సాక్షి, చిత్తూరు : అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన అని ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లాం అన్నారు. ఆదివారం ఆయన మూడు రాజధానులకు మద్దతుగా చిత్తూరు జిల్లా నారావారిపల్లి గ్రామంలో నిర్వహించిన అధికార వికేంద్రీకరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజేయకల్లాం మాట్లాడుతూ.. అధికార వికేంద్రీకరణ అనేదే సీఎం జగన్ ప్రభుత్వ సిద్ధాంతం అని, ఇందులో భాగంగానే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశామన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ అలోచిస్తే.. చంద్రబాబు, ఎల్లో మీడియా ఒకే చోట అభివృద్ధిని కోరుకుంటున్నాయని విమర్శించారు.
గత టీడీపీ ప్రభుత్వం కొంతమంది లబ్ధి కోసమే అమరావతి రాజధాని నిర్మాణాన్ని చేపట్టిందని ఆరోపించారు. గతంలో హైదరాబాద్‌లో మాత్రమే పెద్ద పెద్ద కంపెనీలను పెట్టించారని, దాని వల్ల రాష్ట్రం చాలా నష్టపోయిందని చెప్పారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అలా చేయకుండా తమ రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని తీసుకెళ్లి సక్సెస్ సాధించాయని తెలిపారు. రాజధాని సెంటర్‌లో ఉండాలని కోరుకోవడం తప్పు అని అన్నారు. రాజధాని మధ్యలో ఉండాలని చంద్రబాబు అంటున్నారని, ఢిల్లీ నుంచి అమెరికా వరకు ఎక్కడా రాజధాని మధ్యలో లేదనే విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేయడమే టీడీపీ సిద్ధాంతం అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment