హౌసింగ్ సొసైటీలో అశోక్‌బాబు సభ్యత్వం రద్దు
కోఆపరేటివ్ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎన్జీవో మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబుకు సభ్యత్వం ఇవ్వడాన్ని కోఆపరేటివ్ ట్రిబ్యునల్ తప్పుబట్టింది. ఆయన సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తూ ట్రిబ్యునల్ చైర్మన్ పి.శ్రీసుధ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అశోక్‌బాబుకు సభ్యత్వం కల్పించారంటూ శ్రీశైలం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ కార్యాలయ సూపరింటెండెంట్ డీఎల్‌ఆర్ సుధాకర్ దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రిబ్యునల్ విచారించి.. ఈ ఉత్తర్వు లిచ్చింది. 2010లో అశోక్‌బాబు సభ్యత్వంకోసం దరఖాస్తు చేసుకున్నారని, అయితే నగరంలో ఐదేళ్ల సర్వీసు పూర్తయినవారికే సభ్యత్వం ఇవ్వాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో ట్రిబ్యునల్ ఏకీభవించింది.
సభ్యత్వం లేకుండానే సొసైటీకి అధ్యక్షుడిగా ఎన్నిక
ఒకవైపు ఏపీ ఎన్జీవో మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో అశోక్‌బాబుకు సభ్యత్వం ఇవ్వడాన్ని కోఆపరేటివ్ ట్రిబ్యునల్ తప్పుబట్టి సభ్యత్వాన్ని రద్దు చేసినప్పటికీ.. మరోవైపు ఆయన్ను సొసైటీ అధ్యక్ష స్థానానికి ఎంపిక చేయడం గమనార్హం. బుధవారం సాయంత్రం ఏపీ ఎన్జీవోభవ నంలో హైడ్రామా మధ్య ఎన్నికలు నిర్వహించారు. అశోక్ బాబును కో-ఆప్షన్ సభ్యునిగా, ఆ తర్వాత అధ్యక్షునిగా ఎన్నుకున్నట్టు ప్రకటించారు. ట్రిబ్యునల్ ఉత్తర్వులు తమకందలేదని సొసైటీలోని అశోక్ బాబు వర్గీయులు చెప్పారు. విలేకరులు విషయాన్ని అశోక్‌బాబు దృష్టికి తీసుకెళ్లగా ట్రిబ్యునల్ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయిస్తానన్నారు.