చంద్రబాబు వైఖరేంటో తేలిపోతుంది: అశోక్ బాబు
భీమవరం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన విషయంలో టీడీపీ అధినేత ఎన్. చంద్రబాబునాయుడి వైఖరి ఏమిటనే విష యం అసెంబ్లీలో తెలంగాణ అంశంపై తీర్మానం సందర్భంలో తేలిపోతుందని ఏపీఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు పి. అశోక్‌బాబు పేర్కొన్నారు. గురువారం భీమవరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, విభజన అం శంపై అసెంబ్లీలో తీర్మానం చేసేప్పుడు చిత్తూరు జిల్లా కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు రాష్ర్ట విభజనకు ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉంటారా.. లేక సమైక్యాంధ్రకు అండగా నిలుస్తారా అనే విషయం ఆయన ఓటు ద్వారా తెలుస్తుందన్నారు. అసెంబ్లీలో విభజన తీర్మానం ఓడిపోతే పార్లమెంటులో కూడా బిల్లు ముందుకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. ఒకవేళ పార్లమెంటులో ఆమోదం పొందితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లేనన్నారు. పార్లమెంటులో విభజన తీర్మానాన్ని అడ్డుకోవాలని అన్ని జాతీయ పార్టీల నేతలను కలసి విన్నవిస్తామన్నారు. తొలుత చెన్నై వెళ్లి డీఎంకే నేతలను కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అశోక్‌బాబు చెప్పారు.
ఎమ్మెల్యేలకు బహిరంగ లేఖ
అసెంబ్లీలో విభజన తీర్మానాన్ని అడ్డుకోవాలని కోరుతూ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికీ బహిరంగ లేఖలు ఇవ్వనున్నట్టు అశోక్‌బాబు తెలిపారు. దసరా పండగ అనంతరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రతి ఎమ్మెల్యే విభజన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటువేసే విధంగా ప్రమాణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుందని ఆయనన్నారు. రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఓటుతోనే బుద్ధిచెప్పండి
అనంతరం భీమవరం లూథరన్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో హోరువానలో జరిగిన గోదావరి ప్రజాగర్జన సభలో అశోక్‌బాబు మాట్లాడుతూ రాష్ర్ట విభజనకు కారకులైన రాజకీయ పార్టీలకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జీతాలు రాకపోరుునా ఉద్యోగులు, చదువులు దెబ్బతింటున్నా విద్యార్థులు, కష్టనష్టాలు ఎదుర్కొంటూ ప్రజలు ఉద్యమిస్తున్నారని, అయితే విభజనను అడ్డుకునే విషయంలో ఎంపీలు చేసిన ద్రోహాన్ని మాత్రం ఎవరూ తట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నప్పుడే ఎంపీలు పదవులకు రాజీనామా చేసివుంటే తెలంగాణ నోట్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించేది కాదన్నారు.
కనీసం ఎమ్మెల్యేలైనా అసెంబ్లీలో విభజన తీర్మానాన్ని ఓడించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. 2014 ఎన్నికల వరకు రాష్ర్ట విభజన జరగదని అశోక్‌బాబు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో సరైన నాయకత్వాన్ని ఎన్నుకోకపోతే రాష్ర్ట విభజనాంశం సీమాంధ్రుల చేరుుదాటిపోతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మూడుకోట్ల మంది ఓటర్లు బుల్లెట్లుగా మారాలని పిలుపునిచ్చారు. సభకు ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, రైతులు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో పలు సంఘాల నేతలు పాల్గొన్నారు.