
సాక్షి, చిత్తూరు: పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయంపై ఆదివారం జిల్లాలోని చంద్రగిరి నారావారిపల్లిలో జరగనున్న ప్రజాసదస్సుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఆయనతో పాటు డీసీసీ బ్యాంక్ చైర్మన్ రెడ్డమ్మ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన నారావారిపల్లి సభా ప్రాంగణం వద్ద మాట్లాడుతూ.. రాజధాని మూడు విభాగాలుగా ఉండాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ సదస్సుకు మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు హాజరుకానున్నారని ఆయన తెలిపారు. అదేవిధంగా 25 వేల మంది కార్యకర్తలు, నాయకులు పాల్గొననున్నారని ఆయన అన్నారు. దానికి అనుకూలంగా సభావేదిక కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు.