సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలు ఎలాంటి వివాదాలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం అన్నారు. ఆరు రోజుల పాటు సాగిన ఈ పరీక్షలకు మొత్తం 89.83 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. నిరుద్యోగ సమస్యను తగ్గించడంతో పాటు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అర్హులైన పేదలకు అందించాలని, ప్రభుత్వ సేవల్లో జాప్యం జరగరాదనే సదుద్దేశంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో పనిచేసేందుకు అవసరమైన ఉద్యోగుల నియామకానికి ఈ నెల ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు (2, 5 తేదీల్లో ప్రభుత్వ సెలవులు) ఆరు రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు.
(చదవండి : సచివాలయ పరీక్షల నిర్వహణపై సర్వత్రా ప్రశంసలు)
పరీక్షలు ప్రశాంతంగా ముగిసిన సందర్భంగా అజేయకల్లం సోమవారం మీడియాతో మాట్లాడారు. ఏపీలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టామన్నారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఒకే సారి లక్షా 34వేల ఉద్యోగాలు భర్తీ చేయడం రికార్డ్ అన్నారు. గత 20 ఏళ్లలో ఏడాదికి 1000 ఉద్యోగాలు కూడా భర్తీ చేసిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన స్వేచ్ఛ.. రాజకీయ జోక్యం లేకుండా చర్యలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాజకీయ జోక్యం లేకుంటే అధికారుల పనితీరు అద్భుతంగా ఉంటుందనడానికి ఈ ఉద్యోగ నియామక ప్రక్రియే నిదర్శనమన్నారు.
20లోగా ఫలితాలు : గిరిజా శంకర్
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలు మొత్తంగా 89.83శాతం అభ్యర్థులు హాజరయ్యారని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ వెల్లడించారు. పరీక్షలకు ఎటువంటి ఇబ్బది లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సచివాలయ ఉద్యోగ పరీక్షలకు 21.69లక్షల దరఖాస్తులు వచ్చాయని, మొత్తంగా 19.49 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. అభ్యర్థుల రవాణ సౌకర్యం కోసం 6వేల బస్సులను ఉపయోగించామన్నారు. జవాబు పత్రాలను స్ట్రాంగ్‌రూంలలో భద్రపరిచామని, జిల్లా కేంద్రాలలో ఓఎమ్మార్ షీట్ల స్కానింగ్ చేపడతామన్నారు. ఈ నెల 20 లోపు ఫలితాలను వెల్లడిస్తామని గిరిజా శంకర్ పేర్కొన్నారు.
అందరి సహకారంతోనే ఇంత పెద్ద టాస్క్ పూర్తి చేశాం : విజయ్‌కుమార్
అందరి సహకారం వల్లే సచివాల పరీక్షలను ప్రశాంతంగా ముగిశాయని మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ అన్నారు. తమపై నమ్మకంలో ప్రభుత్వం అప్పజెప్పిన పనిని సమర్ధవంతంగా నిర్వహించామన్నారు. పరీక్షల నిర్వహణ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు.
25శాతం టఫ్ ప్రశ్నలు ఉన్నాయి : ద్వివేది
ఏపీపీఎస్సీ ప్రమాణాలను పాటించి సచివాల ఉద్యోగాల పరీక్షలను నిర్వహించామని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ప్రశ్నాపత్రం 25శాతం టఫ్‌గా ఉందన్నారు. అత్యంత వేగంగా ప్రశ్నాపత్రాల స్కానింగ్ చేపట్టామని, ఈనెల 20లోపు ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. జిల్లాలవారిగా మెరిట్ లిస్ట్ ప్రకటిస్తామని తెలిపారు. సచివాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, 1500 చోట్ల సచివాలయ భవనాలను నిర్మిస్తామని ద్వివేది పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment