శాసనసభలో చర్చ సందర్భంగా కేటీఆర్
అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే వాయిదాపై బీఆర్‌ఎస్ అభ్యంతరం
సాక్షి, హైదరాబాద్: హడావుడిగా ప్రత్యేక సమావేశాలు పెడితే 42 శాతం రిజర్వేషన్ బిల్లు తెస్తారని అందరూ అనుకున్నారని, తీరా ప్రయోజనం లేని నివేదిక పెట్టారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీ రామారావు విమర్శించారు. కులగణనపై శాసనసభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్ బిల్లు తెస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో రేవంత్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. తమ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుంటే రేవంత్ రెడ్డి వివరాలు ఇవ్వొద్దని ప్రజలకు బహిరంగంగా పిలుపునిచ్చారని, 57 రకాల వివరాలను ఎవరికి పడితే వారికి ఎలా ఇస్తాం? అని మాట్లాడారని కేటీఆర్ తెలిపారు.
2014లో తాము ప్రభుత్వ అధికారులతోనే సర్వే చేయించామని, ఇది ముమ్మాటికీ అధికారిక పత్రమేనన్నారు. దాన్ని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ వెబ్‌సైట్‌లో పెట్టామని చెప్పారు. తమ హయాంలో నిర్వహించిన సర్వేలో 1.03 కోట్ల కుటుంబాలు, 3.68 కోట్ల జనాభా పాల్గొన్నారని కేటీఆర్ వెల్లడించారు. ఈ సర్వే ప్రకారం బీసీల సంఖ్య 1,85,61,856గా ఉందని, బీసీలు 51 శాతం ఉన్నారని, ముస్లిం బీసీలు 10 శాతం కలుపుకుంటే 61 శాతమని పేర్కొన్నారు. 51 శాతం ఉన్న బీసీల సంఖ్య 46 శాతానికి ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్సీనే ఈ సర్వే తప్పుల తడకగా ఉందని దాన్ని తగలబెట్టండని చెబుతున్నారని కేటీఆర్ అన్నారు. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విలేకరుల సమావేశంలో చెప్పిన విషయాలనే సభలోనూ చెప్పారని విమర్శించారు.
ప్రభుత్వ కుట్రకు నిరసనగా వాకౌట్: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలు, బలహీన వర్గాలకు చేసిన ద్రోహానికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రకటించారు. షెడ్యూల్ కులాల్లోని ప్రత్యేక వర్గాల ఉపవర్గీకరణను స్వాగతిస్తూనే, బీసీలకు చేసిన ద్రోహానికి వాకౌట్ చేస్తున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, కేపీ వివేకానంద్, చింతా ప్రభాకర్, సీహెచ్.మల్లారెడ్డి, రాజశేఖరరెడ్డి తదితరులు బీసీ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ డౌన్‌డౌన్ అంటూ నినదిస్తూ సభ నుంచి బయటకు వెళ్లారు. అంతకుముందు ఎస్సీ వర్గీకరణపై చర్చపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ మాట్లాడుతూ బీసీల సంఖ్యను ఐదు శాతం తగ్గించి బీసీల గొంతుకోసిన ప్రభుత్వ కుట్రకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపైన ప్రభుత్వం చేసిన ప్రకటనకు బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. ప్రభుత్వం వర్గీరణ కోసం చేసే ప్రతి ప్రయత్నానికి అండగా ఉంటామని తెలిపారు.
సభ వాయిదాపై అభ్యంతరం: మంగళవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడంపై బీఆర్‌ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. శాసనసభాపతి చాంబర్‌లో స్పీకర్ ప్రసాద్‌కుమార్‌తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి, కోవా లక్ష్మి, కౌశిక్‌రెడ్డి, చింతా ప్రభాకర్ భేటీ అయ్యారు. దీనిపై మాజీ మంత్రి హరీశ్‌రావు ‘ఎక్స్’లో స్పందిస్తూ ‘అసెంబ్లీ ప్రారంభమైన 2 నిమిషాలకే వాయిదా వేయడమేంటి? కేబినెట్ భేటీ ఇంకా కొనసాగుతున్నదని, సబ్జెక్ట్ నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరడం హాస్యాస్పదం. నాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు. నేడు పాలకపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు’ అని పేర్కొన్నారు.
వాట్ ఏ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్
‘అసెంబ్లీలో ఓవైపు సమగ్ర కుటుంబ సర్వే అంశం ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో ఎంసీహెచ్‌ఆర్‌డీ వెబ్‌సైట్ నుంచి సర్వే నివేదికను అధికారులు మాయం చేశారు’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘వెల్‌డన్ తెలంగాణ సీఎంఓ.. వాట్ ఏ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్’ అని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment