బాబుపై అంత ప్రేమ ఎందుకో?
Published Thu, Oct 10 2013 4:24 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
రామచంద్రపురం, న్యూస్‌లైన్ : నిన్నమొన్నటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు పేరెత్తితే చాలు ఒంటికాలిపై లేచే వారు. అలాగే ఒకప్పటి ప్రజారాజ్యం అధినేత, ప్రస్తుత కేంద్రమంత్రి చిరంజీవిపై ఈగ కూడా వాలనిచ్చేవారు కాదు. అలాంటిది ఇప్పుడు ఆ ప్రేమ చంద్రబాబుపై కనబరుస్తున్నారు. ఆయన రెండుకళ్ల సిద్ధాంతాన్ని విమర్శించినా, కించపరిచినా కన్నెర్రజేస్తున్నారు. ఇదీ కాంగ్రెస్ తరఫున ఉప ఎన్నికలో గెలిచిన రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులులో వచ్చిన మార్పు. ఇంతకాలం బాబుపై నిప్పు లు కక్కి, ఇప్పుడు అకస్మాత్తుగా యూ టర్న్ తీసుకొని ప్రేమ ఒలకబోయడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.
సమైక్యవాదినంటూ గొప్పలు చెప్పు కొనే తోట రాష్ర్ట విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన బాబును వెనకేసుకు రావడమే కాక సమైక్యాంధ్ర కోసం రెండుసార్లు ఆమరణ దీక్ష చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని చిన్నబుచ్చినట్టు మాట్లాడడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. చంద్రబాబుపై అంత ప్రేమ కనబరచడం వెనుక మర్మమేమిటని ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద జేఏసీ శిబిరం పక్కన కేంద్ర మంత్రులు, ఎంపీలతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు మహిళల దుస్తులతో ఉన్నట్టు రూపొందించిన ఫ్లెక్సీలను కొంతమంది సమైక్యవాదులు ఏర్పాటు చేశారు. ఏరియా ఆస్పత్రి గోడను ఆనుకుని ఉన్న ఈ ఫ్లెక్సీల్లో కేంద్ర మంత్రులు చిరంజీవి, జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, పళ్లంరాజు, కావూరి సాంబశిరావు, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ, ఎంపీ హర్షకుమార్‌లతో పాటు ‘రాష్ర్ట విభజనకు అనుకూలంగా లెటర్ ఇచ్చినందుకు’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్లెక్సీని కూడా పెట్టారు.
కాగా మధ్యాహ్నం జేఏసీ శిబిరానికి వచ్చిన ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సంఘీభావం తెలిపి, ప్రసంగించిన అనంతరం తిరిగి వెళ్తూ ఈ ఫ్లెక్సీలను చూశారు. ‘వీటిని ఎవరు పెట్టా’రంటూ జేఏసీ చైర్మన్ ఎం. వెంకటేశ్వర్లును ప్రశ్నించారు. ‘వాటితో జేఏసీకి ఎలాంటి సంబంధం లేదని, స్థానికంగా సమైక్యవాదులెవరైనా పెట్టి ఉంటారని, వెంటనే తొలగిస్తామని వెంకటేశ్వర్లు చెప్పారు. ఎమ్మెల్యే ‘కేంద్ర కేబినెట్ మం త్రుల ఫోటోలను పెట్టడం వరకు సమంజసమేనని, చంద్రబాబు ఫ్లెక్సీని ఎందుకు ఏర్పాటు చేశారని నిల దీశారు. పెడితే అందరి నాయకుల ఫ్లెక్సీలను పెట్టాలన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లెక్సీని కూడా పెట్టి అప్పుడు అన్నీ తొలగించాలని ఆదేశిం చారు.
జగన్‌ను అవమానిస్తే తీవ్ర పరిణామాలు..
ఫ్లెక్సీలను తొలగించేందుకు జేఏసీ నాయకులు ప్రయత్నించగా జగన్ ఫ్లెక్సీ పెట్టకుండా తొలగించడానికి వీల్లేదంటూ తోట అనుచరులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులతో పాటు పలువురు ప్రజలు అక్కడకు చేరుకొని తోట అనుచరుల తీరును ఎండగట్టారు. దీంతో ఫ్లెక్సీలను తొలగించారు. ఎస్సై బి.యాదగిరి సిబ్బందితో అక్కడకు చేరుకుని పరిస్థితి చక్కదిద్దారు. తోట రేపు ఎటు అడుగులు వేయనున్నారనే దానికి ఇది సూచన అని పలువురు వ్యాఖ్యానించారు.
Advertisement