బీఆర్‌ఎస్ చెబుతున్న 2014 సర్వేలో బీసీలు 51 శాతమే.. ఇప్పుడు 56.33 శాతం
కులగణనపై అసెంబ్లీలో విపక్ష సభ్యుల అభ్యంతరాలపై సీఎం రేవంత్
అబద్ధాల సంఘం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి రాజకీయ ప్రయోజనాలకు తావు లేకుండా, బీసీల ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవాలనే చిత్తశుద్ధితో కులగణన సర్వే జరిపామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. 2014లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే అంటూ బీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న నివేదికకు ఎలాంటి ప్రామాణికత లేదని అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే నివేదిక కేవలం ఎంసీఆర్‌హెఆర్‌డీ వెబ్‌సైట్‌లో తప్ప మరెక్కడా అందుబాటులో లేకుండా చేశారని పేర్కొన్నారు.
వాళ్లు చేశారని చెపుతున్న సర్వేలో కూడా బీసీల జనాభా 1,85,61,856 మంది అంటే 51 శాతం మాత్రమే కాగా, తాజా కులగణన సర్వేలో బీసీల సంఖ్య 56.33 శాతమని తేలిందని, అలాంటప్పుడు తగ్గింది ఎక్కడో చెప్పాలని సీఎం అన్నారు. ఇక ఓసీలు 71,18,858 మంది అంటే 21 శాతం కాగా, ఇప్పుడు తాము శాస్త్రీయంగా చేసిన సర్వేలో 15.7 శాతంగా తేలిందని తెలిపారు. అలాగే అప్పుడు ఎస్సీలు 18 శాతం కాగా ఎస్టీలు 10 శాతమని చెప్పారు. ముస్లిం కేటగిరీనే చూపించలేదన్నారు. శాసనసభలో మంగళవారం సమగ్ర కుల గణనపై జరిగిన చర్చ సందర్భంగా విపక్ష పారీ్టలు దానిపై పలు అభ్యంతరాలు లేవనెత్తాయి. ఈ సందర్భంగా సీఎం జోక్యం చేసుకుని మాట్లాడారు.
బీసీల జనాభాను తగ్గిస్తే నాకు లాభమేంటి?
‘బీసీల జనాభాను తగ్గిస్తే నాకు వచ్చే లాభం ఏమిటి? దీనిపై అనవసరంగా అపోహాలు సృష్టించవద్దు. ఎక్కడిదో పోగేసుకుని వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. మీరు సర్వే చేసి మంత్రివర్గానికి, శాసనసభకు నివేదికను ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి? కులగణనలో పాల్గొనని వారికి సభలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వొద్దు. తమ లెక్కలు బయటపడతాయనే కేసీఆర్ కుటుంబం సర్వేలో పాల్గొనలేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, పద్మారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో పాటు బీజేపీ ఎంపీ డీకే అరుణ వంటి వారు తమ వివరాలు ఇవ్వలేదు. స్వాతంత్య్రం రాకముందు నుంచి ప్రతి పదేళ్లకోసారి దేశంలో జనాభా లెక్కలు తీశారు.
2011 తర్వాత 14 ఏళ్లుగా జనాభా లెక్కలు లేవు. 2014లో ప్రధానిగా మోదీ వచ్చిన తర్వాతే ఈ పరిస్థితి నెలకొంది. రాహుల్‌గాంధీ పార్లమెంటులో డిమాండ్ చేసినా స్పందన లేదు. అబద్ధాల సంఘం (బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి) ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. 2014 డాక్యుమెంటును మీరెందుకు బహిర్గతం చేయలేదు? ఒక కుటుంబం కోసం చేసిన సర్వే అది. ఇప్పుడు శాస్త్రీయ పద్ధతిలో సర్వే చేశాం. ఇవే అధికారిక లెక్కలు. వీటికి కట్టుబడి ఉంటాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. అది సాధ్యమయ్యే అవకాశం ప్రస్తుతానికి లేదు.
రాజ్యాంగ సవరణ జరిగే వరకు పార్టీ తరఫున 42 శాతం సీట్లు బీసీలకు ఇస్తాం. ఇందుకు మా పీసీసీ అధ్యక్షుడిని కూడా ఒప్పించా. మీరు సిద్ధమా? బీజేపీ, బీఆర్‌ఎస్ తేల్చుకోవాలి..’అని సీఎం సవాల్ విసిరారు. ‘కుల గణన సర్వే నివేదికను సభ ముందుంచడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే, సర్వే నివేదిక మొత్తం నాలుగు పుటలుగా ఉంది. ఇందులో మూడు పుటలు కులగణన, ఇతర వివరాలు కాగా నాలుగో భాగంలో ప్రజల వ్యక్తిగత వివరాలున్నాయి. వీటిని బయటపెట్టడం చట్ట రీత్యా నేరం. కాబట్టి మిగతా మూడు పుటలను సభ ముందు ఉంచడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు..’అని ముఖ్యమంత్రి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment