Andhra Pradesh Journalist Forum
-
సమైక్యంపై ఏకవాక్య తీర్మానం: అశోక్‌బాబు
అశోక్‌బాబు డిమాండ్ బిల్లు తిప్పి పంపినా విభజన ఆగకపోవచ్చు సాక్షి, విజయవాడ: శాసనసభలో సమైక్యమనే ఏకవాక్య తీర్మానం చేయాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు పి.అశోక్‌బాబు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్‌ల ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 22వ తేదీన జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఇంటికొకరు తరలి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌కు వెళ్తే ఏం చేయాలనే అంశంపై 22వ తేదీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. అసెంబ్లీలో బిల్లును తిప్పి పంపినంత మాత్రాన విభజన ఆగకపోవచ్చన్నారు. చర్చకు అదనపు సమయం రాకపోతే ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టామన్నారు. కేంద్రం మొండివైఖరి వీడకపోతే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ పార్లమెంట్ జరిగేలోపు ఒకసారి గ్రిడ్‌ను పనిచేయకుండా చేస్తే ఆ వేడి కేంద్రానికి తాకుతుందని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధికార ప్రతినిధి తాడి శకుంతల మాట్లాడుతూ, పార్టీలు భేదాభిప్రాయాలు పక్కన పెట్టి సమైక్యత కోసం నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగసంఘాల నేతలు మాట్లాడుతూ, విద్యుత్ ఉద్యోగులు దక్షిణాది గ్రిడ్‌ను ఆపగలిగితే దాని ప్రభావం కేంద్రంపై పడుతుందని అభిప్రాయపడ్డారు. ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ రామాంజనేయులు పాల్గొన్నారు. -
ఆ తర్వాత తిట్టుకుందాం: ఉండవల్లి
హైదరాబాద్: రాష్ట్ర విభజనతో జరిగే నష్టాలు తెలంగాణ ప్రజలకు తెలియాలని రాజమండ్రి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాష్ట్రం ముక్కలయితే ఆంధ్రా కన్నా తెలంగాణే ఎక్కువ నష్టపోతుందన్నారు. ఏపీ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో సమగ్రమైన చర్చ జరగాలన్నారు. చర్చ జరిగితే నిజాలు బయటకు వస్తాయి. తెలంగాణలో ఎంత అభివృద్ధి జరిగిందో, ఎంత నష్టం జరిగిందో తెలుస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు శాసనసభలో సమైక్యవాదం వివిపించాలన్నారు. ఈ ఇరవై రోజులు ఎంతో కీలకమని అన్నారు. అప్పటివరకు పార్టీల సంగతి మర్చిపోయి సమైక్యవాదం పోరాడదామని పిలుపునిచ్చారు. ఆ తర్వాత మామూలుగా మనం తిట్టుకుందామంటూ ఆయన చమత్కరించారు. బిల్లుపై సమగ్రమైన చర్చ జరిగితే తెలంగాణ ప్రజలు కూడా తమతో కలిసొస్తారని ఉండవల్లి దీమా వ్యక్తం చేశారు. -
రాజ్యాంగ విరుద్ధంగా విభజన
‘ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం’ భేటీలో జేఏసీలు సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రాన్ని విభజించడమంటే కొత్తగా ఓ జిల్లాను సృష్టించడం లాంటిదనుకుంటున్నారా? ప్రజల అభిప్రాయాలకు విలువ లేదు. అవి ప్రతిఫలించాల్సిన అసెంబ్లీలో చర్చ లేదు. పార్లమెంటులో చర్చకు అవకాశమివ్వలేదు. మన రాష్ట్రంతో సంబంధం లేని నేతలు, మన సంస్కృతేమిటో అవగాహన లేని సోనియాలు కలిసి, రాజకీయ లబ్ధి కోసం విభజన నిర్ణయం తీసుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోవాలా? అబద్ధాలతో మభ్యపెట్టి విభజిస్తే తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడే సీమాంధ్ర, తెలంగాణ రెండూ తీవ్రంగా నష్టపోతాయి. కేంద్రానికి అమ్ముడుపోయిన సీమాంధ్ర కేంద్ర మంత్రుల వైఖరి, అక్కడి ఇతర నేతల వైఫల్యమే ఈ దుస్థితికి కారణం. విభజన ప్రక్రియ ఆగిపోకుంటే మన తెలుగు సాంస్కృతిక ఔన్నత్యమే ప్రమాదంలో పడుతుంది. సోదరభావంతో కలిసుండాల్సిన తెలుగువాళ్లు నీళ్ల కోసం కొట్టుకు చస్తారు’’ అని సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్న వివిధ జేఏసీలు తీవ్ర ఆవేదనను, ఆందోళనను వ్యక్తం చేశాయి. ‘ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం’ శనివారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వివిధ జేఏసీలు, సీమాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న ప్రముఖులు హాజరై కేంద్రం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు... నీటి కొట్లాటలు తప్పవు ‘‘విభజనతో తెలంగాణ తీవ్రంగా నష్టపోతుంది. మధ్యప్రదేశ్‌లో ఓడిపోయిన నేత, కాశ్మీర్లో గెలవలేని వ్యక్తి, గుజరాత్లో ఎవరో కూడా తెలియని మరో నేత కలిసి తెలుగు వారితో ప్రమేయం లేకుండా విభజన చేస్తున్నారు’’ - విశాలాంధ్ర మహాసభ ప్రతినిధి, రిటైర్డ్ ఐపీఎస్ ఆంజనేయరెడ్డి విభజనకు తెలంగాణలోనూ వ్యతిరేకత ‘‘తెలంగాణ ప్రజల్లో చాలామంది విభజనకు వ్యతిరేకం. ముసాయిదా బిల్లు అసెంబ్లీకి రాగానే మళ్లీ ఉద్యమిస్తాం. ప్రజాకాంక్షకు వ్యతిరేకంగా విభజన జరిగితే భవిష్యత్తులో ప్రజాయుద్ధం తప్పదు’’ - ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు సుప్రీం పట్టించుకుంటుంది ‘‘ఎన్డీఏ హయాంలో మూడు రాష్ట్రాల ఏర్పాటులో అసెంబ్లీల అభిప్రాయాల మేరకు వ్యవహరించారు. ఇప్పుడలా చేయకపోవడాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు’’ - సీవీ మోహన్‌రెడ్డి, సమైక్యాంధ్ర న్యాయవాదుల జేఏసీ అధ్యక్షుడు మభ్యపెడుతున్నారు ‘‘కేంద్రం తీరు అక్షయ పాత్ర తీసుకుని సీమాంధ్రకు భిక్షా పాత్ర ఇస్తున్నట్టుగా ఉంది’’ - చలసాని శ్రీనివాసరావు, ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు -
హైదరాబాద్ అందరిది: ఉండవల్లి
హైదరాబాద్: ఏ రాజకీయ నాయకత్వం లేకుండా, హింసాత్మక ఘటనలు జరగకుండా సమైక్యాంధ్ర ఉద్యమం జరగడం గర్వించదగ్గ విషయమని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఏపీఎన్జీవోలు సమ్మె విరమించడం సరైన నిర్ణయమని సమర్థిం చారు. మాదాపూర్ దసపల్లా హోటల్లో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఆదివారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన పాల్గొన్నారు. వివాదం అంతా రాజధాని చుట్టూనే ఉందని, అందుకే తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చిందన్నారు. హైదరాబాద్ రెండు ప్రాంతాలకు చెందుతుందన్నారు. సమస్య తీవ్రత తెలపడంతో ఉద్యోగులు సఫలమయ్యారని చెప్పారు. సీమాంధ్ర ఉద్యమ తీవ్రతను జాతీయ స్థాయికి తీసుకెళ్లామన్నారు. పార్లమెంట్లో తెలంగాణ ఎంపీలు తనకు అడ్డుకున్నారని అన్నారు. కలిసి వుండడం వల్ల ఎక్కువ లబ్ది పొందింది తెలంగాణే అని చెప్పారు. విభజనపై అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాతే పార్లమెంట్లో బిల్లు పెట్టాలన్నారు. పార్లమెంట్లో బిల్లు పెట్టే విషయంలో రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలన్నారు. బుధవారం రాష్ట్రపతిని కలవనున్నామని తెలిపారు. యూపీఏ ప్రభుత్వం చాలా కాలంగా మైనార్టీలో కొనసాగుతుందని, ఇప్పుడు తాము రాజీనామా చేసినా ఒరిగేదేం ఉండబోదన్నారు.