ఉద్యమం ఇక ఉగ్రరూపం: అశోక్‌బాబు
సాక్షి, అనంతపురం: ఇంతవరకు సీమాంధ్ర ఉద్యమాన్ని నిర్లక్ష్యంగా చూసిన యూపీఏ ప్రభుత్వం.. ఇకపై జరగబోయే ఉద్యమ ఉగ్రరూపానికి దిగిరాక తప్పదని సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు, ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు అన్నారు. అనంతపురం శివారులో రాచానపల్లి వద్ద శుక్రవారం ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ నిర్వహించారు. సభలో అశోక్‌బాబు మాట్లాడుతూ.. ఇప్పటివరకు చేసిన ఉద్యమం ఒక ఎత్తయితే... ఇకపై జరగబోయే ఉద్యమం మరో ఎత్తన్నారు. రహదారులను ధ్వంసంచేసి రవాణాను పూర్తిగా స్తంభింపజేస్తామని, ప్రజాప్రతినిధుల ఇళ్లకు విద్యుత్, తాగునీటి సరఫరా ఆపేస్తామన్నారు. ప్రజాప్రతినిధులు సోనియా కాళ్లు పట్టుకుని ప్యాకేజీల కోసం పాకులాడుతున్నారని.. వీళ్లంతా వట్టి వెధవలని మండిపడ్డారు.
రాయల తెలంగాణ ఏర్పడితే కర్నూలు, అనంతపురం జిల్లాలకు నీటి కేటాయింపులు పూర్తిగా తగ్గిపోతాయన్నారు. తెలంగాణలోనూ 60 -70శాతం మంది సమైక్యాన్నే కోరుకుంటున్నట్లు చెప్పారు. డిసెంబర్ 4న కూడా తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదన్నారు. డిసెంబర్ 4 నుంచి 20 వరకు ఇంతకు ముందు కనీవినీ ఎరుగని రీతిలో సమైక్య ఉద్యమం చేపడతామని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో అశోక్‌బాబు తెలిపారు. డిసెంబర్ 2న ఎన్‌జీఓల సంఘం స్టీరింగ్ కమిటీ సమావేశం ఉందని, అందులో ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు.