సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లును త్వరగా పార్లమెంటులో పెట్టేలా తాను వ్యక్తిగతంగా ప్రధానమంత్రి మన్మో„హన్‌సింగ్‌ను కలుస్తానని బీజేపీ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ చెప్పారు. బిల్లు రూపకల్పనకు రెండు నెలల సమయం సరిపోతుందన్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆమె ఆదివారం ఉదయం ఇక్కడ ఓ హోటల్‌లో పార్టీ పదాధికారులు, జేఏసీ నేతలతో భేటీ అయ్యారు. పార్టీ పరిస్థితి, తెలంగాణ బిల్లు, సీమాంధ్ర ఉద్యమం తదితర అంశాలపై మాట్లాడారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని వచ్చిన తర్వాత తెలంగాణ బిల్లుపై చర్చిస్తానని సుష్మా పార్టీ నేతలకు హామీ ఇచ్చారు. ఈ సమయంలో జేఏసీ నేతల్లో ఒకరు కల్పించుకుని.. ‘తెలంగాణకు బీజేపీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని, మహబూబ్‌నగర్‌లో చేసిన ప్రసంగంతో తమ అనుమానాలూ నివృత్తి అయ్యాయని’ అన్నారు. దీనిపై ఆమె కాస్త ఘాటుగానే స్పందించినట్టు తెలిసింది.
ప్రతిపక్ష నాయకురాలి హోదాలో పార్లమెంటరీ విధివిధానాలను స్పీకర్ దృష్టికి తీసుకువచ్చి, సభ్యుల సస్పెన్షన్ సమయంలో వాటిని పాటించాలని మాత్రమే కోరానంటూ, ఆ మాత్రానికే అనుమానాలు రావాలా? అని ప్రశ్నించారు. తెలంగాణపై తమ విధానం స్పష్టంగా ఉందన్నారు. సీమాంధ్ర ఉద్యమకారులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. తెలంగాణపై కాంగ్రెస్ కూడా వెనకడుగు వేయకపోవచ్చని, తన రాజకీయ ప్రయోజనాల కోసమైనా ఇస్తుందనుకుంటున్నట్టు చెప్పారు. వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని పార్టీ నేతలకు సూచించారు. పార్టీ నేతలు జి.కిషన్‌రెడ్డి, యెండల లకీష్మనారాయణ, బండారు దత్తాత్రేయ, నల్లు ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ కె.లకష్మణ్, డాక్టర్ టి.రాజేశ్వరరావు, ఎన్.వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ ప్రకాశ్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, అశోక్‌కుమార్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. దీనికి ముందు టీజేఏసీ నేతలు కోదండరాం, మల్లేపల్లి లక్ష్మయ్య, శ్రీనివాస్‌గౌడ్, ఉద్యోగ సంఘ నాయకులు దేవీప్రసాద్, అద్దంకి దయాకర్, కత్తి వెంకటస్వామి, విఠల్, రాజేందర్‌రెడ్డి తదితరులు సుష్మాస్వరాజ్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఉదయం 9.45 గంటలకు ఆమె శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లారు.
తెలంగాణపై ప్రధానితో చర్చిస్తా : సుష్మాస్వరాజ్
Published Mon, Sep 30 2013 1:28 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement