P. ashok babu
-
కుదిరిన రాజీ
ఏలూరు :జిల్లాలో కలెక్టర్, జేసీలతో ఉద్యోగ సంఘాల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి మంగళవారం రాత్రి తాత్కాలికంగా తెరపడింది. మూడు గంటలపాటు ఉద్యోగ సంఘాలు,కలెక్టర్, జేసీలతో మంత్రి పీతల సుజాత,వేర్వేరుగా చర్చించి ఇరువర్గాలకు రాజీ కుదిర్చారు. కలెక్టర్, జే సీలు ఉద్యోగులను దుర్భాషలాడుతూ, సస్పెన్షన్లు, క్రిమినల్ కేసులు పెడుతున్నారంటూ వారిని బదిలీ చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన విషయం తెల్సిందే. మంత్రి పీతల సుజాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎన్జీవో సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబును హైదరాబాదులో మంగళవారం కలిసి జిల్లాలో పరిస్థితిని వివరించారు. వారు రాజీ చేయాలని నిర్ణయించారు. ఆమె ఏలూరుకు చేరుకుని ఇరిగేషన్ గెస్ట్‌హౌస్‌లో తొలుత ఎన్జీవో సంఘ జేఏసీ చైర్మన్ ఎల్వీ సాగర్, హరనాధ్, శ్రీనివాస్, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ అయ్యి వారి సమస్యలను విన్నారు. సుమారు గంటపాటు ఉద్యోగులు తమ సమస్యలను మంత్రికి ఏకరువు పెట్టారు. కంప్యూటర్ ఆపరేటర్లు, ఏఎన్ఎంల జీతాల నిలుపుదల, వివిధ ఉద్యోగుల సస్పెన్షన్ల వ్యవహారాలను ఆయా ఉద్యోగుల చెప్పారు. కలెక్టర్, జేసీలు హామీ ఇస్తేగాని తాము రాజీపడేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. అనంతరం ఆమె కలెక్టర్, జేసీలను పిలిపించి ఉద్యోగ సంఘాల సమస్యలను వారిద్దరికి వినిపించారు. అనంతరం ఇరువర్గాల మధ్య రాజీని కుదిర్చారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ సామరస్యపూర్వకంగా అధికారులు, ఉద్యోగ సంఘాల మధ్య రాజీ చేశామన్నారు. తాత్కాలిక విరమణే ఎన్జీవో సంఘ జేఏసీ చైర్మన్ సాగర్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బందిని ఇద్దరు ఐఏఎస్‌లు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయమని హామీ ఇచ్చారని, అందుకే వారిద్దరి బదిలీల అంశం, ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమించామన్నారు. మంత్రి పీతల సుజాత ఇచ్చిన స్పష్టమైన హామీ మేరకు, యంత్రాంగంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తాముంటామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, జెడ్పీ చైర్మన్ ఎం.బాపిరాజుల హామీ మేరకు తాత్కాలికంగా ఆందోళన విరమిస్తున్నామన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు చోడగిరి శ్రీనివాస్, ఆర్ఎస్ హరనాథ్, పి వెంకటేశ్వరరావు,శ్రీధర్‌రాజు, శ్రీకాంత్ సాల్మన్, బి సోమయ్య, గుడిపాటి నరసింహారావు, జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోయేషన్ జిల్లా అధ్యక్షులు బి.సోమశేఖర్, కె.రమేష్‌కుమార్ పాల్గొన్నారు. -
హౌసింగ్ సొసైటీలో అశోక్‌బాబు సభ్యత్వం రద్దు
కోఆపరేటివ్ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎన్జీవో మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబుకు సభ్యత్వం ఇవ్వడాన్ని కోఆపరేటివ్ ట్రిబ్యునల్ తప్పుబట్టింది. ఆయన సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తూ ట్రిబ్యునల్ చైర్మన్ పి.శ్రీసుధ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అశోక్‌బాబుకు సభ్యత్వం కల్పించారంటూ శ్రీశైలం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ కార్యాలయ సూపరింటెండెంట్ డీఎల్ఆర్ సుధాకర్ దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రిబ్యునల్ విచారించి.. ఈ ఉత్తర్వు లిచ్చింది. 2010లో అశోక్‌బాబు సభ్యత్వంకోసం దరఖాస్తు చేసుకున్నారని, అయితే నగరంలో ఐదేళ్ల సర్వీసు పూర్తయినవారికే సభ్యత్వం ఇవ్వాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో ట్రిబ్యునల్ ఏకీభవించింది. సభ్యత్వం లేకుండానే సొసైటీకి అధ్యక్షుడిగా ఎన్నిక ఒకవైపు ఏపీ ఎన్జీవో మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో అశోక్‌బాబుకు సభ్యత్వం ఇవ్వడాన్ని కోఆపరేటివ్ ట్రిబ్యునల్ తప్పుబట్టి సభ్యత్వాన్ని రద్దు చేసినప్పటికీ.. మరోవైపు ఆయన్ను సొసైటీ అధ్యక్ష స్థానానికి ఎంపిక చేయడం గమనార్హం. బుధవారం సాయంత్రం ఏపీ ఎన్జీవోభవ నంలో హైడ్రామా మధ్య ఎన్నికలు నిర్వహించారు. అశోక్ బాబును కో-ఆప్షన్ సభ్యునిగా, ఆ తర్వాత అధ్యక్షునిగా ఎన్నుకున్నట్టు ప్రకటించారు. ట్రిబ్యునల్ ఉత్తర్వులు తమకందలేదని సొసైటీలోని అశోక్ బాబు వర్గీయులు చెప్పారు. విలేకరులు విషయాన్ని అశోక్‌బాబు దృష్టికి తీసుకెళ్లగా ట్రిబ్యునల్ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయిస్తానన్నారు. -
సమైక్యంపై ఏకవాక్య తీర్మానం: అశోక్‌బాబు
అశోక్‌బాబు డిమాండ్ బిల్లు తిప్పి పంపినా విభజన ఆగకపోవచ్చు సాక్షి, విజయవాడ: శాసనసభలో సమైక్యమనే ఏకవాక్య తీర్మానం చేయాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు పి.అశోక్‌బాబు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్‌ల ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 22వ తేదీన జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఇంటికొకరు తరలి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌కు వెళ్తే ఏం చేయాలనే అంశంపై 22వ తేదీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. అసెంబ్లీలో బిల్లును తిప్పి పంపినంత మాత్రాన విభజన ఆగకపోవచ్చన్నారు. చర్చకు అదనపు సమయం రాకపోతే ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టామన్నారు. కేంద్రం మొండివైఖరి వీడకపోతే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ పార్లమెంట్ జరిగేలోపు ఒకసారి గ్రిడ్‌ను పనిచేయకుండా చేస్తే ఆ వేడి కేంద్రానికి తాకుతుందని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధికార ప్రతినిధి తాడి శకుంతల మాట్లాడుతూ, పార్టీలు భేదాభిప్రాయాలు పక్కన పెట్టి సమైక్యత కోసం నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగసంఘాల నేతలు మాట్లాడుతూ, విద్యుత్ ఉద్యోగులు దక్షిణాది గ్రిడ్‌ను ఆపగలిగితే దాని ప్రభావం కేంద్రంపై పడుతుందని అభిప్రాయపడ్డారు. ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ రామాంజనేయులు పాల్గొన్నారు. -
నేడు సీమాంధ్ర బంద్: పి.అశోక్‌బాబు
సాక్షి, విజయవాడ: ఆరుకోట్ల మంది తెలుగు ప్రజల మనోభావాలను పక్కనపెట్టి కేంద్ర కేబినేట్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం సీమాంద్ర బంద్‌కు పిలుపు ఇస్తున్నట్లు ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు చెప్పారు. విజయవాడలో గురువారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ బంద్‌కు ప్రజలంతా మద్దతు పలకాలని కోరారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీల చేతకానితనం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్రం తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. కేబినేట్ ఆమోదం పొందినంత మాత్రాన తెలంగాణ వచ్చినట్లు కాదన్నారు. మొదటి అడుగు మాత్రమే పడిందని, ఇంకా చాలా దశలున్నాయని చెప్పారు. కేబినేట్ ఆమోదం పొందిన తర్వాత ఆగిపోయిన బిల్లులు ఎన్నో ఉన్నాయని, ఈ బిల్లు కూడా అలానే అవుతుందన్న ఆశాభావం ఉందని తెలిపారు. -
ఉద్యమం ఇక ఉగ్రరూపం: అశోక్‌బాబు
సాక్షి, అనంతపురం: ఇంతవరకు సీమాంధ్ర ఉద్యమాన్ని నిర్లక్ష్యంగా చూసిన యూపీఏ ప్రభుత్వం.. ఇకపై జరగబోయే ఉద్యమ ఉగ్రరూపానికి దిగిరాక తప్పదని సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు, ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు అన్నారు. అనంతపురం శివారులో రాచానపల్లి వద్ద శుక్రవారం ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ నిర్వహించారు. సభలో అశోక్‌బాబు మాట్లాడుతూ.. ఇప్పటివరకు చేసిన ఉద్యమం ఒక ఎత్తయితే... ఇకపై జరగబోయే ఉద్యమం మరో ఎత్తన్నారు. రహదారులను ధ్వంసంచేసి రవాణాను పూర్తిగా స్తంభింపజేస్తామని, ప్రజాప్రతినిధుల ఇళ్లకు విద్యుత్, తాగునీటి సరఫరా ఆపేస్తామన్నారు. ప్రజాప్రతినిధులు సోనియా కాళ్లు పట్టుకుని ప్యాకేజీల కోసం పాకులాడుతున్నారని.. వీళ్లంతా వట్టి వెధవలని మండిపడ్డారు. రాయల తెలంగాణ ఏర్పడితే కర్నూలు, అనంతపురం జిల్లాలకు నీటి కేటాయింపులు పూర్తిగా తగ్గిపోతాయన్నారు. తెలంగాణలోనూ 60 -70శాతం మంది సమైక్యాన్నే కోరుకుంటున్నట్లు చెప్పారు. డిసెంబర్ 4న కూడా తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదన్నారు. డిసెంబర్ 4 నుంచి 20 వరకు ఇంతకు ముందు కనీవినీ ఎరుగని రీతిలో సమైక్య ఉద్యమం చేపడతామని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో అశోక్‌బాబు తెలిపారు. డిసెంబర్ 2న ఎన్జీఓల సంఘం స్టీరింగ్ కమిటీ సమావేశం ఉందని, అందులో ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. -
సీమాంధ్ర ఎంపీలు అమ్ముడుపోయారు..
= ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు ఆగ్రహం = ఎంపీలు ప్యాకేజీల పాఠం వల్లించడంపై మండిపాటు = మూడు గంటలపాటు సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ సాక్షి, విజయవాడ/ ఉయ్యూరు : సీమాంధ్ర ఎంపీలు ప్యాకేజీలకు అమ్ముడుపోయారని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు పి.అశోక్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి రాజకీయ నాయకులను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. ఉయ్యూరులో ఆదివారం జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేసీపీ చక్కెర కర్మాగారం ఉద్యోగులు సహా విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు తరలివచ్చిన ఈ సభ మూడు గంటలపాటు జరిగింది. సభలో అశోక్‌బాబు ఉద్వేగంగా మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్‌కు తగు బలం లేని కారణంగా ఎన్నికల వరకు విభజన జరగదని, ఎన్నికల తర్వాత సమైక్యంగా ఉంచడం ప్రధాన కర్తవ్యమని చెప్పారు. వచ్చే ఎన్నికలు కీలకమైనవని పదేపదే తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆచితూచి వ్యవహరించాలని హితవు పలికారు. కులం, వర్గం, పార్టీలను బట్టి కాకుండా సమైక్యానికి ఎవరు ముందుంటారో వారిని ఎన్నుకోవాలని సూచించారు. పలుమార్లు ఆయన వచ్చే ఎన్నికలను ప్రస్తావించడం... ఓటును తూటాల్లా వాడాలని చెప్పడం సభలో చర్చనీయాంశమైంది. రాజకీయ నాయకులను ఆయన ఎక్కువగా టార్గెట్ చేసుకొని ప్రసంగించారు. వారి స్వార్థాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఉయ్యూరు సభను విజయవంతం చేసేందుకు ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు కృషిచేశారు. రాజకీయ సమాధి కట్టాలి... తెలుగు జాతికి వెన్ను పోటు పోడుస్తున్న నాయకులకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయాలని మేధావుల వేదిక రాష్ట్ర కన్వీనర్ చలసాని శ్రీనివాస్ సూచించారు. మనవేలితో మనకన్నే పొడిచేందుకు ప్యాకేజీలతో మీ ముందుకు వస్తున్నారు మోసపోవద్దు అని హితవు పలికారు. ‘సమైక్య ఉద్యమాన్ని చంపేయాలన్న దుర్మార్గాలు పన్నుతున్న కేంద్ర మంత్రులు, ఎంపీలను తిరగనివ్వకండి.. ప్యాకేజీలకు తలొగ్గి పార్లమెంట్, అసెంబ్లీలో బిల్లుకు అనుకూలంగా ఓటు వేసి విదేశాలకు వెళ్లి తలదాచుకునే దొంగలు ఉన్నారు.. వీరందరికీ పౌరసన్మానం చేసి వారి ఇళ్లను ముట్టడించండి’ అంటూ పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, పురందేశ్వరి సమైక్యాంధ్రకు ద్రోహం తలపెట్టారని విమర్శించారు. ‘తన ఇంటి పక్కన వ్యక్తికి రేషన్‌కార్డు, తన ఊళ్లో 50 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసుకోలేని పనబాక సీమాంధ్రను మరో సింగపూర్ చేస్తుందట.. వీరి మాటలు నమ్మితే భవితరాలు మనల్ని క్షమించరు.. ఇది యుద్ధ సమయం.. సకల జనులు మరో స్వాతంత్రోద్యమానికి సన్నద్ధం కావాలి’ అని సూచించారు. ఉద్యమానికి తూట్లు పొడవటం దుర్మార్గం.. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనకు లేఖ ఇవ్వటం, ఎన్టీఆర్ తనయ పురందేశ్వరి ప్యాకేజీలు కావాలంటూ సమైక్య ఉద్యమానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరించటం దుర్మార్గమని వ్యవసాయ శాఖ రాష్ట్ర మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. సీమాంధ్ర ఎంపీలు డ్రామాలు కట్టిపట్టి రాజీనామాలు చేస్తే విభజన ఆగిపోతుందని స్పష్టంచేశారు. విభజన కోసమే రాష్ట్రాన్ని విభజించటం సరికాదని మొదటి ఎస్సారీలో స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు. ప్రాంతీయ కమిటీ వేసి తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని శ్రీకృష్ణకమిటీ తన నివేదికలో స్పష్టంగా సూచించిందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, ఇరు ప్రాంతాల ప్రజల ఆమోదం లేకుండా విభజన ప్రక్రియ ప్రారంభిస్తే సమస్యలు ఉత్పన్నమవుతాయని కమిటీ నివేదికలో పొందుపరిచారని వివరించారు. కమిటీ నివేదికను కేంద్రం పక్కనపెట్టి విభజన చర్యలు ప్రారంభించిందని మండిపడ్డారు. రాష్ట్రం ముక్కలైతే నీటి యుద్ధాలు జరుగుతాయని, చుక్కనీరు కూడా డెల్టాకు వచ్చే అవకాశం లేదని, రైతులంతా రోడ్డెక్కి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రెవెన్యూ సర్వీసెస్ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పరాజు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులను నిలదీసి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల జోనల్ కార్యదర్శి వైవీ రావు మాట్లాడుతూ విభజిస్తే ఆర్టీసీకి సంబంధించి విద్యార్థులు రాయితీలు కోల్పోతారన్నారు. ఏపీ ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రజా ఉద్యమంతోనే సమైక్యాంధ్ర సాధించుకోగలుగుతామని స్పష్టం చేశారు. సభలో ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, కేసీపీ సీవోవో జి.వెంకటేశ్వరరావు, అడ్వకేట్ జేఏసీ నేత నరహరిశెట్టి శ్రీహరి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమాన్ని ఉయ్యూరు జేఏసీ కన్వీనర్ పరుచూరి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. దాడులకు పాల్పడితే ఖబడ్దార్... ఉయ్యూరు : సమైక్యవాదులపై, ఉద్యోగులు, విద్యాసంస్థలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని సమైక్యాంధ్ర పరిరక్షణవేదిక రాష్ట్ర అధ్యక్షుడు పర్చూరి అశోక్‌బాబు హెచ్చరించారు. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా సరే పరిధి మించి వ్యవహరిస్తే తాము అదే స్థాయిలో ప్రతిఘటించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమానికి అండగా నిలుస్తున్న విద్యాసంస్థలు, ఉద్యమంలో చురుగ్గా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై దాడులు, బెదిరింపులకు ప్రజాప్రతినిధులు పాల్పడుతున్నారని సభలో కొందరు అశోక్‌బాబు దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవలే నూజివీడులో అక్కడి జేఏసీ కన్వీనర్ కుమార్ విషయంలో పోలీసులు అనుచితంగా వ్యవహరించారని, అతని విద్యాసంస్థలపై దాడులు చేసి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై అశోక్‌బాబు స్పందిస్తూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. విద్యాసంస్థలపై, ఉద్యోగులపై దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. మంత్రులనైనా, ఎమ్మెల్యేలైనా సరే వదిలే ప్రసక్తే లేదన్నారు. సమైక్యాంధ్ర ద్రోహులుగా వ్యవహరించే ఏ ఒక్కరినీ వదలబోమని స్పష్టం చేశారు. నూజివీడులో ఇటీవల చోటుచేసుకున్న ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. -
గర్జించిన సమైక్య ఉద్యమం
=గుడివాడలో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం =చల్లపల్లిలో సకల జనుల గర్జన =నూజివీడులో విద్యార్థి గర్జన =వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సమైక్య ప్రతిజ్ఞలు =పంచాయతీల్లో తీర్మానాలు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున సమైక్య ఉద్యమం హోరెత్తింది. ఎన్జీవోల ఆధ్వర్యంలో గుడివాడలో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు హాజరయ్యారు. చల్లపల్లిలో సకలజనుల గర్జన, నూజివీడులో విద్యార్థి గర్జన మిన్నంటాయి. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సమైక్య ప్రతిజ్ఞలు, పాలాభిషేకాలు నిర్వహించారు. విభజనాసురుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. వైఎస్సార్సీపీ పిలుపుమేరకు సమైక్యాంధ్రకు మద్దతుగా పలు పంచాయతీలు తీర్మానం చేశాయి. సాక్షి, గుడివాడ/ విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు సమైక్యాంధ్ర ఆకాంక్ష మరోసారి ఆకాశాన్నంటింది. జిల్లా అంతటా సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనలు హోరెత్తాయి. గుడివాడ గుండె ఘోష గుడివాడ గుండె సమైక్య సింహనాదంతో ఘోషించింది. పట్టణ నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ స్టేడియం జనసంద్రమైంది. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాంగణం నూతనోత్తేజంతో ఉప్పొంగింది. జాతీయపతాక రూపశిల్పి, ఈ జిల్లావాసి పింగళి వెంకయ్య సభావేదిక సమైక్య ఉద్యమానికి బహుముఖ వ్యూహంతో కార్యాచరణను ఖరారు చేసింది. ఉవ్వెత్తున ఎగసిపడిన ఉద్యోగుల సమ్మె అనంతరం తొలిసారి గుడివాడలో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ మహాసభ సమైక్య ఉద్యమాన్ని హోరెత్తించింది. ఉద్యోగుల సమ్మె విరమణతో ఉద్యమం ఆగిపోయిందన్న ప్రచారానికి చెక్ పెడుతూ ఈ సభ స్పష్టతనిచ్చింది. తమ సమ్మె విరమణ తాత్కాలికమేనని, ఇది విశ్రాంతి మాత్రమేనని మరోమారు బహుముఖ వ్యూహంతో సమ్మెను కొనసాగిస్తామంటూ ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు సమక్షంలో ఉద్యోగ సంఘాల నాయకులు ప్రతినబూనారు. గుడివాడ సమైక్య ఉద్యమ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ విజయవంతం కావడంతో పాటు పలువురు సంఘాల నాయకులు ఉద్యమానికి దిశానిర్దేశం చేశారు. జిల్లాలో రానున్న కాలంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేలా కార్యాచరణ రూపొందించారు. ఈ నవంబరు, డిసెంబరు మాసాల్లో గ్రామగ్రామాన ఉద్యమనేతలు పర్యటించి రైతులు, ఉద్యోగులతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులు, ఉద్యోగులు కలిస్తే రాజకీయనేతల గతినే మార్చేస్తారని, రానున్న కాలంలో సమైక్యవాదంతో నిలిచే పార్టీలకే మద్దతు తెలిపేలా ప్రజలను సమాయత్తం చేయాలని మహాసభ సూచించింది. రాష్ట్ర విభజన వలన కలిగే నష్టాన్ని తొలిదశ ఉద్యమంతోనే ప్రజలకు వివరించగలిగామని, మలిదశ ఉద్యమంతో సమైక్యవాదం కాపాడుకునేలా కార్యాచరణ ఉండాలని మహాసభ తీర్మానించింది. ఇప్పటివరకు గాంధీమార్గంలో జరిగిన ఉద్యమ తీవ్రతను రానున్న కాలంలో ఢిల్లీ గద్దెను గడగడలాడించేలా బహుముఖ రూపాల్లో కొనసాగించాలని మహాసభ నిర్ణయించింది. గుడివాడ మహాసభ ఇంత విజయవంతంగా నిర్వహించడం ఈ జిల్లావాడిగా గర్విస్తున్నానని, తాను గుడివాడలోనే ఓనమాలు దిద్దామని అశోక్‌బాబు అన్నారు. మహాసభలో మాట్లాడిన ఉద్యోగ, కార్మిక, కర్షక, మేధావుల, నిపుణులు మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ఆయా రంగాల్లో సీమాంధ్రకు జరిగే నష్టాన్ని వివరించారు. తూర్పు కృష్ణా జేఏసీ చైర్మన్ ఉల్లి కృష్ణ అధ్యక్షతన జరిగిన మహాసభలో ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.చంద్రశేఖరరెడ్డి, వెస్ట్ కృష్ణా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్, రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ జేఏసీ కన్వీనర్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్, రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు పి.వెంకటేశ్వరరావు మాదిగ, మున్సిపల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రనాధ్, చలసాని ఆంజనేయులు, జలవనరుల నిపుణుడు పి.ఎ.రామకృష్ణంరాజు, జిల్లా జేఏసీ కోకన్వీనర్ మండలి హనుమంతరావు, గుడివాడ జేఏసీ చైర్మన్ యార్లగడ్డ వెంకటేశ్వరప్రసాద్, ఎన్జీఓస్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు షేక్ ఫరీద్‌బాషా, జి.రాజేంద్రప్రసాద్, డి.శ్రీనివాస్, పొట్లూరి గంగాధరరావు, ఎం.ప్రసాద్, వై.వి.రావు, కె.సత్యానందం, బి.అన్నపూర్ణ, ఎండీ ఇక్బాల్, నరహరశెట్టి శ్రీహరి, వరలక్ష్మి తదితరులు మాట్లాడారు. -
పార్టీల వైఫల్యం వల్లే విభజన
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాజకీయ పార్టీల వైఫల్యం వల్లే రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిందని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు పి. అశోక్‌బాబు అన్నారు. ప్రజల ఇబ్బందు ల దృష్ట్యా సమ్మెను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిపా రు. 66 రోజుల పాటు ఉద్యోగులు చేసిన సమ్మె ఫలితంగానే విభజన ప్రక్రియ జాప్యంలో జరిగిందన్నారు. బుధవారం ఆయన జిల్లా కేంద్రంలోని ఎన్జీఓ హోమ్‌లో జేఏసీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.కొంతమంది రాజ కీయ పార్టీల నాయకులు తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, తాము నోరు విప్పితే వారు రోడ్లపైకి రావాల్సి వ స్తోందని హెచ్చరించారు. ఉద్యమంలో పాల్గొన్న నాయకులకే వచ్చే ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని చెప్పారు. విభజన వల్ల సామాన్య ప్రజలే అధికంగా నష్టపోతారన్నా రు. ఉద్యోగులపై దాడులు చేస్తే తీవ్ర పరిణామా లు ఉంటాయని హెచ్చరించారు. సీమాంధ్ర ఎం పీలు బాధ్యతను విస్మరించి వ్యవహరిస్తున్నారని మం డిపడ్డారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన విభజన ప్రకటన 2014లోపు అమ లు కాదని ధీమా వ్యక్తం చేశారు. విజయనగరం పట్టణంలో జరిగిన సంఘటనలపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పట్టణంలో అక్రమ కేసులకు సంబంధించి కార్యవర్గంలో చర్చించి, తరువాత నిర్ణయం వెలువరిస్తామని చెప్పారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోరుున ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రత్యే క నిధి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ మేరకు జిల్లాల వారీ గా మృతి చెందిన ఉద్యోగుల జాబితాను సేకరిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రోటోకాల్ బహిష్కరిస్తాం ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎంపీలు, కేంద్రమంత్రులు వ్యాఖ్యలు చేస్తే వారి ప్రోటోకాల్‌ను బహిష్కరి స్తామని రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. మరోసారి ఉద్యమాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే రెవెన్యూపరంగా వారికి అన్ని సేవలు నిలిపివేస్తామమన్నారు.ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్రప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ఉద్యమాన్ని అణచివేసేందుకు అక్రమ అరెస్టులు చేయడం దారుణమన్నారు. పోలీసులు తక్షణమే అక్రమ కేసులు ఎత్తివేయూలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డీవీ రమణ, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ గంటా వెంకటరావు, ఎన్జీఓ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రభూజీ, సన్యాసిరాజు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జనార్దనరావు, పాల్గొన్నారు. -
సమ్మె కొనసాగిస్తాం: అశోక్ బాబు
సాక్షి, హైదరాబాద్: ‘కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విభజించేందుకు సిద్ధమవుతుంటే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేతులెత్తేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న గట్టి సంకల్పంతో పోరాడుతున్న ప్రజల్లో ఆ ధృడ సంకల్పం సడలకుండా ఉండాలంటే మా పోరాటం కొనసాగాల్సిందే. అందుకే సమ్మెను కొనసాగించాలనే నిర్ణయించాం. గురువారం ముఖ్యమంత్రితో జరిగే చర్చల్లో ఆయన ఇచ్చే హామీ ఆధారంగా మా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది’ అని ఏపీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబు తెలిపారు. బుధవారం 13 సీమాంధ్ర జిల్లాలకు చెందిన ఎన్జీఓ సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతినిధులంతా సమ్మె కొనసాగించాలని ముక్తకంఠంతో చెప్పడంతో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. సీమాంధ్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు నీతికి, నిబద్ధతకు కట్టుబడి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, ఇలాంటి సమయంలో తాము వెనక్కు వెళ్లడం సరికాదని ఎన్జీఓలు అభిప్రాయపడినట్లు చెప్పారు. అయితే గురువారం సీఎంతో భేటీకంటే ముందుగా జేఏసీ సమావేశం జరగనున్నందున, సమ్మెకు సంబంధించి అందులో వ్యక్తమయ్యే అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర విభజన జరగకుండా ఉండేందుకు తాను తీసుకోబోయే చర్యలకు సంబంధించి ముఖ్యమంత్రి ఇచ్చే స్పష్టత ఆధారంగా తమ తదుపరి కార్యాచరణను వెల్లడిస్తామని అన్నారు. ‘నేను సీఎంగా ఉన్నంతవరకు రాష్ట్ర విభజన జరగదు’లాంటి మాటలు కాకుండా ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన హామీని కోరుతున్నామని చెప్పారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరాలు సేకరిస్తోందో, వాటికి సంబంధించి ప్రభుత్వం ఏయే అంశాలను అందజేస్తోందో తెలియజేయాలన్నారు. ఎన్నో త్యాగాల తర్వాత సాధించుకున్న ఆర్టికల్ 371 డీ కొనసాగింపుపై వస్తున్న సంకేతాలు వంటి ఇతర ముఖ్యమైన అంశాలను కూడా దాపరికం లేకుండా తమకు వెల్లడించాలన్నారు. ఉద్యోగ సంఘాలను నమ్ముకుని ప్రజలు తీవ్రస్థాయిలో ఉద్యమాన్ని నిర్వహిస్తున్న సమయంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయటం వారిని అయోమయానికి గురిచేస్తోందని చెప్పారు. ‘విభజన తథ్యమైనందున సీమాంధ్ర హక్కులపై చర్చించటం మంచిది’లాంటి రకరకాల ప్రకటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. ‘చేతనైతే మాకు అండగా నిలవండి.. ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ప్రకటనలు మాత్రం మానుకోండి’ అని అశోక్‌బాబు విజ్ఞప్తి చేశారు. రాజీనామాలు చేయటం, రాష్ట్ర విభజనకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేసే విషయంలో ప్రజాప్రతినిధులపై తీవ్ర ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఎమ్మెల్యేలపై ఒత్తిడికే ప్రాధాన్యం విభజనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో స్పష్టమైన వాణిని వినిపిస్తే, దాని ఆధారంగా జాతీయ స్థాయిలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే వీలుంటుందని అశోక్‌బాబు చెప్పారు. అందువల్ల ఇకపై ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవటానికే తాము ప్రాధాన్యమిస్తామని అన్నారు. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలతో వారివారి నియోజకవర్గాల్లో బహిరంగ ప్రకటన చేయాలని ఒత్తిడి తెచ్చామని, దీన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఇప్పటికే విభజనకు వ్యతిరేకంగా అభిప్రాయాన్ని వెలుబుచ్చిన ఎమ్మెల్యేలను అభినందిస్తున్నామని అశోక్‌బాబు అన్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలపై ఢిల్లీలో ఒత్తిడిని పెంచాలని నిర్ణయించామని, ఒక్కో జిల్లా నుంచి వెయ్యిమంది చొప్పున ఢిల్లీకి వెళ్లి వారి నివాసాల ముందు ధర్నాలు చేస్తామని తెలిపారు. ఇప్పటికైనా వారు రాజీ‘డ్రామా’లు మానాలని, అధికారిక విధులకు దూరంగా ఉండాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో ఇప్పటికే తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలకు ఉత్తరాలు రాశామని, త్వరలోనే వ్యక్తిగతంగా కూడా కలుస్తామని చెప్పారు. ఈనెల 18న నాగార్జున సాగర్‌లో, 22న కాకినాడలో, 27న గుడివాడలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్టు అశోక్‌బాబు ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న సమైక్య శంఖారావానికి మద్దతుపై తర్వాత స్పందిస్తానని అన్నారు. -
చంద్రబాబు వైఖరేంటో తేలిపోతుంది: అశోక్ బాబు
భీమవరం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన విషయంలో టీడీపీ అధినేత ఎన్. చంద్రబాబునాయుడి వైఖరి ఏమిటనే విష యం అసెంబ్లీలో తెలంగాణ అంశంపై తీర్మానం సందర్భంలో తేలిపోతుందని ఏపీఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు పి. అశోక్‌బాబు పేర్కొన్నారు. గురువారం భీమవరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, విభజన అం శంపై అసెంబ్లీలో తీర్మానం చేసేప్పుడు చిత్తూరు జిల్లా కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు రాష్ర్ట విభజనకు ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉంటారా.. లేక సమైక్యాంధ్రకు అండగా నిలుస్తారా అనే విషయం ఆయన ఓటు ద్వారా తెలుస్తుందన్నారు. అసెంబ్లీలో విభజన తీర్మానం ఓడిపోతే పార్లమెంటులో కూడా బిల్లు ముందుకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. ఒకవేళ పార్లమెంటులో ఆమోదం పొందితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లేనన్నారు. పార్లమెంటులో విభజన తీర్మానాన్ని అడ్డుకోవాలని అన్ని జాతీయ పార్టీల నేతలను కలసి విన్నవిస్తామన్నారు. తొలుత చెన్నై వెళ్లి డీఎంకే నేతలను కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అశోక్‌బాబు చెప్పారు. ఎమ్మెల్యేలకు బహిరంగ లేఖ అసెంబ్లీలో విభజన తీర్మానాన్ని అడ్డుకోవాలని కోరుతూ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికీ బహిరంగ లేఖలు ఇవ్వనున్నట్టు అశోక్‌బాబు తెలిపారు. దసరా పండగ అనంతరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రతి ఎమ్మెల్యే విభజన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటువేసే విధంగా ప్రమాణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుందని ఆయనన్నారు. రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ఓటుతోనే బుద్ధిచెప్పండి అనంతరం భీమవరం లూథరన్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో హోరువానలో జరిగిన గోదావరి ప్రజాగర్జన సభలో అశోక్‌బాబు మాట్లాడుతూ రాష్ర్ట విభజనకు కారకులైన రాజకీయ పార్టీలకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జీతాలు రాకపోరుునా ఉద్యోగులు, చదువులు దెబ్బతింటున్నా విద్యార్థులు, కష్టనష్టాలు ఎదుర్కొంటూ ప్రజలు ఉద్యమిస్తున్నారని, అయితే విభజనను అడ్డుకునే విషయంలో ఎంపీలు చేసిన ద్రోహాన్ని మాత్రం ఎవరూ తట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నప్పుడే ఎంపీలు పదవులకు రాజీనామా చేసివుంటే తెలంగాణ నోట్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించేది కాదన్నారు. కనీసం ఎమ్మెల్యేలైనా అసెంబ్లీలో విభజన తీర్మానాన్ని ఓడించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. 2014 ఎన్నికల వరకు రాష్ర్ట విభజన జరగదని అశోక్‌బాబు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో సరైన నాయకత్వాన్ని ఎన్నుకోకపోతే రాష్ర్ట విభజనాంశం సీమాంధ్రుల చేరుుదాటిపోతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మూడుకోట్ల మంది ఓటర్లు బుల్లెట్లుగా మారాలని పిలుపునిచ్చారు. సభకు ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, రైతులు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో పలు సంఘాల నేతలు పాల్గొన్నారు.