సాక్షి, విజయవాడ: వ్యవసాయ రంగానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం గురించి అనుమానాలు ఏమైనా ఉంటే నివృత్తి చేయడానికి తాను మీడియా ముందుకు వచ్చాను అన్నారు సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం ముఖ్య ఉద్దేశ్యం పగటి పూట 9 గంటలు నాణ్యమైన కరెంటు ఇవ్వడం. ఇందుకు సంబంధించిన బిల్లును రైతుకు ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి ప్రభుత్వమే నగదు చెల్లిస్తుంది. నాణ్యమైన విద్యుత్‌ని అందిస్తున్న నేపథ్యంలో రైతుకు ప్రశ్నించే అవకాశం ఉంది. గతంలో ప్రభుత్వం 16,371 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలకు బకాయి ఉంది. ప్రతి మోటార్‌కు మీటర్ అమర్చడం ద్వారా నాణ్యమైన విద్యుత్ అందిస్తాం. ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మరింత చౌకగా ఉచిత విద్యుత్‌ని అందిస్తాం’ అన్నారు. (చదవండి: సాగుకు ‘పవర్’)
అంతేకాక ‘రైతు 9 గంటలు ఎంత విద్యుత్ వినియోగించినా అంతా ఉచితమే. విద్యుత్ మీటర్ రీడింగ్ అంతా ప్రభుత్వం చూస్తుంది. అనధికారికంగా ఉన్న విద్యుత్ కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తాం. రైతులు కోసం ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ తెరుస్తాం. దీనిపై బ్యాంకులు, విద్యుత్ అధికారులు మద్య ఒప్పందం జరగనుంది. కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బంది రాదు. గత ప్రభుత్వం కంటే మెరుగ్గా, చిత్తశుద్ధితో 7 వేలకు పైగా జూనియర్ లైన్ మెన్లను ఏర్పాటు చేశాం. 2018-19 కంటే 2019-20లో విద్యుత్ సరఫరాలో 38శాతం అవాంతరాలు తొలగిపోయాయి. రైతుకు అదనపు కనెక్షన్లు ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ పథకం కార్పొరేట్ పరిధిలోకి రాదు. 1250 రూపాయలు అదనంగా చెల్లిస్తే సరిపోతుంది. విద్యుత్ కనెక్షన్ల మార్పులకు సంబంధించిన వివరాలను విలేజ్ సెక్రటరీలకు ఇస్తే సరిపోతుంది. శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా డిసెంబర్ నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్యుత్ నగదు బదిలీ అమలు చేస్తాం. 17 లక్షలు పైగా కనెక్షన్లు ఉన్నాయి. అనధికారికంగా ఉన్న కనెక్షన్లు ఒక లక్షకు పైగా ఉన్నట్లు అంచనా. వాటిని క్రమబద్దీకరిస్తాం’ అన్నారు అజేయ కల్లాం.
Comments
Please login to add a commentAdd a comment