ఏడున్నర కోట్ల మంది ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు.
‘చలోహైదరాబాద్’ విజయవంతం చేయాలి: ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు పిలుపు
సాక్షి,సిటీబ్యూరో: ఏడున్నర కోట్ల మంది ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న యూపీఏ ప్రభుత్వంపై తాము చేస్తున్న పోరాటంలో అన్నివర్గాలు భాగస్వామ్యం కావాలని పిలుపు ఇచ్చా రు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బుధవారం ఇందిరాపార్కు వద్ద నిర్వహిస్తున్న ‘చలో హైదరాబాద్’ మహాధర్నాకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరానున్నారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా అసెంబ్లీలో సమైక్యవాదం వినిపిస్తున్న ప్రజాప్రతినిధులకు నైతిక మద్దతు ఇచ్చినట్లవుతుందన్నారు.
లక్షలాదిగా తరలి వచ్చి సమైక్య హోరు అసెంబ్లీని తాకేలా నినదించాలన్నారు. లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తారని చెప్పారు. సమైక్యవాదం వినిపించే వారికే ఎన్నికల్లో ఉద్యోగుల మద్దతు ఉంటుందని తెలిపారు. కాగా, ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని ఉద్యోగ సం ఘాలు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే అనుమతి ఇవ్వాలా?.. వద్దా అనే అంశంపై నగర పోలీసులు మంగళవారం నిర్ణయం తీసుకోనున్నారు.