్షన్‌కు గురైన న్యాయాధికారి రామకృష్ణ మధ్య జరిగిన ప్రైవేటు సంభాషణపై హైకోర్టు నేరుగా విచారణకు ఆదేశించింది. దీనిపై విచారణ చేయాలని జస్టిస్ రవీంద్రన్‌ను కోరింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టుపై కుట్ర జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేకుండానే విచారణ బాధ్యతలను రవీంద్రన్‌కు అప్పగించింది. ( జస్టిస్ రమణ ఆస్తులు, దమ్మాలపాటి కేసుల్లో ఇచ్చిన తీర్పుల వివరాల తాలూకు పత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!)
Comments
Please login to add a commentAdd a comment