seemandhra movement
-
ఉద్యమం ఇక ఉగ్రరూపం: అశోక్‌బాబు
సాక్షి, అనంతపురం: ఇంతవరకు సీమాంధ్ర ఉద్యమాన్ని నిర్లక్ష్యంగా చూసిన యూపీఏ ప్రభుత్వం.. ఇకపై జరగబోయే ఉద్యమ ఉగ్రరూపానికి దిగిరాక తప్పదని సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు, ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు అన్నారు. అనంతపురం శివారులో రాచానపల్లి వద్ద శుక్రవారం ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ నిర్వహించారు. సభలో అశోక్‌బాబు మాట్లాడుతూ.. ఇప్పటివరకు చేసిన ఉద్యమం ఒక ఎత్తయితే... ఇకపై జరగబోయే ఉద్యమం మరో ఎత్తన్నారు. రహదారులను ధ్వంసంచేసి రవాణాను పూర్తిగా స్తంభింపజేస్తామని, ప్రజాప్రతినిధుల ఇళ్లకు విద్యుత్, తాగునీటి సరఫరా ఆపేస్తామన్నారు. ప్రజాప్రతినిధులు సోనియా కాళ్లు పట్టుకుని ప్యాకేజీల కోసం పాకులాడుతున్నారని.. వీళ్లంతా వట్టి వెధవలని మండిపడ్డారు. రాయల తెలంగాణ ఏర్పడితే కర్నూలు, అనంతపురం జిల్లాలకు నీటి కేటాయింపులు పూర్తిగా తగ్గిపోతాయన్నారు. తెలంగాణలోనూ 60 -70శాతం మంది సమైక్యాన్నే కోరుకుంటున్నట్లు చెప్పారు. డిసెంబర్ 4న కూడా తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదన్నారు. డిసెంబర్ 4 నుంచి 20 వరకు ఇంతకు ముందు కనీవినీ ఎరుగని రీతిలో సమైక్య ఉద్యమం చేపడతామని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో అశోక్‌బాబు తెలిపారు. డిసెంబర్ 2న ఎన్జీఓల సంఘం స్టీరింగ్ కమిటీ సమావేశం ఉందని, అందులో ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. -
సవాళ్లు ఎదుర్కోడానికి సిద్ధం: డీజీపీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోడానికి పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని డీజీపీ ప్రసాదరావు చెప్పారు. రాష్ట్ర విభజనపై తానేమీ మాట్లాడబోనన్నారు. ఢిల్లీలో జరుగుతున్న వార్షిక పోలీస్ బాస్‌ల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. సదస్సులో ఉగ్రవాదం, నక్సలిజంపై చర్చించినట్టు తెలిపారు. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోందని, దానికి అనుగుణంగా తాము కూడా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఐబీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ, తెలంగాణ నిర్ణయం తర్వాత సీమాంధ్రలో ఉద్యమం రావడంపై ఆయన సదరు వ్యాఖ్యలు చేసి ఉంటారని వ్యాఖ్యానించారు. అయితే, 2 నెలల నుంచి సీమాంధ్రలో పరిస్థితులను చక్కదిద్దుతున్నట్టు చెప్పారు. -
విభజనకు సీమాంధ్ర కాంగ్రెస్ ఓకే
-
విభజనకు సీమాంధ్ర కాంగ్రెస్ ఓకే
సమైక్య రాష్ట్రాన్ని కాపాడతామని నేతల మాయమాటలు విభజనను అడ్డుకునేందుకే కొనసాగుతున్నామని సీఎం బుకాయింపు కేబినెట్ నోట్ వచ్చినా, జీవోఎం ఏర్పాటైనా రాజీనామాలు చేయలేదు ఇప్పుడు సీమాంధ్రలో ఉద్యమం తగ్గిందంటూ ప్యాకేజీల కోసం డిమాండ్ ఇన్నాళ్లూ మభ్యపెట్టి, ఇప్పుడు విభజనకు సహకరిస్తున్నారంటూ సీమాంధ్ర ప్రజల మండిపాటు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని ఇంతకాలం చెబుతూ వస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చివరకు తోకముడిచారు. ఇంతకాలం విభజనను అడ్డుకుంటామని మభ్యపెట్టిన ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఆ ప్రాంత ఎంపీలు, సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధుల ఫోరం ఒక్కొక్కరుగా తమ నిజస్వరూపాల్ని ఆవిష్కరిస్తున్నారు. సీమాంధ్రలో ఉద్యమం తగ్గిందన్న కారణాన్ని చూపుతూ గడిచిన కొన్ని రోజులుగా ప్యాకేజీ కోరడం మొదలుపెట్టారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీర్మానం చేసిన తర్వాత సీమాంధ్ర ఎమ్మెల్యేలు, మంత్రులు వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం మినహా మరో ప్రత్యామ్నాయాన్ని అంగీకరించబోమని, దానికోసం ఎంతవరకైనా వెళతామని గొప్పలు చెప్పారు. సమైక్యం కోసం రాజీనామాలకు వెనకాడబోమని, కేంద్రం విభజనపై ముందడుగువేస్తే రాజీనామాలు చేస్తామంటూ రకరకాల ప్రకటనలు చేసిన నాయకులే ఇప్పుడు ఒక్కొక్క గ్రూపుగా కేంద్ర పెద్దల ముందుకు వెళ్లి ప్యాకేజీలు కోరుతున్నారు. రాజీనామాలు చేసైనా సరే విభజనను అడ్డుకుంటామని ప్రకటించిన సీమాంధ్ర ఎంపీలు కొద్దిరోజులుగా తమ హడావిడిని తగ్గించారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు కొద్ది రోజుల కిందటే కేంద్ర మంత్రి వీరప్పమొయిలీ, ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను కలిసి ప్యాకేజీపై ఏకంగా నివేదికనే సమర్పించి చేతులు దులుపుకున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల తీరుపై సీమాంధ్ర ప్రజలు మండిపడుతున్నారు. మొదటినుంచీ మోసపూరిత మాటలే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంతకాలం పోటాపోటీగా సీమాంధ్ర ప్రజలను మోసగిస్తూ వచ్చారు. రాజీనామా డిమాండ్ వచ్చిన ప్రతిసారీ... కేబినెట్‌కు తెలంగాణ నోట్ రాకుండా అడ్డుకోవడానికే పదవుల్లో కొనసాగుతున్నామని సీమాంధ్ర కేంద్రమంత్రులు చెబుతూ వచ్చారు. ఇక ముఖ్యమంత్రి తెలంగాణ బిల్లు అసెంబ్లీలో తీర్మానం కోసం వస్తుందని, దాన్ని ఓడించాలంటే రాజీనామాలు చేయకూడదని పక్కదారి పట్టిస్తూ వచ్చారు. కానీ బిల్లు అసెంబ్లీ అభిప్రాయం కోసం మాత్రమే వస్తుందని, దానిపై తీర్మానం చేయడం కోసం కాదని కేంద్ర హోమ్ మంత్రి షిండే, ఏఐసీసీ ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌లు తేల్చిచెప్పారు. కేంద్రం తెలంగాణ నోట్‌ను ఆమోదించడం, మంత్రుల బృందం ఏర్పాటుకావడం తదితర పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి. కానీ సీమాంధ్ర కేంద్ర మంత్రులుకానీ, ముఖ్యమంత్రికానీ రాజీనామాలు చేయలేదు. ఇపుడు సీమాంధ్రలో ఉద్యమం తగ్గుముఖం పట్టిందని ప్రచారం చేస్తూ నెమ్మదిగా సమైక్యాన్ని విడిచిపెట్టి విభజనకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు ప్రధాని మన్మోహన్సింగ్ను కలసి సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కావాలని నివేదిక ఇచ్చారు. ఇప్పుడదే బాటలో సీమాంధ్ర రాష్ట్ర మంత్రులు, ఇతర నాయకులు విభజనతో తలెత్తే సమస్యలను పరిష్కరించాలంటూ కొత్త రాగాన్ని అందుకున్నారు. కేంద్ర మంత్రుల బృందం రాసిన లేఖకు సమాధానంగా పంపిన నివేదికలో, అఖిలపక్షానికి పీసీసీ తరఫున అందించిన నివేదికలోనూ విభజనకు అనుకూలంగా సీమాంధ్ర నేతలు పలు ప్రతిపాదనలను పొందుపరిచారు. హైదరాబాద్‌లో నెలకొల్పిన దాదాపు 30కి పైగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం సీమాంధ్రలో ఏర్పాటుచేయాలని, ప్రైయివేటు పరిశ్రమలు, పెట్టుబడులు సీమాంధ్రకు వచ్చేలా కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. హెచ్ఎండీయే పరిధిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకంచడంతో పాటు అక్కడి ఆదాయ వనరుల్లో జనాభా ప్రాతిపదికన తెలంగాణ, సీమాంధ్రులకు వాటా కల్పించాలని పేర్కొన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాల భూమి అవసరమని, పరిశ్రమలు, ఐటీ సంస్థల ఏర్పాటుకు మరో లక్ష ఎకరాలు కావాలని, ఇంత భూమిని కేంద్రం సమకూర్చాలంటే రెండు లక్షల ఎకరాలున్న అటవీప్రాంతాన్ని కేంద్రం డీనోటిఫై చేయాల్సి ఉంటుందని చెబుతూ రకరకాలుగా కేంద్రానికి నివేదిస్తున్నారు. ఇవన్నీ విభజన జరిగాక కావాల్సిన వనరుల గురించి మాత్రమేననే విషయం గమనార్హం. కేంద్రమంత్రి చిరంజీవి బుధవారం గోదావరి జిల్లాల్లో పర్యటిస్తూ గోదావరి తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయిస్తానని హామీ ఇవ్వడం కూడా ఇందులో భాగమే. మరో కేంద్రమంత్రి పనబాక లక్ష్మి రెండురోజుల కిందట సీమాంధ్రను సింగపూర్‌లా మారుస్తానని, బాపట్లను భాగ్యన గరంగా తీర్చిదిద్దుతానని చెప్పడం అంతా ఒక పథకం ప్రకారమే నడిపిస్తున్నారని తెలుస్తోంది. ఈ డిమాండ్లన్నీ అసాధ్యమన్న విషయం తెలిసినా... విభజన ప్రక్రియ పూర్తయ్యేవరకు కాలయాపన కోసమే ఈ రకమైన ప్రకటనలు చేస్తున్నారా? అన్న అనుమానాలు సీమాంధ్ర ప్రజల్లో తలెత్తుతున్నాయి. తమను ఇన్నాళ్లూ మభ్యపెట్టే ప్రకటనలతో కాలయాపన చేసి ఇప్పుడు విభజనకు సహకరిస్తూ నట్టేట ముంచారని మండిపడుతున్నారు. -
సీమాంధ్ర ఉద్యోగులకు రెండు నెలల అడ్వాన్సు
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యమంలో భాగంగా సమ్మెలో పాల్గొన్న ప్రభుత్వోద్యోగులకు శుభవార్త. వారికి రెండు నెలల జీతాన్ని అడ్వాన్సుగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగ సంఘాల డిమాండ్‌కు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అంగీకరించటంతో ఇందుకు మార్గం సుగమమైంది. సీమాంధ్ర ఉద్యమంలో భాగంగా ఏపీ ఎన్జీవోలతో పాటు పలు శాఖల ప్రభుత్వోద్యోగులు 66 రోజులు సమ్మెలో పాల్గొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు నెలల జీతాన్ని అడ్వాన్సుగా చెల్లించాల్సిందిగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. 60 రోజులను గానీ, 45 రోజులను గానీ పరిగణనలోకి తీసుకుని అడ్వాన్సు చెల్లించాలని ఆర్థిక శాఖకు సాధారణ పరిపాలన శాఖ సూచించింది. నిర్ణయం కోసం ఫైలును మూడు రోజుల క్రితం సీఎం కార్యాలయానికి పంపింది. వరద ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్లే హడావుడిలో ఆయన దానిపై ఏ నిర్ణయమూ తీసుకోకపోవడంతో ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి, రెండు నెలలను పరిగణనలోకి తీసుకోవాలని మళ్లీ కోరారు. సోమవారం ఉద్యోగ సంఘాల జేఏసీ ఆఫీస్ బేరర్ల సమావేశంలోనూ దీనిపై చర్చించారు. రెండు నెలల జీతాన్ని అడ్వాన్సుగా చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తీర్మానించారు. దీపావళి వస్తున్నందున రెండు నెలల జీతాన్ని అడ్వాన్సుగా ఇవ్వాలని సోమవారం సాయంత్రం పొద్దుపోయాక సీఎం నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఉత్తర్వు వెలువడవచ్చు. దీనిపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. విభజన కోసం తెలంగాణకు చెందిన ప్రభుత్వోద్యోగులు గతంలో సమ్మె చేసినప్పుడు ఒక నెల జీతాన్ని ప్రభుత్వం అడ్వాన్సుగా ప్రకటించడం తెలిసిందే. ఇటీవల ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించినప్పుడు కూడా, దసరా దృష్ట్యా వెంటనే విధుల్లో చేరిన వారందరికీ ప్రభుత్వం వెంటనే అడ్వాన్సు చెల్లించింది. -
వానజోరు.. సమైక్యహోరు
సాక్షి నెట్వర్క్ : రాష్ట్రం ఒక్కటిగా ఉండటం కంటే మరో ప్రత్యామ్నాయమే లేదన్న నినాదంతో సీమాంధ్రలో ఎగసిన జనోద్యమం వరుసగా 85వ రోజైన బుధవారం కూడా ఉద్ధృతంగా సాగింది. కోస్తా, రాయలసీమల్లోని పలు జిల్లాల్లో జోరువర్షం కురుస్తున్నా సమైక్యవాదులు ఆందోళనలు కొనసాగించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో అన్ని జేఏసీలు కలిసి ర్యాలీ నిర్వహించాయి. పుంగనూరు రూరల్ నల్లగుట్టపల్లి గిరిజన తండాలో విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. చిత్తూరులో ఎన్జీవోలు గాంధీవిగ్రహం వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. అనంతపురం జిల్లా పామిడిలో విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. కుందుర్పిలో జేఏసీ నాయకులు, విద్యార్థులు గాడిదకు వినతిపత్రం అందజేశారు. కర్నూలు జిల్లా అంతటా వర్షం కురుస్తున్నా సమైక్యవాదులు ఆందోళన కార్యక్రమాలను కొనసాగించారు. డోన్‌లో ఆటో యూనియన్ నాయకులు ఆధ్వర్యంలో చిరంజీవి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కృష్ణాజిల్లా కలిదిండి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థుల మానవహారం చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాల్లో ఎన్జీవోలు, సమైక్యవాదులు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. మార్టేరులో డ్వాక్రా మహిళలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రి, పెద్దాపురంల్లో న్యాయవాదులు దీక్షలు కొనసాగిస్తున్నారు. వైఎస్సార్సీపీ అలుపెరగని పోరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణే లక్ష్యంగా నేతలు, కార్యకర్తల ఆందోళన కూడా కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా పలమనేరులో పార్టీ కార్యకర్తలు జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేపట్టారు. వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్లలో జోరువానలో ధర్నా చేపట్టారు. పులివెందులలో ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా మల్కిపురంలో దింపు కార్మికుని తరహాలో కొబ్బరి దింపుతూ నిరసన తెలిపారు. పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు వరుదు కల్యాణి ఆధ్వర్యంలో శ్రీకాకుళం రూరల్ మండలం కుందువానిపేటలో సమైక్య శంఖారావం సభకు మద్దతుగా గ్రామస్తులంతా ర్యాలీ చేపట్టారు. -
'సీమాంధ్రలో ఉద్యమాలు తగ్గుముఖం'
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమాలు, ఆందోళనలు తగ్గుముఖం పట్టాయి అని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. అసెంబ్లీకి తీర్మానం పంపే విషయంపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో మాట్లాడిన తర్వాత స్పందిస్తానని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 2014 కు ముందే తెలంగాణ ప్రకియ పూర్తవుతుందన్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేఖ ఇచ్చి.. ఆతర్వాత తెలంగాణ అంశంపై యూటర్న్ తీసుకోవడంతో విశ్వసనీయ కోల్పోయాడు అని దిగ్విజయ్ అన్నాడు. సీఎం కిరణ్ తొలగిస్తామనే వార్తల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. వచ్చే శీతాకాలపు పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని దిగ్విజయ్ స్పష్టం చేశారు. -
73వ రోజు ధర్నాలతో దద్దరిల్లిన సీమాంధ్ర
సాక్షి నెట్వర్క్ : ఫైలిన్ తుపాను హెచ్చరికలు.. ఈదురుగాలులు.. అక్కడక్కడా భారీవర్షాలు.. అయినా సరే లెక్కచేయని సీమాంధ్ర ప్రజ సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణే లక్ష్యంగా ఉప్పెనంత ఉద్యమంతో కదంతొక్కుతోంది. రాష్ర్టం ఒక్కటిగా ఉంచాలని కోరుతూ కోస్తా, రాయలసీమ ప్రజలు వరుసగా 73వ రోజైన శుక్రవారం కూడా ఆందోళనలు చేపట్టారు. జాతీయ రహదారి దిగ్బంధం పశ్చిమ గోదావరి జిల్లా కలపర్రు టోల్గేట్ వద్ద సమైక్యవాదులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. తాడేపల్లిగూడెంలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు జంక్షన్ వద్ద రాస్తారోకో చేపట్టారు. భీమవరంలో జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పశు సంవర్థక శాఖ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో పశువుల ఆస్పత్రి వద్ద తప్పెటగుళ్లు కళాకారులు సమైక్యాంధ్ర గీతాలను ఆలపిస్తూ ప్రదర్శన చేశారు. వివిధ శాఖల రాష్ర్ట నాయకులు కాకినాడ కలెక్టరేట్ వద్ద దీక్షల్లో పాల్గొన్నారు. ఉప్పలగుప్తంలో నలుగురు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో జేఏసీ సభ్యులు మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తం చేశారు. నక్కపల్లిలో ఏపీఎన్జీవోల దీక్షలు కొనసాగుతున్నాయి. గాజువాకలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లా గంట్యాడలో సాక్షర భారత్ కోఆర్డినేటర్లు నిరసన ర్యాలీ చేశారు. గజపతినగరంలో విజయనగరం-సాలూరు జాతీయ రహదారిని దిగ్బంధించి రాస్తారోకో చేశారు. పార్వతీపురంలో మహిళా ఉద్యోగులు మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. బతుకమ్మ ఆటతో సమైక్య స్ఫూర్తి చిత్తూరులో న్యాయశాఖ ఉద్యోగులు బతుకమ్మ ఆడి సమైక్యస్ఫూర్తిని ప్రదర్శించారు. పీలేరులో జేఏసీ నాయకులు రాష్ట్ర విభజన జరిగితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మృగ్యమై తెలంగాణ వాదుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుందన్న ఇతిృత్తంతో లఘునాటికను ప్రదర్శించారు. చంద్రగిరిలో సమైక్యవాదులు బీఎస్ఎన్ఎల్ కార్యాలయాన్ని ముట్టడించారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో జేఏసీ ఆధ్వర్యంలో వందలాది మంది డ్వాక్రా మహిళలు సోనియా, కేంద్రమంత్రుల ఫ్లెక్సీలను చాటలు, పొరకలతో కొడుతూ పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. పులివెందులలో సమైక్యవాదులు మోకాళ్లపైనడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో 21 మంది సమైక్యవాదులు చేపట్టిన ఆమరణ దీక్ష 5వ రోజుకు చేరింది. అనంతపురం, గుంతకల్లులో సోనియాగాంధీ, దిగ్విజయ్‌సింగ్‌లకు వ్యతిరేకంగా ప్రదర్శన చేశారు. కర్నూలులో ఆర్అండ్బీ ఉద్యోగులు స్థానిక ఎస్ఈ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి గర్జన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో విద్యార్థి గర్జన పేరిట భారీసభ నిర్వహించారు. నెల్లూరులో ఎన్జీఓ భవన్లో ప్రభుత్వ వైద్యులు దీక్షలు నిర్వహించారు. ఉదయగిరిలో జేఏసీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరిలో సోనియా, దిగ్విజయ్‌సింగ్, ఆనం రామనారాయణరెడ్డి దిష్టిబొమ్మలను కోడిగుడ్లతో కొట్టారు. విజయవాడలో విద్యార్థినులు ప్రదర్శన నిర్వహించారు. జగ్గయ్యపేటలో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను మద్దతు తెలిపారు. పామర్రులో విద్యార్థులు మానవహారం, ర్యాలీ చేశారు. గుంటూరులో ఏపీఎన్జీవోలు బైక్ ర్యాలీ నిర్వహించారు. అత్తలూరు, పిడుగురాళ్ళ, దాచేపల్లిలో ముస్లింలు రోడ్డుపై నమాజ్చేసి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ప్రార్ధించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎన్జీఓలు కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. కనిగిరిలో కాపు, బలిజ సామాజికవర్గానికి చెందిన వారు ర్యాలీ నిర్వహించారు. 18 నుంచి వరుస ఆందోళనలు ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ ప్రకటన సాక్షి, విజయవాడ : సమైక్య ఉద్యమాన్ని ఈ నెల 18వ తేదీ నుంచి వరుస ఆందోళనలు చేపట్టి మరింత ఉధృతం చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విద్యా సంస్థల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ప్రకటించింది. శుక్రవారం విజయవాడలో విద్యాసంస్థల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థి నేతలు, సమైక్యాంధ్ర ఉద్యమ నేతలు ఎల్.రత్తయ్య, చిగురుపాటి వరప్రసాద్, ప్రొఫెసర్ శామ్యూల్, ప్రొఫెసర్ నర్సింహారావు, చలసాని శ్రీనివాస్, ఎ.కిశోర్, పున్నం రాజు తదితరులు సమావేశమై జేఏసీ ఏర్పాటుచేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆందోళనల్లో భాగంగా ఒకరోజు రాత్రంతా జనజాగరణ చేపడతామని, మరో రోజు పెట్రోల్ బంకులను మూయించివేస్తామని, ఇంకో రోజు ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించి మౌనప్రదర్శన చేస్తామని చెప్పారు. 22 నుంచి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించివేస్తామన్నారు. అన్ని జేఏసీలను కలుపుకొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తామన్నారు. కాగా, కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్‌శాఖ అధికారులు, ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి సహాయ నిరాకరణ ప్రారంభమైంది. సమైక్యాంధ్ర కోరుతూ గురువారం అర్ధరాత్రి నుంచి విధులు బహిష్కరిస్తూ ఉద్యమ బాట పట్టారు. విజయనగరం ప్రశాంతం నేడు పగటి పూట కర్ఫ్యూ ఎత్తివేత సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఆందోళనలతో అట్టుడికిన విజయనగరంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. శుక్రవారం ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోలేదు. ఉదయం ఏడు నుం చి సాయంత్రం నాలుగు గంటల వరకూ కర్ఫ్యూ సడలించడంతో ప్రజలు పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చి కొనుగోళ్లు చేశారు. వారం రోజుల తరువాత బ్యాంకులు తెరవడంతో కౌంటర్ల వద్ద ఖాతాదారులు బారులు తీరారు. ఆలయాలు సైతం వారం రోజుల తరువాత తెరచుకోవడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్లి పూజలు నిర్వహించారు. కాగా, విధ్వంసానికి సంబంధించి 11 ఆస్తుల ధ్వంసం కేసులు, రెండు లూటీ కేసుల్లో 168 మందిని అరెస్టు చేశామని ఎస్పీ కార్తికేయ తెలిపారు. అలాగే, మరో 47 క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. శనివారం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు కర్ఫ్యూ సడలిస్తున్నట్లు కలెక్టర్ కంతిలాల్ దండే తెలిపారు. -
వెంకయ్య ప్రకటనలో తప్పేముంది?
బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ సమర్థన సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర సమస్యల్ని పరిష్కరించిన తర్వాతే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలన్న పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు చేసిన ప్రకటనకు బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ మద్దతు పలికింది. బీజేపీలాంటి జాతీయ పార్టీకి అన్ని ప్రాంతాలు సమానమేనన్నది వెంకయ్య ప్రకటనతో తేటతెల్లమవుతోందని, దీన్ని ఆక్షేపించాల్సిన పనేమీ లేదని ప్రకటించింది. వెంకయ్య నాయుడు వ్యాఖ్యలకు పెడర్థాలు తీయాల్సిన పనిలేదని తెలంగాణ నేతలకు హితవుపలికింది. 2009 నుంచి ప్రత్యేక తెలంగాణ చుట్టూనే రాష్ట్ర నాయకత్వం పోరాటాలు చేసిందని, రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రుల మనోభావాలు ఎలా ఉంటాయో పసిగట్టడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని అభిప్రాయపడింది. 25 పార్లమెంటు సీట్లున్న ఓ పెద్ద ప్రాంతాన్ని జాతీయ నాయకత్వం విస్మరించలేదని, నరేంద్ర మోడీ ప్రధాని కావాలంటే ఈ ప్రాంత ఓట్లూ, సీట్లూ కూడా ముఖ్యమేనని సున్నితంగా హెచ్చరించింది. ‘‘పార్టీ అంటే తెలంగాణ మాత్రమే కాదు. 2009 ఎన్నికల్లో పార్టీకి తెలంగాణలో వచ్చిన ఓట్లు మూడుశాతం లోపే. సీట్లు గెలవకపోయినా సీమాంధ్రలోనూ 2.3 శాతం ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో వెంకయ్య చేసిన ప్రకటన సబబే’’నని ఉద్యమ కమిటీ నేత ఒకరు తెలిపారు. సీమాంధ్రలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అనేక మంది ఇతర పార్టీల నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని, వారిని ఆకట్టుకోవడానికి కూడా వెంకయ్య నాయుడు చేసిన ప్రకటన ఊతమిస్తుందని తెలిపారు. భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలని, పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన నిర్మించాలని తాము చేస్తున్న డిమాండ్లపై కేంద్రం తక్షణమే స్పందించాలని కోరారు. -
సీమాంధ్ర ఉద్యమాలపై ట్విట్టర్లో నవదీప్ వివాదాస్పద వ్యాఖ్యలు
సీమాంధ్ర ప్రాంతంలో కొనసాగుతున్న బంద్‌పై హీరో నవదీప్ ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. ''నేడే చూడండి!! మీ అభిమాన టీవీ చానళ్లలో!!! ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హైడ్రామా!! ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు, ఇక ముందు కూడా చూడరు!!!!!!!!!!!!!!!" అని ట్వీట్ చేశాడు. Neede chudandi!! Mee abhimana tv channels lo!!! Andhra pradesh political highdrama!! Never before and never again!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! — Navdeep (@pnavdeep26) October 3, 2013 సాధారణంగా రాజకీయ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నా.. సినీ పరిశ్రమకు చెందిన వారు మాత్రం ఇన్నాళ్లూ వివాదాలకు దూరంగా ఉండేవారు. తొలిసారిగా నవదీప్ దాన్ని బ్రేక్ చేసి వివాదాస్పదమైన కామెంట్ పోస్ట్ చేశాడు. Andhra pradesh at the rate of #ad collections and ministers resignations !!! Ohmymy whats happening !! — Navdeep (@pnavdeep26) October 4, 2013 ''ఆంధ్రప్రదేశ్‌లో అన్నీ ప్రకటనల కలెక్షన్లు, మంత్రుల రాజీనామాలే!! ఓరి దేవుడా.. ఏం జరుగుతోంది!! ఈ విషయంలో ఏమీ చేయలేం గానీ సీమాంధ్రలో అసలేం జరుగుతోంది? అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగులంటే.. కేవలం పోలీసులే. వాళ్లు కూడా సహాయ నిరాకరణ ప్రారంభిస్తున్నారు!!" అంటూ కూడా నవదీప్ ట్వీట్ చేశాడు. Cant help but think whats gonna happen in seemandhra if d only working govt representatives - THE POLICE, starts non-cooperation too!! — Navdeep (@pnavdeep26) October 4, 2013 సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది సీనియర్లు, ఎప్పుడూ ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాంగోపాల్ వర్మ కూడా దీని గురించి ఏమీ స్పందించని సమయంలోనూ నవదీప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
దసరా ప్రయాణం కష్టమే..!
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగకు ప్రయాణాలు పెట్టుకున్న వారికి కష్టాలు తప్పేలా లేవు. సీమాంధ్రలో ఉద్యమంతో ఆయా ప్రాంతాలకు బస్సుల రాకపోకలు నిలిచిపోవడం, అదే సమయంలో దేవీ నవరాత్రోత్సవాలు, పాఠశాలలకు దసరా సెలవు లు ప్రారంభం కానుండడంతో హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు వెళ్లాలనుకునేవారికి రైల్వేనే పెద్ద దిక్కు కానుంది. కానీ దసరాకు రైల్వే అధికారులు చేసిన ఏర్పాట్లు ప్రయాణికుల అవసరాలను తీర్చేలా లేవు. 137 ప్రత్యేక రైళ్లతోపాటు, రోజువారీ నడిచే రైళ్లకు 1,088 అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు మంగళవారం ప్రకటించారు. విశాఖ, కాకినాడ, విజయవాడ, మచిలీపట్నం, రేణిగుంట, ముంబై, కోల్‌కతా, నాగర్సోల్, గువాహటి, మంగళూరు, కొల్లాం లాంటి ముఖ్య మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్ఓ సాంబశివరావు పేర్కొన్నారు. ఇవిగాక రద్దీని పర్యవేక్షిస్తూ అవసరమైతే మరిన్ని అదనపు బోగీలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. కానీ దసరా రద్దీని తీర్చడానికి ఇవి ఏ మూలకూ సరిపోయేలా లేవు. హైదరాబాద్ నుంచి దాదాపు 30 లక్షల మందికిపైగా స్వస్థలాలకు వెళ్తారు. సాధారణంగా బస్సులు అందుబాటులో ఉన్నప్పుడే అవి చాలక ప్రజలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. ఈసారి సీమాంధ్రవైపు బస్సుల్లేనందున రైల్వే అధికారులు చేసిన అరకొర ఏర్పాట్లు సరిపోయే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో దసరా ప్రయాణాలకు నగర వాసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. -
తెలంగాణపై ప్రధానితో చర్చిస్తా : సుష్మాస్వరాజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లును త్వరగా పార్లమెంటులో పెట్టేలా తాను వ్యక్తిగతంగా ప్రధానమంత్రి మన్మో„హన్‌సింగ్‌ను కలుస్తానని బీజేపీ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ చెప్పారు. బిల్లు రూపకల్పనకు రెండు నెలల సమయం సరిపోతుందన్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆమె ఆదివారం ఉదయం ఇక్కడ ఓ హోటల్లో పార్టీ పదాధికారులు, జేఏసీ నేతలతో భేటీ అయ్యారు. పార్టీ పరిస్థితి, తెలంగాణ బిల్లు, సీమాంధ్ర ఉద్యమం తదితర అంశాలపై మాట్లాడారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని వచ్చిన తర్వాత తెలంగాణ బిల్లుపై చర్చిస్తానని సుష్మా పార్టీ నేతలకు హామీ ఇచ్చారు. ఈ సమయంలో జేఏసీ నేతల్లో ఒకరు కల్పించుకుని.. ‘తెలంగాణకు బీజేపీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని, మహబూబ్‌నగర్‌లో చేసిన ప్రసంగంతో తమ అనుమానాలూ నివృత్తి అయ్యాయని’ అన్నారు. దీనిపై ఆమె కాస్త ఘాటుగానే స్పందించినట్టు తెలిసింది. ప్రతిపక్ష నాయకురాలి హోదాలో పార్లమెంటరీ విధివిధానాలను స్పీకర్ దృష్టికి తీసుకువచ్చి, సభ్యుల సస్పెన్షన్ సమయంలో వాటిని పాటించాలని మాత్రమే కోరానంటూ, ఆ మాత్రానికే అనుమానాలు రావాలా? అని ప్రశ్నించారు. తెలంగాణపై తమ విధానం స్పష్టంగా ఉందన్నారు. సీమాంధ్ర ఉద్యమకారులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. తెలంగాణపై కాంగ్రెస్ కూడా వెనకడుగు వేయకపోవచ్చని, తన రాజకీయ ప్రయోజనాల కోసమైనా ఇస్తుందనుకుంటున్నట్టు చెప్పారు. వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని పార్టీ నేతలకు సూచించారు. పార్టీ నేతలు జి.కిషన్‌రెడ్డి, యెండల లకీష్మనారాయణ, బండారు దత్తాత్రేయ, నల్లు ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ కె.లకష్మణ్, డాక్టర్ టి.రాజేశ్వరరావు, ఎన్.వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ ప్రకాశ్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, అశోక్‌కుమార్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. దీనికి ముందు టీజేఏసీ నేతలు కోదండరాం, మల్లేపల్లి లక్ష్మయ్య, శ్రీనివాస్‌గౌడ్, ఉద్యోగ సంఘ నాయకులు దేవీప్రసాద్, అద్దంకి దయాకర్, కత్తి వెంకటస్వామి, విఠల్, రాజేందర్‌రెడ్డి తదితరులు సుష్మాస్వరాజ్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఉదయం 9.45 గంటలకు ఆమె శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లారు. -
లక్షల గళాలు ఒక్కటై.. సీమాంధ్ర జిల్లాల్లో ఉద్యమం
సాక్షి నెట్వర్క : రాష్ర్ట విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర జిల్లాల్లో ఉద్యమం జోరుగా సాగుతోంది. అలుపెరగకుండా సాగుతున్న పోరు గురువారం నాటికి 51వ రోజుకు చేరుకుంది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఇచ్చిన పిలుపులో భాగంగా సీమాంధ్ర జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలను సమైక్యవాదులు మూసివేయిం చారు. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. ఆరు నూరైనా సమైక్యాంధ్ర ఒక్కటే మా ఆకాంక్ష అంటూ లక్షలాది గళాలు ఒక్కటై నినదిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో బ్యాంకింగ్ సేవలను స్తంభింపజేయడంతో రూ.100కోట్ల మేర లావాదేవీలు నిలిచిపోయాయి. గణపవరంలో సుమారు 20వేల మంది ‘సమైక్యాంధ్ర వర్థిల్లాలి’ అంటూ పంచ లక్ష గళార్చన చేశారు. చిత్తూరులో జేఏసీ నాయకులు సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. మాజీ ఎమ్మెల్యే ఎం. వెంకటరమణ ఆధ్వర్యంలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయాన్ని మూసివేయించారు. పలమనేరులో లక్షగళ గర్జన విజయవంతమైంది. చంద్రగిరి కోట ఆవరణలో సమైక్యవాదులు గురువారం చేపట్టిన ‘సమైక్య విజయం’ నాటిక అందరినీ ఆకట్టుకుంది. శ్రీకృష్ణదేవరాయలు నడిపిన భువన విజయాన్ని గుర్తుకు తెచ్చేవిధంగా ఈ నాటికను ప్రదర్శించారు. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా గూడూరులో వేలాది మందితో గూడూరు గర్జన నిర్వహించారు. అనంతపురం జిల్లా గుత్తిలో నిర్వహించిన విద్యార్థి గర్జనలో వేలాది మంది విద్యార్థులు పాల్గొని సమైక్య నినాదాలతో హోరెత్తించారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలో రణభేరి, విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 300ఆటోలతో మండల కేంద్రం నుంచి శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం వరకు, అక్కడ నుంచి భోగాపురం మండల కేంద్రం వరకు భారీర్యాలీ నిర్వహించారు. డెంకాడ మండలం అయినాడ జంక్షన్ వద్ద జాతీయ పతాకంతో ప్రదర్శన నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెం నుంచి అంతర్వేది వరకూ 24 కిలోమీటర్లు వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు పాదయాత్ర చేసి లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పలు సంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తీర్మానించారు. ఎన్జీవోలను కించపరుస్తూ మంత్రి కొండ్రు మురళి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విశాఖలో ఏయూ ఉద్యోగులు మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. సింహాచల దేవస్థానం అర్చకులు ప్రధాన రహదారిపై కబడ్డీ ఆడారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించారు. విభజన నిర్ణయాన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన షేక్ అబ్దుల్లా ఖాన్ కుటుంబానికి మంత్రి టీజీ వెంకటేశ్ రూ.2 లక్షలు ఆర్థిక సాయాన్ని అందించారు. సీమాంధ్రలో సమైక్యాంధ్ర ద్రోహి ఎవరనే ప్రశ్నతో పశుసంవర్థక శాఖ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రజాబ్యాలెట్లో 4,941ఓట్లతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రథమస్థానంలో నిలిచారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 21న గుంటూరులో నిమ్మకాయల వ్యాపారాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు. ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద జూనియర్ కళాశాలల అధ్యాపకులు విద్యార్థులను రోడ్డుపై కూర్చొబెట్టి ‘విద్యార్థులకు పాఠాలు- విభజవాదులకు గుణపాఠాలు’ పేరుతో పాఠాలు చెప్పారు. ఇదిలాఉంటే, రాష్ట్ర విభజనతో మానసిక క్షోభకుగురై గురువారం ఇద్దరు గుండె పోటుతో మృతిచెందారు. విజయవాడలో నేడు సేవ్ ఏపీ సభ విజయవాడలో శుక్రవారం సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను నిర్వహిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల జిల్లా జేఏసీ అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ చెప్పారు. ఈ సభలో రాష్ట్రాన్ని ఎందుకు రక్షించాలి, విభజన జరిగితే ఎదురయ్యే సమస్యలు, నష్టాల గురించి వివరించనున్నట్లు తెలిపారు. గడపకు ఒకరు చొప్పున హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. మన గుండెలపై తన్నిన సోనియా : చలసాని సాక్షి, మచిలీపట్నం : ఇటలీ నుంచి వచ్చిన సోనియాను మనం గుండెల్లో పెట్టుకుంటే ఆమె మాత్రం మన గుండెలపై తన్నుతున్నారని ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో గురువారం జరిగిన సమైక్యాంధ్ర సమరభేరీలో ఆయన ప్రసంగించారు. భారతదేశంలో ఉంటూ 14 ఏళ్లపాటు ఇటలీ పౌరసత్వంతోనే కొనసాగిన సోనియాను ఈ దేశ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారన్నారు. ఆమె మాత్రం మన దేశ ఐక్యతను దెబ్బతీసేలా, తెలుగువారి మధ్య చిచ్చుపెట్టేలా రాష్ట్ర విభజనకు సీడబ్ల్యూసీ తీర్మానం చేయించారని విమర్శించారు. -
ఒక్కటే లక్ష్యం.. మార్మోగుతున్న సమైక్యనాదం
జోరువర్షంలోనూ ఆగని జనోద్యమం సాక్షి నెట్వర్క్: రాష్ట్రం ఒక్కటిగా ఉండటం కంటే మరో ప్రత్యామ్నాయమే లేదంటూ సీమాంధ్రలో ఎగసిన జనోద్యమం వరుసగా 48వరోజైన సోమవారం నాడూ ఉద్ధృతంగా సాగింది. కోస్తా రాయలసీమల్లోని పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురిసినా జనం లెక్కచేయక రోడ్లపైకి వచ్చి సమైక్యనినాదాలు హోరెత్తించారు. రాష్ట్రం ముక్కలైతే తాగునీటికి తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందని విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం శొంఠ్యాంలో వందలాదిమంది మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. వర్శిటీ అధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో ఏయూ మెయిన్ గేట్ నుంచి సిరిపురం వరకు వందలాదిమంది జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. ‘క్రీడా గర్జన’ పేరిట తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జాతీయ రహదారిని దిగ్బంధించి ఆటలు ఆడారు. తాళ్లరేవులో పురోహితుడు ఏలూరు వెంకట కామేశ్వరరావు పంట కాలువలో శవాసనం వేసి 10 గంటల పాటు నీటిపై తేలియాడి సుమారు 10కిలోమీటర్లు తిరుగుతూ నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో గంగపుత్రుల ఆధ్వర్యంలో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలో విజ్జేశ్వరం నుండి శెట్టిపేట వరకు 25 బోట్లతో సోమవారం ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బెండిగేటులో తప్పెటగుళ్ల ప్రదర్శనతో నిరసన చేపట్టారు. విజయవాడలో ఈ నెల 20న నిర్వహించ తలపెట్టిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం కావాలని మహిళా ఉద్యోగులు దుర్గగుడిలో అమ్మవారికి మెట్ల పూజలు చేశారు. వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో 56మంది ఉద్యోగులు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వారికి గుంటూరులో రక్తాన్ని అందజేశారు. ఒంగోలులో ఆర్యవైశ్యులు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటూ యజ్ఞం నిర్వహించారు. ఈ దీక్షలకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ నేతృత్వంలో జలదీక్ష చేపట్టారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు రోడ్లపైనే విద్యాబోధన చేసి నిరసన వ్యక్తం చేశారు. ైవెృఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో టింబర్ డిపోల వర్తకులు భారీ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో టీటీడీ కల్యాణకట్టకు చెందిన నాయీబ్రాహ్మణులు మేళతాళాలతో ర్యాలీ నిర్వహించారు. చంద్రగిరిలో సమైక్యవాదులు తమిళనాడుకు చెందిన టాక్సీలు, కార్లు, ఇతర వాహనాలను ఆపి‘కేంద్రమంత్రి చిదంబరం ప్రకటనతో ఆంధ్ర రాష్ట్రం అతలాకుతలమైందని, మీరైనా ఆయనకు బుద్ధి చెప్పాలని’ అభ్యర్థించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దంటూ కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని 19 గ్రామ పంచాయతీలు తీర్మానం చేసిన ప్రతులను రాష్ట్రపతి, ప్రధానికి పంపారు. విభజిస్తే బూట్‌పాలిష్ చేసుకోవాల్సిందే : భూమన రాష్ట్ర విభజన జరిగితే విద్యావంతులు బూట్ పాలిష్ చేసుకుని బతకాల్సిందేనని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన సోమవారం తిరుపతిలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద వర్షంలో తడుస్తూ బూట్ పాలిష్ చేశారు. ఈ సందర్భంగా భూమన విలేకరులతో మాట్లాడుతూ విద్యావంతులకు ఉద్యోగాలు లేకపోతే బూట్ పాలిష్ లాంటి కార్యక్రమాలు చేసుకుని జీవనం సాగించాల్సిందేనన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం ప్యాకేజీ మాట్లాడుకోవడానికేనని ఆరోపించారు. తర్వాత తెలంగాణ లో పర్యటించడానికి బాబు సన్నాహాలు చేసుకుంటున్నారని భూమన తెలిపారు. గుండెపోటుతో జేఏసీ కో-కన్వీనర్ మృతి గుంతకల్లు (అనంతపురం), న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న గుంతకల్లు ప్రభుత్వాస్పత్రి వైద్యుడు, జేఏసీ కో కన్వీనర్ డాక్టర్ సుమంత్‌కుమార్ (59) సోమవారం ఉదయం టీవీలో ఉద్యమ వార్తలు చూస్తూ గుండెపోటుతో మృతి చెందారు. ఇతని స్వస్థలం రాజమండ్రి కాగా, ఉద్యోగ రీత్యా ఇక్కడి ప్రభుత్వాస్పత్రిలో ఈఎన్టీ స్పెషలిస్టుగా పనిచేస్తూ గత ఏడాది రిటైరయ్యారు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి.. గుంతకల్లు జేఏసీ కో కన్వీనర్‌గా పోరాటం చేశారు. హోరెత్తిన సమైక్య ‘గర్జన రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెనపై రైతుల మహార్యాలీ సాక్షి, నెట్వర్క్ : రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ సోమవారం సీమాంధ్రలోని పలుచోట్ల ‘గర్జన’లు హోరెత్తాయి. రాజమండ్రి-కొవ్వూరు రోడ్ కమ్ రైల్వే వంతెనపై వ్యవసాయశాఖాధికారుల జేఏసీ ఆధ్వర్యంలో ‘రైతు గర్జన’ చేపట్టారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పదివేలమందికి పైగా రైతులు ట్రాక్టర్లతో వంతెనపై మహా ర్యాలీ నిర్వహించారు. రాష్ర్ట విభజన జరిగితే నదులన్నీ ఎండిపోయి సీమాంధ్ర ప్రాంతమంతా ఎడారిని తలపిస్తుందని అధికారులు లెక్కలతో సహా వివరించారు. అమలాపురంలో వేలాది మంది విద్యార్థులు ‘విద్యార్థిగర్జన’ చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో సమైక్యాంధ్ర ఉద్యమ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్ష గళ గర్జన విజయవంతమైంది. గర్జన సందర్భంగా ఎంపీ కనుమూరి బాపిరాజును హిజ్రాగా చిత్రీకరించిన ఫ్లెక్సీని ఏర్పాటు చేయటం వివాదాస్పదమైంది. విశాఖ జిల్లా నర్సీపట్నంలో సమైక్య గర్జన ఆకట్టుకుంది. విజయనగరంలో జరిగిన ధూం..ధాం కార్యక్రమంలో కళాకారులు హోరెత్తించారు. కృష్ణాజిల్లా గుడివాడలో మునిసిపల్ జేఏసీ ఆధ్వర్యంలో సింహగర్జన చేపట్టారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలో బ్రహ్మగర్జన పేరుతో పెద్ద ఎత్తున సభ, ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్టూరులో జాతీయ రహదారిపై రైతుగర్జన, మార్కాపురంలో చేపట్టిన ‘విద్యార్థి గర్జన’, చిత్తూరు జిల్లా నగరిలో మహిళా గర్జన నిర్వహించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో లక్ష జన సమైక్య రణభేరి, మంగళగిరిలో సమైక్య మహిళా శంఖారావం కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. ఆగని ప్రజాగ్రహం .. కడపలో మంత్రులకు, ఎంపీల ఇళ్లకు ‘హెచ్చరిక’ పోస్టర్లు సాక్షి నెట్వర్క్ : కాంగ్రెస్, టీడీపీ నేతలపై జనాగ్రహం కొనసాగుతోంది. సోమవారం విజయనగరంలో టీడీపీ ఎమ్మెల్యేలలితకుమారిని అడ్డుకున్నారు. విజయనగరం నుంచి రామభద్రాపురం వెళ్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామిని గజపతినగరంలో జేఏసీ సభ్యులు అడ్డుకున్నారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన దీక్షా శిబిరం వద్దకు వస్తున్న టి.సుబ్బరామిరెడ్డిని అక్కడే ఉన్న ఉపాధ్యాయులు అడ్డుకుని గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్ జిల్లా కడపలో మంత్రులు, ఎంపీల ఇళ్లకు ‘హెచ్చరిక’ పోస్టర్లను అంటించారు. ఈ నెల 18వ తేదీలోపు మంత్రులతో పాటు ఎంపీ సాయిప్రతాప్ రాజీనామాలు ఆమోదింపచేసుకుని సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని, లేనిపక్షంలో వారి ఇళ్ల వద్దే దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో జేసీ దివాకరరెడ్డి బస్సులను అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎమ్మెల్యే కొర్ల భారతి ఇంటిని జేఏసీ నేతలు ముట్టడించారు. కాశీబుగ్గలో టీడీపీ నేతలు బండారు సత్యనారాయణమూర్తి, శివాజీలను అడ్డుకోగా, కర్నూలులో న్యాయవాదులు మంత్రి టీజీ వెంకటేష్‌కు చెందిన మౌర్య ఇన్ హోటల్‌ను ముట్టడించారు. -
ఏయూలో దూరవిద్యా పరీక్షలు వాయిదా
ఈ నెల19 నుంచి ఆంధ్ర యూనివర్శిటీ పరిధిలో జరగవలసిన దూర విద్యా పరీక్షలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఆ యూనివర్శిటీ దూర విద్యా శాఖ సంచాలకులు నరసింహరావు గురువారం విశాఖపట్నంలో వెల్లడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ప్రాంతంలో సమ్మె ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఆ పరీక్షల నిర్వహణ తేదిని త్వరలో వెల్లడిస్తామని నరసింహరావు తెలిపారు. అలాగే హైదరాబాద్‌లోని శ్రీ పొట్టి శ్రీరాముల తెలుగు యూనివర్శిటీ పరిధిలో జరగాల్సిన దూర విద్యా పరీక్షలను కూడా వాయిదా వేశారు. ఆ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది తర్వాత వెల్లడిస్తామని ఆ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఆశీర్వాదం గురువారం ఓ ప్రకటనలో చెప్పారు. -
'చిత్తూరు జిల్లాలో సమైక్యా ఉద్యమం ఉధృతం చేస్తాం'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు తిరుపతి ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తున్నట్లు చెప్పారు. అలాగే 14 నుంచి 48 గంటలపాటు తిరుపతి, తిరుమల ఇరు ప్రాంతాల్లో సంపూర్ణ బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే16వ తేదీన జిల్లాలోని ఉపాధ్యాయులతో ఉపాధ్యాయుల గర్జన, 17న మున్సిపల్ ఉద్యోగులతో మహా గర్జనను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వీటితోపాటు18 నుంచి ఆమరణ దీక్షలు చేపట్టనున్నట్లు రాంచంద్రారెడ్డి వివరించారు. -
ఈ నెలలోనే తెలంగాణ బిల్లు పెట్టాలి: జి.కిషన్‌రెడ్డి
సాక్షి, వరంగల్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసైనా ఈ నెలలోనే తెలంగాణ బిల్లు సభలో ప్రవేశ పెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా హన్మకొండలో శుక్రవారం ‘తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన మ హాదీక్ష’ జరిగింది. కిషన్‌రెడ్డితో పాటు ఆ పార్టీ జాతీయ నాయకుడు బండారు దత్తాత్రేయ, పార్టీ శాసన సభాపక్ష నేత యెండల లక్ష్మినారాయణ, సీనియర్ నాయకులు బద్దం బాల్‌రెడ్డి, ప్రభాకర్‌తో సహా 1,100 మంది ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ సీడబ్ల్యుసీలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తరువాత పది రోజుల్లో రాష్ట్రపతికి,వ ర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెడతామని చెప్పి, ఇప్పటివరకు పెట్టలేదని విమర్శించారు. హైదరాబాద్‌లో ఐటీని, హైటెక్ సిటీని తాను అభివృద్ధి చేశానని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడంలో అర్థం లేదన్నారు. సీమాంధ్ర ఉద్యమానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అంతా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిదేనని ఆరోపించారు. పుండు మీద కారం చల్లినట్లుగా ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో సమైక్య సభ పెట్టించారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ మినహా బంద్‌కు మద్దతు హైదరాబాద్ మినహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బంద్‌కు బీజేపీ మద్దతు ఇస్తుందని కిషన్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం రాత్రి హన్మకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఏపీఎన్జీవోల సభ సందర్భంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో గొడవలు సృష్టించనున్నారని తమకు సమాచారం ఉందన్నారు. హైదరాబాద్‌లో ప్రశాంతత ఉండటం కోసమే అక్కడ బంద్‌లో బీజేపీ పాల్గొనడం లేదని చెప్పారు. ఏపీఎన్జీవోల సభను వ్యతిరేకిస్తున్నా: నాగం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఎపీఎన్జీవోల సభను బీజేపీ వ్యతిరేకించకున్నా వ్యక్తిగతంగా తాను వ్యతిరేకిస్తున్నానని ఆ పార్టీ నేత నాగం జనార్దన్‌రెడ్డి చెప్పారు. -
విభజనకు నిరసనగా అర్ధనగ్నంగా ర్యాలీ
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఒక్కసారిగా భగ్గుమంది. సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేపట్టిన సీమాంధ్ర ఉద్యమం తారస్థాయికి చేరుతోంది. సీమాంధ్ర జిల్లాలో అడుగడుగునా నిరనసలు, ధర్నాలు, ర్యాలీలతో అట్టడుకిపోతోంది. కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించింది. రాష్ర్టం సమైక్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో తాము ఉద్యమంలో పాల్గొంటున్నామని సీమాంధ్ర ప్రజలు వాపోతున్నారు. రాష్ర్టం ముక్కలతై తాము తీవ్రంగా నష్టపోతామని వారు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుసుకోవాలంటూ సీమాంధ్ర ప్రజలు మక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు. లేనిపక్షంలో తమ ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుందని, ఇరుప్రాంతాలకు సమన్యాయం జరిగేలా తక్షణమే చర్చలు జరిపి సానుకూల నిర్ణయాన్ని ప్రకటించాల్సిందిగా సమైక్యవాదులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా విజయనగరం కోట జంక్ష-న్లో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. విభజనకు నిరసనగా ఆకులు కట్టుకుని అర్ధనగ్నంగా ర్యాలీ నిర్వహించారు. కోట జంక్షన్ నుంచి ర్యాలీ నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగులు.. వీధిపొడువునా భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. మరోవైపు న్యాయవాదులు జేఎసి సమైక్యాంధ్రాకు మద్దుతుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కోటజంక్షన్లో కొనసాగుతూనే ఉన్నాయి. -
విభజనకు వ్యతిరేకంగా సిక్కోలు నిరసనలు
శ్రీకాకుళం: రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్ర ఉద్యమం రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు, ర్యాలీలతో ముందుకు సాగుతోంది. గత నెల 30న కేంద్రం ప్రభుత్వం విభజనపై తమ నిర్ణయాన్ని ప్రకటించిన నాటి నుంచి సీమాంధ్రలో ఉద్యమ వాతావరణం నెలకొంది. సీమాంధ్ర జిల్లాలో విభజనకు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా రణస్థల మండల కేంద్రంలో వికలాంగులు మానవహారం పాటించారు. ఈ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులతోపాటు మహిళలు కూడా పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జి సిగడామ్ మండలం పాలఖండీయ వద్ద ఉపాధ్యాయులు, విద్యార్థులు వంటావార్పు కార్యక్రమాలు చేపట్టారు. -
ఒకే జాతి.. ఒక్కటే రాష్ట్రం
ఒకే జాతి.. ఒక్కటే రాష్ట్రం అనే నినాదంతో వెల్లువెత్తిన సమైక్యాంధ్ర పరిరక్షణ పోరాటం ఇసుమంతైనా సడలకుండా జోరుగా సాగుతోంది. 24రోజుల కిందట సీమాంధ్రలో ఎగసిన సమైక్యఉద్యమం రోజురోజుకూ బలపడుతూ తీవ్రతరమవుతోంది. సకలజనుల సమ్మెతో జీవనం స్తంభిస్తున్నా ప్రజలు ఏమాత్రం లెక్కచేయక సమైక్యమే లక్ష్యంగా ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. రాజకీయపార్టీలు, కులాలు, వర్గాలకతీతంగా జనం స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి వినూత్నరీతిల్లో సమైక్యభావనను ప్రకటిస్తున్నారు. - సాక్షి నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్‌ను యథాతథంగా ఉండాలనే డిమాండ్‌తో రోజూ మాదిరిగానే శుక్రవారం కూడా కోస్తా, రాయలసీమ జిల్లాలు ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసన ప్రదర్శనలతో దద్దరిల్లాయి. సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించటానికి ఈ నెల 27న సీమాంధ్రలోని 13 జిల్లాల విద్యార్థి జేఏసీ నేతలు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోసమావే శం కానున్నారు. తాడేపల్లిగూడెంలో 72 గంటల బంద్‌లో భాగంగా రెండో రోజు శుక్రవారం బంద్ సంపూర్ణంగా సాగింది. విద్యుత్ ఉద్యోగులు బైక్ ర్యాలీ చేసి ఆశ్రం ఆస్పత్రి సమీపంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. టీడీపీ నేత, మాజీ మంత్రి మాగంటి బాబు భీమవరంలో వైఎస్సార్ సీపీ దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో జరిగిన రాజీవ్ విద్యామిషన్ వీడియో కాన్ఫరెన్స్‌ను జేఏసీ నేతలు అడ్డుకున్నారు. కలిగిరిలో జరుగుతున్న రిలే దీక్షలలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. రోడ్లు ఊడ్చిన న్యాయవాదులు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రాష్ట్ర విభజనను నిరసిస్తూ న్యాయవాదులు పుష్కరాల రేవు వద్ద రోడ్లు ఊడ్చారు. కాకినాడలో న్యాయశాఖ ఉద్యోగులు కోర్టు వద్ద వినూత్నంగా గంజి వార్పు కార్యక్రమం చేపట్టి గంజి తాగారు. రాష్ట్ర విభజన చేపడితే తమకు గంజే గతి అంటూ నిరసన తెలిపారు. జిల్లావ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ మండల గోదాముల్లో పనిచేసే హమాలీలు శుక్రవారం నుంచి ఈ నెల 26 వరకూ విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. యూటీఎఫ్ సమైక్యాంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదంటూ ఏలేశ్వరంలో 16మంది ఉపాధ్యాయులు ఆ సంఘానికి రాజీనామా చేశారు. ఐదు కిలోమీటర్ల పొడవున వాహనాల ర్యాలీ కోనసీమ ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్ల జేఏసీ అమలాపురంలో ఆటోలు, మినీ వ్యాన్లు, లారీలు, ట్యాక్సీలు, ఆర్టీసీ అద్దెబస్సులు, ఇతర వాహనాలతో భారీ ర్యాలీ చేపట్టింది. సుమారు ఐదు కిలోమీటర్ల పొడవున వాహనాలు సాగాయి. పిఠాపురంలో జేఏసీ ఆధ్వర్యంలో రహదారులు దిగ్బంధం చేసి బంద్ పాటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ వరుపుల సుబ్బారావు ఏలేశ్వరం బాలాజీ సెంటర్లో అర్ధనగ్నంగా నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. రాజానగరంలో సమైక్యవాదులు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను ఉద్యమంవైపు నడిపిస్తున్న అధికారులు వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో అధికారులు స్వయంగా రంగంలోకి దిగి గ్రామాల్లో పర్యటిస్తూ సమైక్య ఉద్యమంలో పాల్గొనేలా ప్రజలను చైతన్య పరుస్తున్నారు. శుక్రవారం సాయంత్రం జమ్మలమడుగు మండల పరిధిలోని మోరగుడి, ఎస్.ఉప్పలపాడు గ్రామాల్లో తహశీల్దార్ శివరామయ్య, ఎంపీడీఓ మల్లయ్య, ఎంఈఓ గంగిరెడ్డి, వ్యవసాయాశాఖాధికారి రాంమోహన్‌రెడ్డి పర్యటించి రాష్ట్ర విభజన వల్ల జరిగే పరిణామాలు, నష్టాల గురించి ప్రజలకు వివరించారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఇటువంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. నల్లదుస్తులతో వైద్యుల నిరసన విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రి వైద్యులు నల్ల దుస్తులు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. ఎన్జీఓ జేఏసీ ఆధ్వర్యంలో కోట జంక్షన్ వద్ద 10 వేల మంది ఉద్యోగులు,విద్యార్థులు సమైక్య నినాదాలతో హోరెత్తించారు. గెజిటెడ్ ఉద్యోగులు కలెక్టరేట్ జంక్షన్లో ఒంటికాలిపై నిలుచొని నిరసన తెలిపారు. ముస్లింల శాంతి యాత్ర కర్నూలు నగరంలో ముస్లిం ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో శాంతి యాత్ర చేపట్టారు. నగరంలోని వివిధ కాలనీల నుంచి భారీగా తరలివచ్చిన ముస్లిం యువకులు.. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ అసెంబ్లీ ఆహూతులను ఆకట్టుకుంది. ఉద్యోగానికి రాజీనామా చేసిన వాణిజ్యపన్నుల శాఖ డీసీ వాణిజ్యపన్నుల శాఖ డీసీ వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.లింగారెడ్డి ఉద్యోగానికి రాజీనామా చేసి సమైక్యాందోళనలో పాల్గొన్నారు. నందికొట్కూరు నియోజకవర్గం అల్లూరు గ్రామానికి చెందిన లింగారెడ్డి.. హైదరాబాద్‌లోని వాణిజ్య పన్నుల శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. మరో మూడేళ్ల పాటు సర్వీసు ఉన్నప్పటికీ రాష్ట్ర విభజన నిర్ణయంతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో విద్యుత్ ఉద్యోగులు రోడ్డుకు అడ్డంగా పడుకొని వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వేలాదిమంది విద్యార్ధులు బెజవాడ బెంజిసర్కిల్ వద్ద మానవహారం చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. పర్యాటక హోటళ్లు మూత విశాఖ జిల్లా అరకులో గిరిజన మ్యూజియం, గిరిజన గార్డెన్ మూసివేశారు. ఎక్కడికక్కడ పర్యాటక హోటళ్లు మూతపడ్డాయి. దీంతో అరకులో పర్యాటకం పూర్తిగా పడకేసింది. పాడేరు పట్టణంలో ఎన్జీవోలు బిక్షాటన చేశారు. విశాఖలో ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడును కేజీహెచ్‌కు తరలించారు. చిత్తూరు ఎమ్మెల్యే సీకేబాబు మహాపాదయాత్ర శుక్రవారం తిరుపతికి చేరుకుంది. ఏడుగంటలపాటు హైవేపై వాహనాల అడ్డగింత చంద్రగిరిలో 36 గంటలపాటు బంద్ కొనసాగింది. జాతీయ రహదారిలో 7 గంటలపాటు రాకపోకలను అడ్డుకున్నారు. అనంతపురంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థులకు రోడ్లపైనే చదువులు చెప్పి..నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆర్టీసీ కార్మికులు బైక్‌ర్యాలీ చేయగా, వినుకొండలో ఏపీఎన్జీవోస్ సమైక్య జేఏసీ కాగడాల ప్రదర్శన నిర్వహించింది. తెనాలిలో మున్సిపల్ కమిషనర్ల సమావేశం జరగ్గా.. తాము కూడా ఉద్యోగుల సమ్మెకు సంఘీభావంగా విధులు బహిష్కరించాలని తీర్మానించారు. ప్రకాశం జిల్లా ఒంగోలుకలెక్టరేట్ వద్ద అన్ని ప్రభుత్వవిభాగాల ఉద్యోగులు ధర్నా చేపట్టారు. విభజన కలతతో మరో 9మంది మృత్యువాత తూ.గో.జిల్లాలో ఉరేసుకుని యువకుడి బలవన్మరణం సాక్షి నెట్వర్క్: రాష్ర్టం ముక్కలవుతుందనే భయంతో ప్రాణాలొదిలేస్తున్న వారి సంఖ్య ఇంకా తగ్గడం లేదు. శుక్రవారం ఒక్కరోజే సీమాంధ్ర జిల్లాల్లో గుండెపోటుతో ఎనిమిదిమంది మృత్యువాతపడగా, తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామానికి చెందిన లంకే సత్తిబాబు (27) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషిస్తున్న సత్తిబాబుకు తల్లిదండ్రులు, భార్య, ఏడాదిన్నర పాప ఉన్నారు. భార్య ప్రస్తుతం గర్భిణిగా ఉంది. రాష్ట్ర విభజనను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటానంటూ చెప్పిన సత్తిబాబు చివరికి అన్నంత పనీ చేశాడని స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా అమడగూరులో గుండం హరి(37), కనగానపల్లె మండలం పర్వతదేవరపల్లెకు చెందిన నారాయణప్ప (50) రాష్ట్ర విభజనను తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందారు. సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్న ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఉద్యోగి డీవీ ఇంద్రశేఖర్ (54) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. నరసాపురం మండలం ఎల్బీ చర్ల గ్రామానికి చెందిన అడ్డాల రామలక్ష్మి (51) విభజన వార్తలు చూస్తూ గుండె ఆగి మరణించింది. ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన కల్లూరి శ్రీనివాసరావు (33) రాష్ట్రం విడిపోతే పిల్లల భవిష్యత్ దెబ్బతింటుందన్న బెంగతో గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలం కొండప్పగారిపల్లెకు చెందిన సమైక్యవాది లేబాకు వెంకటేశు(35) శుక్రవారం టీవీ చూస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. వెంకటేశు మృతితో శనివారం జరగాల్సిన అతని చెల్లెలు దామోదరమ్మ వివాహం ఆగిపోయింది. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం వనదుర్గాపురం గ్రామానికి చెందిన రమణ య్య(33) శుక్రవారం ఇంట్లో టీవీలో సమైక్యఉద్యమం.. విభజన నేపథ్యం వార్తలు ఉద్వేగానికి లోనై అక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఆత్మకూరు డిపో గ్యారేజ్ ఇన్చార్జ్ వెంకటేశ్వర్లు(54) శుక్రవారం రాత్రి కర్నూలు జిల్లా ఆదోనిలో గుండె పోటుతో మృతి చెందారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో తీవ్ర వేదనకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ నేతలపై జనాగ్రహం సాక్షి నెట్వర్క్: వేర్పాటు ప్రకటన వచ్చిన దరిమిలా కాంగ్రెస్, టీడీపీ నేతలపై వ్యక్తమవుతున్న జనాగ్రహం ఇప్పట్లో చల్లారేలా లేదు. శుక్రవారం సీమాంధ్రలోని పలు జిల్లాల్లో కాంగ్రెస్, టీడీపీ నేతలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావును అడ్డుకుని ఇంకా రాజీనామా చేయనందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో సోనియా, దిగ్విజయ్, కేసీఆర్, బొత్స, కిల్లికృపారాణి, పళ్లంరాజు, రాహుల్, చిరంజీవి మాస్కులు ధరించిన వారిని కర్రలతో కొడుతూ, కాళ్లతో తంతూ సమైక్యవాదులు నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో న్యాయవాదులు సోనియా చిత్రపటాన్ని కొరడాతో కొట్టి నిరసన తెలిపారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ దిష్టి బొమ్మకు శవ యాత్ర నిర్వహించి దహనం చేశారు. శ్రీకాకుళం రిమ్స్ వైద్యాధికారులు, ఉద్యోగులు పట్టణంలోని డేఅండ్‌నైట్ కూడలి వద్ద సోనియా, కేసీఆర్ వేషధారణలతో ఉన్న వ్యక్తులను స్ట్రెచర్‌పై తీసుకొచ్చి మెదడు, మోకాలు శస్త్ర చికిత్సలు చేస్తున్నట్టు ప్రదర్శన నిర్వహించారు. ఆంటోనీ కమిటీ అనుకూలంగా లేకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కావూరి శుక్రవారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి వచ్చిన కేంద్రమంత్రి కావూరి సాంబశివరావును సమైక్యవాదులు అడ్డుకుని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు కావూరి స్పందిస్తూ తాను ఎప్పుడూ సమైక్యవాదినేనని, ఆంటోని కమిటీ సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం వెలువరించకుంటే వెంటనే రాజీనామా చేస్తానని చెప్పడంతో నిరసనకారులు శాంతించారు. తొలుత ఆయన తిరుమలలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్జీవోల సమ్మెను తాను సమర్థిస్తున్నానన్నారు. విభజన దుష్పరిణామాలను వివరించడంవల్ల కేంద్రం పునరాలోచనలో పడిందన్నారు. ఉద్యమకారులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అనుచరుల దాడి సమైక్యాంధ్ర ఉద్యమకారులపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు అనుచరులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరులో ధర్నా చేపట్టిన ఉపాధ్యాయులకు సంఘీభావం పలికేందుకు ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు రాగా, రాజీనామా చేసిన తర్వాతే ఉద్యమంలో పాల్గొనాలని ఆయనకు సమైక్యవాదులు సూచించారు. దీంతో రెచ్చిపోయిన బత్యాల అనుచరులు శ్రీనివాసరాజు అనే సమైక్యవాదిపై పిడిగుద్దులతో చితకబాదారు. ఇదంతా చూస్తున్నా ఎమ్మెల్సీ వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. కాగా, ఈ దాడిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి నుంచి వెళ్లే ప్రైవేటు బస్సులు బంద్ సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతి నుంచి వివిధ పట్టణాలకు వెళ్లే ప్రైవేటు బస్సులనూ శనివారం నుంచి రద్దు చేసినట్లు శ్రీవెంకటేశ్వర ట్రావెల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బీ.మునిరాజా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం సమైక్యాంధ్ర ఉద్యమ జేఏసీ నేతలు శ్రీకాంత్‌రెడ్డి, అవుల ప్రభాకర్, చల్లా చంద్రయ్య ట్రావెల్స్ అసోసియేషన్ నాయకులతో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి నుంచి బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై వెళ్లే ప్రైవేటు బస్సుల టికెట్లు రిజర్వేషన్ చేయకుండా నిలుపుదల చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా ముందస్తుగా ఆయా నగరాలకు టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకుని ఉంటే వెంటనే రద్దు చేసుకోవాలని కోరారు. -
ఉద్యమం పేరుతో ‘ప్రైవేట్’ దోపిడీపై ఆందోళన
సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ఆర్టీసీ బస్సులు నడవకుండా ఉంటే ప్రజల నుంచి అధిక మొత్తం రాబట్టి దోపిడీ చేయడం సరికాదంటూ జేఏసీ నాయకులు కొవ్వూరు బాలచంద్రారెడ్డి, ఆర్టీసీ యూనియన్ నాయకులు శనివారం ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులపై ధ్వజమెత్తారు. రాత్రి వేళ బస్సులు తిప్పవద్దని, సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరేందుకు శనివారం జేఏసీ నాయకులు ప్రొద్దుటూరులోని బీబీవీఆర్ ట్రావెల్స్ కార్యాలయానికి వెళ్లారు. బస్సుల తిప్పి తీరుతామంటూ యాజమాన్యం జేఏసీ నాయకులతో వాగ్వాదానికి దిగింది. దీంతో కొంత సేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ట్రావెల్స్ నిర్వాహకుల వ్యవహార శైలికి నిరసనగా జేఏసీ ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించారు. ప్రైవేటు ట్రావెల్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ బస్సులు తిరగకుండా ఉద్యమానికి అండగా నిలిస్తే ప్రైవేటు బస్సుల యాజమాన్యం వారు హైదరాబాద్‌కు వెళ్లే ఒక్కో టికెట్‌కు రూ.1500 రాబట్టి దోపిడీ చేస్తున్నారంటూ మండిపడ్డారు. దీన్ని అరికట్టకపోతే బస్సులకు జరిగే నష్టానికి తమది బాధ్యత కాదని తేల్చి చెప్పారు. బస్సులు తిరిగితే కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న సీఐ బాలిరెడ్డి, ఎస్ఐ ఇబ్రహీం ఆ ప్రాంతానికి చేరుకుని జేఏసీ నాయకులతో మాట్లాడారు. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం వ్యవహరించిన తీరుపై సీఐ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ట్రావెల్స్ భవనంలోకి సమైక్యవాదులు ఎక్కువ మంది చేరుకోవడంతో తొపులాటలో గదిలో ఉన్న ఒక అద్దం పగిలిపోయింది. ఓ వ్యక్తి జేఏసీ ఉద్యమానికి ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం లక్ష రూపాయలు ఇచ్చిందని మాట్లాడటంతో జేఏసీ కన్వీనర్ మాదాసు మురళీ చేరుకున్నారు. ఎవరికి ఇచ్చారని నిలదీయడంతో ఉద్యమంలో వంటావార్పు సమయంలో డబ్బు ఖర్చయిందని ట్రావెల్స్ యాజమాన్యం మాట మార్చింది. సీఐ బాలిరెడ్డి బీబీవీఆర్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసి జేఏసీ ఆర్టీసీ నాయకులను అక్కడి నుంచి పంపించారు. జేఏసీ నాయకులు కొవ్వూరు బాలచంద్రారెడ్డి, మాదాసు మురళీ, ఆర్టీసీ యూనియన్ నాయకులు ఎన్నార్ శేఖర్, టీవీఆర్ రెడ్డి, మాచయ్య, కార్మికులు కాళేశ్వరి, బీసీవీఆర్, ఇందు ట్రావెల్స్ కార్యాలయాల వద్దకు వెళ్లి సమైక్యాంద్రకు సహకరించి బస్సులు తిప్పకుండా ఉండాలని కోరారు. -
జోరు వర్షంలోనూ ఉద్ధృతంగా సమైక్య ఉద్యమం
వేర్పాటు వద్దంటూ నడిరోడ్డుపై శ్రావణ వరలక్ష్మీ పూజలు రాష్ర్టం సమైక్యంగానే ఉండాలని కోరుతూ పవిత్ర శ్రావణ శుక్రవారం రోజు సీమాంధ్రలోని జిల్లాల్లో మహిళలు నడిరోడ్డుపై వరలక్ష్మీ వ్రతాలు చేపట్టారు. సామూహిక పూజలు నిర్వహించారు. అధికార కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ‘వేర్పాటు’ ప్రకటన వచ్చిన దరిమిలా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎగసిన సమైక్యాంధ్ర ఉద్యమం వరుసగా పదిహేడో రోజు శుక్రవారం కూడా ఉద్ధృతంగా సాగింది. పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నా సమైక్యవాదులు లెక్కచేయక పోరాటాన్ని సాగించారు. - సాక్షి నెట్వర్క్ సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉప్పెనలా సాగుతోంది. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలతో హోరెత్తిస్తున్న సమైక్యవాదుల నిరసనలకు తోడు ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె, సకజల జన అందోళనలు మిన్నంటడంతో 13జిల్లాల్లో జనజీవనం స్తంభిస్తోంది. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయూలు మూతకొనసాగుతోంది. ఆర్టీసీ సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులపై జనాగ్రహం కొనసాగుతోంది. సోనియాగాంధీ, పీసీసీ చీఫ్ బొత్స, చిరంజీవిల దిష్టిబొమ్మల దహనాలు, శవయాత్రలు జరుగుతూనే ఉన్నాయి. విభజన విషయంలో యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ మనసు మారాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో సమైక్య వాదులు వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం తాలూకాఫీస్ సెంటర్లో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు, పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో మహిళలు రోడ్డుపై శ్రావణ లక్ష్మీ పూజలు చేపట్టారు. నెల్లూరులో ట్రాన్స్‌కో ఆఫీసు ఎదుట మహిళా ఉద్యోగులు వరలక్ష్మీ వ్రతం నిర్వహించి సమైక్యాంధ్ర స్లిప్‌లు పెట్టి తాంబూలాలు పంచారు. అనంతపురంలో ఉపాధ్యాయ జాక్టో చేపట్టిన దీక్షా శిబిరంలోనే మహిళా ఉపాధ్యాయులు మహాలక్ష్మి వ్రతాన్ని పాటించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో, వైఎస్సార్ జిల్లా కడపలోనూ, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం పూజారుల ఆధ్వర్యంలోనూ సమైక్యలక్ష్మి పేరిట శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే అర్ధశిరోముండనం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావు అర్ధశిరోముండనం చేరుుంచుకుని కాంగ్రెస్ వేర్పాటు వాదంపై నిరసన తెలిపారు. కొవ్వూరులోని ఉభయగోదావరి జిల్లాల నడుమ గల రోడ్ కం రైల్ వంతెనపై జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, వివిధ వర్గాల ప్రజలు వేలాదిగా తరలివచ్చి 3 గంటలపాటు మహాధర్నా చేశారు. విభజిస్తే వరికి ఉరే తణుకులో వ్యవసాయ శాఖ ఉద్యోగులు, ఎరువులు, పురుగు మందుల డీలర్లు ఎండిన వరి దుబ్బలను చేతపట్టుకుని రాష్ట్రాన్ని విభజిస్తే ‘వరి పంటకు ఉరి’ పడుతుందంటూ వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. ఈనెల 22న భీమవరంలో 50వేల మంది రైతులతో మహాసభ నిర్వమించనున్నట్లు రైతు సమాఖ్య రాష్ట్ర నాయకులు ఎంవీ సూర్యనారాయణరాజు ఆకివీడులో ప్రకటించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఏనాడూ ప్రయత్నించలేదని రాజకీయేతర ఐకాస చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలమోహన్‌దాస్ పేర్కొన్నారు. విశాఖలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విభజనకు వైఎస్ బీజం వేశారని కొందరు రాజకీయ నేతలు చెప్పడాన్ని తప్పుబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ బస్సు యాత్రలు ప్రారంభం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి, అమలాపురం పార్లమెంటు నియోజక వర్గాల్లో బస్సు యాత్రలు ప్రారంభించారు. రాజమండ్రిలో వీఎల్ పురం సాయిబాబా ఆలయం వద్ద ఉదయం ప్రారంభమైన యాత్ర తొలిరోజు లాలాచెరువు వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు జరిగింది. ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, ఆదిరెడ్డి అప్పారావు, గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత, రాజమండ్రి పార్లమెంటరీ పార్టీ కో ఆర్డినేటర్ బొడ్డు వెంకట రమణచౌదరి తదితరులు పాల్గొన్నారు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ యాత్ర తొలిరోజు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి మామిడికుదురు వరకు సాగింది. ఈ యాత్రలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పార్టీ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ కొల్లి నిర్మల కుమారి పాల్గొన్నారు. మంత్రి తోట నరసింహం సతీమణి వాణి కాకినాడలో సాగిస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున భగ్నం చేసి, ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఎడతెరపి లేని వర్షంలోనూ.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో శుక్రవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా ఉద్యమకారులు ఆందోళనలు కొనసాగించారు. నెల్లూరు వీఆర్సీ కూడలిలో సమైక్య ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఆర్టీసీ ఉద్యోగులు బస్టాండు ఎదుట వంటా వార్పు నిర్వహించారు. ఆర్టీసీ అద్దె బస్సుల ర్యాలీ సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బస్సుయాత్రను శుక్రవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో ప్రారంభించారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ అద్దె బస్సులతో శ్రీకాకుళంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు ప్రసారాలను నిలిపివేశారు. కృష్ణా కరకట్ట దిగ్బంధం కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని వల్లూరుపాలెంలో కేసిఆర్ దిష్టిబొమ్మతో ప్రధాన వీధుల వెంట శవయాత్ర నిర్వహించారు. అనంతరం మూడు గంటలపాటు కృష్ణా కరకట్టను దిగ్బంధించి పెద్దఎత్తన ఆందోళన చేయటంతో, భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విజయవాడ-పులిగడ్డల మధ్య గంటలసేపు రాకపోకలు స్తంభించాయి. మచిలీపట్నంలో ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు వర్షంలో తడుస్తూనే దీక్షా శిబిరాల్లో కూర్చున్నారు. వాల్మీకుల భారీ ప్రదర్శన అనంతపురం జిల్లా పెనుకొండలో పార్టీలకు అతీతంగా వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో వేలాది మందితో భారీ ఎత్తున సమైక్యర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో కురుబ సంఘం ఆధ్వర్యంలో, ముస్లింలు సోదలు భారీ ర్యాలీ చేపట్టారు. రాయదుర్గంలో రైతులు ఎద్దులబండ్లు కట్టుకుని పట్టణమంతా సమైక్యనినాదాలతో ర్యాలీ తీశారు. అనంతపురం నగరంలో డీఎంహెచ్ఓ, వైద్య ఆరోగ్యశాఖ జేఏసీ చేపట్టిన రిలేదీక్షలకు ఎమ్మెల్యే బి.గురునాథ్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎస్కేయూ విద్యార్థులు వర్శిటీ నుంచి కలెక్టరేట్ సమీపం వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ జిల్లాలో జోరు వానలో సైతం సమైక్య ఉద్యమ హోరు తగ్గలేదు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండాజిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, మానవహారాలు, ఆందోళనలతో హోరెత్తించారు. కడపలో, రాయచోటిలో ముస్లింలు భారీ ర్యాలీని చేపట్టి నడిరోడ్డుపైనే ప్రార్థనలు చేశారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురంతోపాటు జిల్లాలో పలుచోట్ల రహదారులను దిగ్బంధం చేశారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు సామూహిక సెలవులు తీసుకుని రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. చీపురుపల్లిలో రాష్ట్రానికి చెందిన 9 మంది కేంద్ర మంత్రుల ఫొటోలపై గంగిరెద్దులు అని రాసి కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. రక్తం చిందించైనా.. తిరుపతి సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి ఆధ్వర్యంలో శుక్రవారం సమైక్యాంధ్ర చార్ట్‌కు రక్తపు తిలకం దిద్దారు. రక్తం చిందించైనా రాష్ట్రాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. చిత్తూరు జిల్లాలోని 13 ఆర్టీసీ డిపోల్లో బస్సులు రోడ్డెక్కలేదు. పుంగనూరులో ముస్లింలు ర్యాలీ నిర్వహించి, గోకుల్ కూడలిలో ప్రార్థనలు చేశారు. గుంటూరు జిల్లాలో అన్నిచోట్లా వైఎస్ఆర్ సీపీ నేతల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. గుంటూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు మహాత్ముని బాటలో మేమూ.. అంటూ నోటికి మాస్క్‌లు, చెవుల్లో దూది, కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. జీతాలు రాకుంటే ఉద్యమం దెబ్బతింటుంది.. ఎన్జీవోలపై టీజీ వివాదాస్పద వ్యాఖ్యలు కర్నూలు జిల్లాలో జోరువానలోనూ సమైక్యాంధ్ర ఉద్యమం ఉప్పెనై ఎగిసింది. కర్నూలులోని పాతబస్తీలో చిన్న వ్యాపారుల సంఘం నిర్వహించిన వంటావార్పు కార్యక్రమానికి హాజరైన మంత్రి టీజీ వెంకటేశ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్జీవోల సమ్మెకు ఇది తగిన సమయం కాదని, వారు పునరాలోచించుకోవాలని సూచించారు. రెండు నెలలు జీతాలు రాకపోతే ఎన్జీవోల ఉద్యమం దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం సమైక్యాంధ్ర ఉద్యమాల్లో పాల్గొనకుండా చిత్తశుద్ధితో పాల్గొనాలని సూచిం చారు. కర్నూలు నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్లో ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు వర్షంలో తడుస్తూ మానవహారంగా ఏర్పడి రాస్తారోకో నిర్వహించారు. ఒంగోలులో ‘తెలంగాణ’ అధికారులకు సన్మానం ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలంగాణ ప్రాంతానికి చెందిన జిల్లా విద్యాశాఖాధికారి రాజేశ్వరరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి మయూరిలను ఘనంగా సన్మానించారు. నగర ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చీరాలలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను కొట్టారంటూ ఎపీఎన్జీఓల ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి ఆందోళనకు దిగారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గిద్దలూరులో ఆందోళనకారులు అటవీశాఖ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఆగని మృత్యుఘోష శుక్రవారం ఒక్కరోజే ఆరుగురి కన్నుమూత సాక్షి నెట్వర్క్: ‘వేర్పాటు’ భయంతో ప్రాణాలు విడుస్తున్న వారి సంఖ్య ఇంకా తగ్గడం లేదు. ఒక్క శుక్రవారం రోజునే సీమాంధ్ర జిల్లాల్లో ఆరుగురు గుండెపోటుతో మృత్యువాత వడ్డారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో నాలుగు రోజులుగా చురుగ్గా పాల్గొంటున్న గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని దోబీఘాట్‌కు చెందిన పగిళ్ల నాగరాజు (24) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందాడు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని గూబగుండం గ్రామానికి చెందిన నాగరాజు(34) టీవీలో విభజన, ఉద్యమం వార్తలు చూస్తూ గుండెపోటుతో మృత్యువాత పడ్డాడు. ఇదే జిల్లా తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన పందికోన జయన్న(48) రాష్ట్రం విడిపోతే తనకు జీవనాధారం పోతుందేమోనన్న బెంగతో గుండె ఆగి శుక్రవారం కన్నుమూశాడు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్న అనంతపురం జిల్లా నార్పల మండలం నాయునిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ అభిమాని సాయిరాం(47), పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన పెయింటర్ అంజన్‌రెడ్డి (36), శెట్టూరు మండలం మాకొడికి చెందిన నేసే కిష్టప్ప (42) గుండెపోటుతో మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. విమానం మోత! విజయవాడ, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం ప్రయాణికులపై తీవ్రంగా ఉంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో బస్సు సర్వీసులు రద్దుచేసిన విషయం విదితమే. ఇక రైళ్ళలో విపరీతమైన రద్దీ నెలకొన్న నేపథ్యంలో విజయవాడ నుంచి ముఖ్య నగరాలకు వెళ్లే విమానాల చార్జీలు మోతమోగుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, ఖమ్మం, పశ్చిమగోదావరి జిల్లాల ప్రయాణికులకు అనువైన గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్వేస్ ధరలకు రెక్కలొచ్చాయి. గన్నవరం-హైదరాబాద్‌కు గతంలో ఉన్న రూ.2,600 టికెట్ రూ.7 వేలకు పెరిగింది. ఇక్కడి నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీ టికెట్ రూ.5,800 నుంచి రూ.12 వేలకు, బెంగళూరు టికెట్ రూ.2,700 నుంచి రూ.6 వేలకు, చెన్నైకు రూ.2,800 ఉన్న ధర దాదాపు రూ.6 వేలకు పెరిగాయి. టికెట్ల ధర మూడింతలు పెరిగినప్పటికీ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, వారి కుటుంబసభ్యులు విమానయానానికి పోటీపడుతుండటం గమనార్హం. కేశినేనీ.. ఇదేం పని? సాక్షి, విజయవాడ : తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తరహాలోనే ఆ పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కేశినేని శ్రీనివాస్ (నాని) రెండు కళ్ల సిద్ధాంతం అమలు చేస్తున్నారు. సమైక్యవాదిగా ఉదయం పూట ఉద్యమంలో పాల్గొని బంద్‌లు చేయిస్తున్నారు. రాత్రయ్యేసరికి కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సుల్ని యథావిధిగా నడిపిస్తున్నారు. కేశినేని ట్రావెల్స్‌కు చెందిన 22 బస్సులు విజయవాడ నుంచి హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు జోరుగా నడుస్తున్నాయి. సమైక్య ఉద్యమంలో ఆయన పాల్గొంటూనే, తనకు వచ్చే లక్షల రూపాయల ఆదాయానికి గండిపడకుండా జాగ్రత్తలు తీసుకోవడాన్ని టీడీపీ నేతలే తప్పుపడుతున్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్దాంతంతో సీమాంధ్ర ప్రాంతంలో తలెత్తుకోలేకపోతున్నామని, ఇప్పుడు నాని వంటి వారి చర్యలతో ప్రజల్లో పార్టీ చులకనైపోతోందని ఆవేదన చెందుతున్నారు. కేశినేని ట్రావెల్స్ బస్సులు నడపటాన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆక్షేపిస్తున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ కూడా ఉద్యమంలో కలిసి రావాలని డిమాండ్ చేస్తున్నాయి. కేశినేని ట్రావెల్స్ బస్సుల్ని తొలుత ఆపేస్తే మిగిలిన ప్రైవేటు ట్రావెల్స్ కూడా ఆయన దారిలోకే వస్తాయని ఆర్టీసీ కార్మికులు పేర్కొంటున్నారు. -
వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్
ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణిచి వేయడానికి జిల్లా ఎస్పీ నియంతలా వ్యవహరిస్తున్నారు. సమైక్యవాదులపై అసాంఘిక శక్తుల ముద్ర వేసి.. కేసులు బనాయించి, బైండోవర్ చేస్తున్నారు. ప్రజాభిప్రాయం మేరకు సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్న వైఎస్సార్సీపీ నేతలనే ఎస్పీ లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆ క్రమంలో ఎమ్మెల్యేలను కూడా లెక్క చేయడం లేదు. అనంతపురం ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డితోపాటు వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి, జిల్లా కన్వీనర్ ఎం.శంకరనారాయణ, నేతలు బి.ఎర్రిస్వామిరెడ్డి, సాలార్‌బాష, బలరాం, బండి పరశురాం, ధనుంజయ యాదవ్, గోపాల్‌రెడ్డి, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, మహానందరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, ఉప్పర రాజశేఖర్, తిరుపాల్‌రెడ్డి, చింతకుంట మధు, వంశీ క ృష్ణారెడ్డి, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, బాలనర్సింహారెడ్డి, లింగాల రమేష్‌లపై మంగళవారం బైండోవర్ కేసు నమోదు చేశారు. వీరిలో ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, శంకరనారాయణ, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి మినహా 15 మందిని అనంతపురం తహశీల్దార్ ఆంజనేయులు ఎదుట పోలీసులు బైండోవర్ చేయడం గమనార్హం. ఇంతకుముందే సమైక్య ఉద్యమంలో పాల్గొన్న వెయ్యి మందిపై పది కేసులు నమోదు చేశారు. ఇందులో ముగ్గురు విద్యార్థులు క్రాంతికుమార్, వాసు, చంద్రకుమార్, ప్రైవేటు ఉద్యోగి శ్రీనివాసులును అరెస్టు చేసి.. శనివారం కోర్టులో హాజరు పరిచారు. వీరు నలుగురు మంగళవారం బెయిల్‌పై విడుదలయ్యారు. సమైక్యవాదులపై అక్రమ కేసులు బనాయించి.. భయోత్పాతం సృష్టించి, ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఎస్పీ చేస్తోన్న యత్నాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
డిసెంబర్ 9 కల్లా రెండు రాష్ట్రాలు!
సోనియాగాంధీ పుట్టినరోజు నాటికి విభజన బిల్లు ఆమోదం కేంద్రం పరిశీలనలో రాయల తెలంగాణ, భద్రాచలం అంశాలు తెలంగాణలోని సీమాంధ్రులు సెటి లర్లు కాదు సర్వీస్ నిబంధనల మేరకే ఉద్యోగుల విషయంలో నిర్ణయం రాష్ట్రపతి అసెంబ్లీ తీర్మానం కోరే అవకాశం లేదు విభజన ప్రక్రియలో సీఎం భాగస్వామి కాలేనంటే హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది పీసీసీ మాజీ చీఫ్ డీఎస్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పుట్టిన రోజైన డిసెంబర్ 9 నాటికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పడతాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తంచేశారు. ఇప్పటికే విభజన నిర్ణయం జరిగిపోయినందున ఇంకా కలిసి ఉండాలనడంలో అర్థంలేద న్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం జరిగినప్పటికీ రాయల తెలంగాణ, సీమాంధ్రలో భద్రాచలం కలపడం వంటి అంశాలు కూడా కేంద్రం పరిశీలనలో ఉన్నాయని ఆయన తెలిపారు. తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్రులంతా తెలంగాణలో అంతర్భాగమేనని, ఇక్కడ పనిచేస్తున్న ఆ ప్రాంత ఉద్యోగుల విషయంలో కేంద్రం.. సర్వీస్ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సమైక్య ఉద్యమాలను ఎదుర్కొనడమే కాంగ్రెస్ పార్టీ ముందున్న కర్తవ్యమని చెప్పారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ, నాయకులు శైలేష్‌రెడ్డి, పల్లె రవికుమార్, పీవీ శ్రీనివాస్, క్రాంతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన, తెలంగాణ పునర్నిర్మాణం తదితర అంశాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు డీఎస్ బదులిచ్చారు. ‘గత నాలుగేళ్లుగా కాంగ్రెస్ హైకమాండ్ విస్తృత సంప్రదింపులు, చర్చలు, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నియామకం, ఆ కమిటీ నివేదిక ఇవ్వడం, కేంద్రం పలుమార్లు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించడం, ప్రతి ఒక్క పార్టీతో.. ప్రజాప్రతినిధులతో అభిప్రాయ సేకరణ... ఇలా అనేక రకాలుగా కసరత్తు చేసిన తర్వాతే తెలంగాణపై నిర్ణయం జరిగింది. ఇప్పుడు తొందరపాటు నిర్ణయమని సీమాంధ్ర నేతలు చెప్పడం సరికాద’న్నారు. విభజన నిర్ణయం అమలు బాధ్యత సీఎందే.. ‘రాష్ట్ర విభజన నిర్ణయం అమలుచేయాల్సిన బాధ్యత సీఎంతోపాటు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై ఉంది. వారు ఆ పని చేస్తారనే భావిస్తున్నా. ఒకవేళ విభజన ప్రక్రియలో భాగస్వామిని కాలేనని సీఎం చెబితే పార్టీ తగిన నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలం టూ వారు సంతకాలు చేశారని విన్నాను. అది వారి విచక్షణకే వదిలేస్తున్నా. నేను సమాధానం చెప్పలేను. తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్రులు సెటిలర్లు కాదు. కాంగ్రెస్ డిక్షనరీలో సెటిలర్లు అనే పదానికే తావు లేదు. వారంతా తెలంగాణలో అంతర్భాగమే. సీమాంధ్ర ఉద్యోగుల రక్షణకు ఢోకా లేదు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ఏర్పాటుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి.. అసెంబ్లీలు తీర్మానం చేస్తే కేంద్రం తగిన చర్య తీసుకోవడం. రెండోది వివిధ రూపాల్లో వస్తున్న ఆందోళనలు, ఉద్యమాల కారణంగా కేంద్రం తనంతట తాను విభజన ప్రక్రియ చేపట్టడం కోసం అసెంబ్లీ అభిప్రాయాన్ని కోరడం. తెలంగాణ విషయంలో కేంద్రం రెండో ప్రక్రియను చేపట్టింది. ఈనెల 8న కేంద్ర కేబినెట్ తెలంగాణ అంశంపై చర్చించి రాష్ట్రపతికి పంపుతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి అసెంబ్లీ అభిప్రాయాన్ని మాత్రమే కోరతారు. తీర్మానం చేయమని కోరే అవకాశంలేదు. 4,5 నెలల్లోనే విభజన ప్రక్రియ ముగుస్తుందని కేంద్ర హోంమంత్రి కూడా చెప్పినందున సోనియా పుట్టినరోజు నాటికి రెండు రాష్ట్రాలు ఏర్పడతాయనే నమ్మకం నాకుంది.’ వాళ్లు తెలంగాణలో కలుస్తానంటే సంతోషమే ‘రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల నేతలు ఆంధ్రలో ఉండలేమని చెబుతున్నారు. తెలంగాణలో కలుస్తామంటున్నారు. ఇది సంతోషమే. రాయల తెలంగాణ అంశం కేంద్రం పరిశీలనలో ఉంది. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారనేది ఊహాజనితమే. దీనిని ఎవరూ ఒప్పుకునే ప్రసక్తిలేదు. హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా చేసే ప్రతిపాదన కేంద్రం వద్ద లేదు. ఇక తెలంగాణ విడిపోతే అభివృద్ధి కాలేదని అంటున్న వాళ్లు సైతం ఆశ్చర్యపోయేలా ఊహించని అభివృద్ధి సాధించడమే లక్ష్యం. తెలంగాణలో పుష్కలంగా వనరులున్నాయి. 70, 80 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి. విద్యుత్ ఉత్పత్తిని మరింత పెంచుకోవాలి. విద్య, వైద్య రంగాలను విస్తృతం చేయాలి. దేవుడిచ్చిన శరీరాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఆత్మహత్య చేసుకుంటాననడం ఎంత తప్పో... సాగుకు యోగ్యమైన భూమిని సాగులోకి తేకుండా ఉంచడం కూడా అంతే తప్పు.’ కేసీఆర్ హైకమాండ్‌కు చాలా దగ్గరి మనిషి ‘టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు కాంగ్రెస్ హైకమాండ్‌కు చాలా దగ్గర మనిషి. మంచి సంబంధాలున్నాయి. టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ చాలాసార్లు చెప్పారు. మొన్న కూడా తెలంగాణ బిల్లు పాసయ్యాక విలీనంపై చర్చిస్తానన్నారు. అవసరమైతే నా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాను.’ నేను వినాయకుడిని.. కేసీఆర్ కుమారస్వామి! ‘తెలంగాణ సాధన విషయంలో మీరెందుకు స్పీడ్‌గా వెళ్లడంలేదని కొందరు మీడియా మిత్రులు గతంలో నన్ను అడిగారు. అప్పుడు నేనొక కథ చెప్పాను. ఆనాడు వినాయకుడు, కుమారస్వామిల్లో ఎవరిని గణనాథుడిగా ఎంపిక చేయాలా? అని శివపార్వతులు ఆలోచించి ముల్లోకాలను చుట్టొచ్చిన వారినే ఎంపిక చేస్తామని చెబితే ఏమైందో మీకు తెలుసు. తెలంగాణ విషయంలో కూడా అంతే. కేసీఆర్ తెలంగాణ ఇవ్వాలని ఊరూవాడా స్పీడ్‌గా తిరుగుతుంటే.. నేను మాత్రం తెలంగాణ ఇచ్చే శివపార్వతులు సోనియాగాంధీయే కాబట్టి ఆమె చుట్టే ప్రదక్షిణలు చేశాను. తెలంగాణ సాధిం చాను. ఇందులో కేసీఆర్ కృషి కూడా తక్కువేమీ కాదు. సమైక్యరాష్ట్రంలో సీఎం కాలేదనే బాధ నాకు లేదు. నేనిప్పుడు సీఎం కావాలా? పీసీసీ అధ్యక్షుడు కావాలా? అనేది నా చేతుల్లో లేదు. గతంలో సోనియాగాంధీ నన్ను రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. ఇప్పుడు కూడా ఆమె చేతుల్లోనే నా భవిష్యత్తు ఉంది. నేను సీఎం రేసులో ఉన్నానని చెప్పడానికి ఇదేమీ గుర్రాల పందెం కాదు..’