సమైక్యంపై ఏకవాక్య తీర్మానం: అశోక్‌బాబు
అశోక్‌బాబు డిమాండ్
బిల్లు తిప్పి పంపినా విభజన ఆగకపోవచ్చు
సాక్షి, విజయవాడ: శాసనసభలో సమైక్యమనే ఏకవాక్య తీర్మానం చేయాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు పి.అశోక్‌బాబు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్‌ల ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 22వ తేదీన జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఇంటికొకరు తరలి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌కు వెళ్తే ఏం చేయాలనే అంశంపై 22వ తేదీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. అసెంబ్లీలో బిల్లును తిప్పి పంపినంత మాత్రాన విభజన ఆగకపోవచ్చన్నారు.
చర్చకు అదనపు సమయం రాకపోతే ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టామన్నారు. కేంద్రం మొండివైఖరి వీడకపోతే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ పార్లమెంట్ జరిగేలోపు ఒకసారి గ్రిడ్‌ను పనిచేయకుండా చేస్తే ఆ వేడి కేంద్రానికి తాకుతుందని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధికార ప్రతినిధి తాడి శకుంతల మాట్లాడుతూ, పార్టీలు భేదాభిప్రాయాలు పక్కన పెట్టి సమైక్యత కోసం నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగసంఘాల నేతలు మాట్లాడుతూ, విద్యుత్ ఉద్యోగులు దక్షిణాది గ్రిడ్‌ను ఆపగలిగితే దాని ప్రభావం కేంద్రంపై పడుతుందని అభిప్రాయపడ్డారు. ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ రామాంజనేయులు పాల్గొన్నారు.