సమ్మె కొనసాగిస్తాం: అశోక్ బాబు
సాక్షి, హైదరాబాద్: ‘కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విభజించేందుకు సిద్ధమవుతుంటే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేతులెత్తేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న గట్టి సంకల్పంతో పోరాడుతున్న ప్రజల్లో ఆ ధృడ సంకల్పం సడలకుండా ఉండాలంటే మా పోరాటం కొనసాగాల్సిందే. అందుకే సమ్మెను కొనసాగించాలనే నిర్ణయించాం. గురువారం ముఖ్యమంత్రితో జరిగే చర్చల్లో ఆయన ఇచ్చే హామీ ఆధారంగా మా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది’ అని ఏపీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబు తెలిపారు.
బుధవారం 13 సీమాంధ్ర జిల్లాలకు చెందిన ఎన్జీఓ సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతినిధులంతా సమ్మె కొనసాగించాలని ముక్తకంఠంతో చెప్పడంతో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. సీమాంధ్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు నీతికి, నిబద్ధతకు కట్టుబడి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, ఇలాంటి సమయంలో తాము వెనక్కు వెళ్లడం సరికాదని ఎన్జీఓలు అభిప్రాయపడినట్లు చెప్పారు. అయితే గురువారం సీఎంతో భేటీకంటే ముందుగా జేఏసీ సమావేశం జరగనున్నందున, సమ్మెకు సంబంధించి అందులో వ్యక్తమయ్యే అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర విభజన జరగకుండా ఉండేందుకు తాను తీసుకోబోయే చర్యలకు సంబంధించి ముఖ్యమంత్రి ఇచ్చే స్పష్టత ఆధారంగా తమ తదుపరి కార్యాచరణను వెల్లడిస్తామని అన్నారు. ‘నేను సీఎంగా ఉన్నంతవరకు రాష్ట్ర విభజన జరగదు’లాంటి మాటలు కాకుండా ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన హామీని కోరుతున్నామని చెప్పారు.
రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరాలు సేకరిస్తోందో, వాటికి సంబంధించి ప్రభుత్వం ఏయే అంశాలను అందజేస్తోందో తెలియజేయాలన్నారు. ఎన్నో త్యాగాల తర్వాత సాధించుకున్న ఆర్టికల్ 371 డీ కొనసాగింపుపై వస్తున్న సంకేతాలు వంటి ఇతర ముఖ్యమైన అంశాలను కూడా దాపరికం లేకుండా తమకు వెల్లడించాలన్నారు. ఉద్యోగ సంఘాలను నమ్ముకుని ప్రజలు తీవ్రస్థాయిలో ఉద్యమాన్ని నిర్వహిస్తున్న సమయంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయటం వారిని అయోమయానికి గురిచేస్తోందని చెప్పారు. ‘విభజన తథ్యమైనందున సీమాంధ్ర హక్కులపై చర్చించటం మంచిది’లాంటి రకరకాల ప్రకటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. ‘చేతనైతే మాకు అండగా నిలవండి.. ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ప్రకటనలు మాత్రం మానుకోండి’ అని అశోక్‌బాబు విజ్ఞప్తి చేశారు. రాజీనామాలు చేయటం, రాష్ట్ర విభజనకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేసే విషయంలో ప్రజాప్రతినిధులపై తీవ్ర ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్టు తెలిపారు.
ఎమ్మెల్యేలపై ఒత్తిడికే ప్రాధాన్యం
విభజనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో స్పష్టమైన వాణిని వినిపిస్తే, దాని ఆధారంగా జాతీయ స్థాయిలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే వీలుంటుందని అశోక్‌బాబు చెప్పారు. అందువల్ల ఇకపై ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవటానికే తాము ప్రాధాన్యమిస్తామని అన్నారు. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలతో వారివారి నియోజకవర్గాల్లో బహిరంగ ప్రకటన చేయాలని ఒత్తిడి తెచ్చామని, దీన్ని కొనసాగిస్తామని తెలిపారు.
ఇప్పటికే విభజనకు వ్యతిరేకంగా అభిప్రాయాన్ని వెలుబుచ్చిన ఎమ్మెల్యేలను అభినందిస్తున్నామని అశోక్‌బాబు అన్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలపై ఢిల్లీలో ఒత్తిడిని పెంచాలని నిర్ణయించామని, ఒక్కో జిల్లా నుంచి వెయ్యిమంది చొప్పున ఢిల్లీకి వెళ్లి వారి నివాసాల ముందు ధర్నాలు చేస్తామని తెలిపారు. ఇప్పటికైనా వారు రాజీ‘డ్రామా’లు మానాలని, అధికారిక విధులకు దూరంగా ఉండాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో ఇప్పటికే తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలకు ఉత్తరాలు రాశామని, త్వరలోనే వ్యక్తిగతంగా కూడా కలుస్తామని చెప్పారు. ఈనెల 18న నాగార్జున సాగర్‌లో, 22న కాకినాడలో, 27న గుడివాడలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్టు అశోక్‌బాబు ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న సమైక్య శంఖారావానికి మద్దతుపై తర్వాత స్పందిస్తానని అన్నారు.