కులగణన సర్వేపై శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి
దేశంలో 1931లో జరిగిన కులగణనే చివరిది
ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ, ఎక్కడా సర్వే జరగలేదు
బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీన వర్గాల స్థితిగతులు మెరుగు పరిచేందుకే సర్వే చేపట్టామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన, బలహీన వర్గాల హక్కుల కోసం ఉద్దేశించిన తొలి సమగ్ర కుల గణన, స్వతంత్ర భారతదేశంలో తెలంగాణలోనే జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గత ఏడాది ఫిబ్రవరి 4న రాష్ట్ర మంత్రిమండలి కులగణన సర్వే ప్రక్రియపై నిర్ణయం తీసుకుంటే, సరిగ్గా సంవత్సరానికే దీనిపై నివేదిక శాసనసభ ముందుకు వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీన వర్గాల స్థితిగతులను మెరుగు పరిచేందుకు, వివిధ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాల కోసం ప్రణాళికలను రూపొందించి అమలు చేయడం కోసం ఈ సర్వేను చేపట్టినట్లు పేర్కొన్నారు.
దీంతో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీల జనాభా లెక్క తేలిందని తెలిపారు. ఇది భవిష్యత్‌కు మోడల్‌గా మారుతుందని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఈ నివేదికే ప్రామాణికంగా ఉంటుందని స్పష్టం చేశా రు. ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే–2024’ నివేదికపై మంగళవారం శాసనసభ ప్రత్యేక సమావేశంలో సీఎం ప్రకటన చేశారు.
ఇదే కచ్చితమైన, శాస్త్రీయమైన సర్వే..
‘దేశంలో 1931లో జరిగిన కులగణన తర్వాత మళ్లీ ఏ రాష్ట్రంలోనూ కులగణన జరగలేదు. జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీల జనాభా వివరాలే ఉండేవి. దీంతో వెనుకబడిన, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతూ వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఎన్నికల సందర్భంగా రాహుల్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కులగణనపై హామీ ఇచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత తెలంగాణలో ఈ సర్వే చేపట్టాం.
గతంలో బిహార్ వంటి రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క వంటి మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశాం. సర్వేకు శ్రీకారం చుట్టాం. దీనిపై అధ్యయనం చేయించాం. మేమెంతో మాకంత ఇవ్వమన్న ఆయా వర్గాల డిమాండ్‌కు అనుగుణంగా రూ.160 కోట్లు వెచ్చించి సర్వే చేశాం. ఇదే కచ్చితమైన, శాస్త్రీయమైన సర్వే..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
అన్ని వర్గాల అభిప్రాయాలతో సర్వే షెడ్యూల్
‘వివిధ ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, మేధావులు, ఇతర స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని హౌస్ లిస్టింగ్ షెడ్యూల్, సర్వే షెడ్యూల్, ఎన్యూమరేటర్లకు మార్గదర్శకాల ఆధారంగా సర్వే షెడ్యూల్ రూపొందించాం. సర్వే ఫామ్‌లో 57 ప్రశ్నలు ఉండగా, అదనపు ఉప ప్రశ్నలతో కలిపి మొత్తం 75 విభాగాల్లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల అంశాలకు సంబంధించిన సమాచారం సేకరించాం. రాష్ట్రంలోని ప్రతి జిల్లాను ఒక్కొక్కటి 150 కుటుంబాలతో కూడిన 94,261 ఎన్యూమరేషన్ బ్లాకులుగా ఏర్పా టు చేశాం. ప్రతి బ్లాక్‌కి ఒక ఎన్యూమరేటర్‌ను, ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్‌వైజర్‌ని నియమించాం. రాష్ట్ర వ్యాప్తంగా 1,03,889 ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు..’ అని సీఎం తెలిపారు.
క్షేత్ర స్థాయిలో సర్వే..
‘రాష్ట్రంలో 2024 నవంబర్ 6న సర్వే ప్రారంభమై 2024 డిసెంబర్ 25తో పూర్తయింది. హౌస్–లిస్టింగ్ చేసిన కుటుంబాలు 1,15,71,457 కాగా 1,12,15,134 కుటుంబాల సర్వే జరిగింది. అంటే సర్వే కవరేజ్ 96.9 శాతం. వివిధ కారణాల వల్ల సర్వే చేయని కుటుంబాల సంఖ్య 3,56,323.
ఇవి జీహెచ్‌ఎంసీ, ఇతర నగరాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో 3,54,77,554 మందిని సర్వే చేయగా, సామాజిక వర్గాల వారీగా చూస్తే ఎస్సీల్లో 61,84,319 మందిని (17.43 శాతం), ఎస్టీల్లో 37,05,929 మందిని (10.45 శాతం) ముస్లిం మైనారిటీ మినహా బీసీల్లో 1,64,09,179 మందిని (46.25 శాతం), ముస్లిం మైనారిటీ బీసీలు 35,76,588 (10.08 శాతం) మందిని, ముస్లిం మైనారిటీల్లో మొత్తం 44,57,012 (12.56 శాతం) మందిని సర్వే చేయడం జరిగింది. ముస్లిం మైనారిటీల్లో ఓసీలు 8,80,424 (2.48 శాతం) మంది కాగా ఓసీలు 56,01,539 మంది (15.79 శాతం), ముస్లిం మైనారిటీ మినహా ఓసీలు 47,21,115 (13.31శాతం) మంది ఉన్నారు. మొత్తం 3.70 కోట్ల జనాభాగా తేలింది..’ అని రేవంత్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment