ఆ తర్వాత తిట్టుకుందాం: ఉండవల్లి
హైదరాబాద్: రాష్ట్ర విభజనతో జరిగే నష్టాలు తెలంగాణ ప్రజలకు తెలియాలని రాజమండ్రి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాష్ట్రం ముక్కలయితే ఆంధ్రా కన్నా తెలంగాణే ఎక్కువ నష్టపోతుందన్నారు. ఏపీ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో సమగ్రమైన చర్చ జరగాలన్నారు. చర్చ జరిగితే నిజాలు బయటకు వస్తాయి. తెలంగాణలో ఎంత అభివృద్ధి జరిగిందో, ఎంత నష్టం జరిగిందో తెలుస్తుందన్నారు.
పార్టీలకు అతీతంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు శాసనసభలో సమైక్యవాదం వివిపించాలన్నారు. ఈ ఇరవై రోజులు ఎంతో కీలకమని అన్నారు. అప్పటివరకు పార్టీల సంగతి మర్చిపోయి సమైక్యవాదం పోరాడదామని పిలుపునిచ్చారు. ఆ తర్వాత మామూలుగా మనం తిట్టుకుందామంటూ ఆయన చమత్కరించారు. బిల్లుపై సమగ్రమైన చర్చ జరిగితే తెలంగాణ ప్రజలు కూడా తమతో కలిసొస్తారని ఉండవల్లి దీమా వ్యక్తం చేశారు.