హైదరాబాద్ అందరిది: ఉండవల్లి
హైదరాబాద్: ఏ రాజకీయ నాయకత్వం లేకుండా, హింసాత్మక ఘటనలు జరగకుండా సమైక్యాంధ్ర ఉద్యమం జరగడం గర్వించదగ్గ విషయమని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఏపీఎన్జీవోలు సమ్మె విరమించడం సరైన నిర్ణయమని సమర్థిం చారు. మాదాపూర్ దసపల్లా హోటల్లో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఆదివారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన పాల్గొన్నారు. వివాదం అంతా రాజధాని చుట్టూనే ఉందని, అందుకే తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చిందన్నారు. హైదరాబాద్ రెండు ప్రాంతాలకు చెందుతుందన్నారు. సమస్య తీవ్రత తెలపడంతో ఉద్యోగులు సఫలమయ్యారని చెప్పారు. సీమాంధ్ర ఉద్యమ తీవ్రతను జాతీయ స్థాయికి తీసుకెళ్లామన్నారు. పార్లమెంట్లో తెలంగాణ ఎంపీలు తనకు అడ్డుకున్నారని అన్నారు.
కలిసి వుండడం వల్ల ఎక్కువ లబ్ది పొందింది తెలంగాణే అని చెప్పారు. విభజనపై అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాతే పార్లమెంట్లో బిల్లు పెట్టాలన్నారు. పార్లమెంట్లో బిల్లు పెట్టే విషయంలో రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలన్నారు. బుధవారం రాష్ట్రపతిని కలవనున్నామని తెలిపారు. యూపీఏ ప్రభుత్వం చాలా కాలంగా మైనార్టీలో కొనసాగుతుందని, ఇప్పుడు తాము రాజీనామా చేసినా ఒరిగేదేం ఉండబోదన్నారు.