'టీ' బిల్లుకు సంపూర్ణ మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు బీజేపీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. విభజనతో వచ్చే సమస్యల పరిష్కారానికి, బిల్లుకు ముడిపెట్టరాదన్నది తమ వైఖరంటూ తనను కలిసినపార్టీ తెలంగాణ నేతలకు ఆయన తెలిపారు. తెలంగాణను ఇస్తున్నట్టుగా ప్రకటించి అఖిలపక్షం, సంప్రదింపులు, అభిప్రాయ సేకరణ అంటున్న కాంగ్రెస్ తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బీజేపీ మద్దతుతోనే తెలంగాణ సాధ్యమన్న విషయాన్ని బలంగా ప్రచారం చేయాలని ఆయన పార్టీ తెలంగాణ నేతలకు మార్గనిర్దేశం చేశారు.
ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ టి.రాజేశ్వరరావుతోపాటు గుజ్జుల రామకృష్ణారెడ్డి, జి.ప్రేమేందర్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్, సీహెచ్.స్వామిగౌడ్, వెదిరె శ్రీరాం, ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్, మల్లారెడి తదితరులతో కూడిన బీజేపీ తెలంగాణ ప్రాంత నేతల బృందం శనివారం రాజ్‌నాథ్‌సింగ్‌ను ఢిల్లీలో కలుసుకుంది. మంత్రుల బృందాని(జీవోఎం)కి పార్టీ తరఫున ఇవ్వాల్సిన నివేదికలో భాగంగా 10 పేజీల సూచనలను ఆయనకు అందజేసింది. రాజ్‌నాథ్‌తో భేటీ తర్వాత ఈ బృందం పార్టీ అగ్ర నేతల్లో ఒకరైన అరుణ్ జైట్లీని కూడా కలిసింది. ఆయన కూడా తెలంగాణకు సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు.
నివేదిక బాధ్యత రవిశంకర్‌ప్రసాద్‌కు
తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి పార్టీ నాయకులను అడిగి తెలుసుకున్న రాజ్‌నాథ్ కాంగ్రెస్ బిల్లు తెస్తే సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని, లేదంటే పార్లమెంట్ వేదికగా ఆ పార్టీ ద్వంద్వ నీతిని ఎండగడతామని మాటిచ్చినట్లు తెలిసింది. జీవోఎం విధి విధానాలపై శ్రీరాం వెదిరె రాజ్‌నాథ్‌కు వివరించారు. దీనికి రాజ్‌నాథ్ స్పందిస్తూ, సీమాంధ్ర, తెలంగాణ నుంచి నివేదికలు అందినందున రెండింటినీ పరిశీలించి ఒకే నివేదికగా కూర్చి జీవోఎంకు పంపే బాధ్యతను పార్టీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్‌కు అప్పగిస్తున్నానని చెప్పినట్లు నేతలు తెలిపారు. 5వ తేదీలోగారవిశంకర్ ప్రసాద్ నివేదికను జీవోఎంకు పంపుతారని, కుదరకపోతే రెండురోజుల అదనపు సమయం కోరతారని పార్టీ వర్గాలు తెలిపాయి. పొత్తులపై పార్టీ నాయకుల ప్రశ్నలకు ఆయన బదులిస్తూ, ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, ఒంటరిపోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు బృందంలోని ఒకరిద్దరు నేతలు వెల్లడించారు.
నిశ్చింతగా ఉండండి: సుష్మ
త్వరలో తెలంగాణ కల సాకారమవుతున్నందున నిశ్చింతగా ఉండాలని సుష్మాస్వరాజ్ భరోసా ఇచ్చినట్టు తెలంగాణ ఉద్యమ కమిటీ నేతలు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఉద్యమ కమిటీ నేతలు డాక్టర్ టి.రాజేశ్వరరావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి, ఎస్.కుమార్, ప్రదీప్‌కుమార్, టి.ఆచారి తదితరులు ఆదివారం సుష్మాస్వరాజ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె నేతలందరికీ మిఠాయిలు పంచిపెడుతూ... మీ చిరకాల స్వప్నం నెరవేరుతోందని, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పార్టీ నేతలు క్రియాశీలంగా ఉండాలని అన్నారు. ప్రజలు మార్పుకోరుతున్నందున నేతలు క్షేత్రస్థాయిలో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.
తెలంగాణ బీజేపీతోనే సాధ్యమైందని ప్రజల్లోకి వెళతాం: నాగం
పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ను కలుసుకున్న తర్వాత ఢిల్లీలో, ఆదివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై 2006లో తీసుకున్న నిర్ణయానికి పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. రాజ్‌నాథ్ తమకు అభయమిచ్చారని, తెలంగాణ సాధనకు బీజేపీ కృషిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన కోరినట్లుగా చెప్పారు. తెలంగాణ సాధన తమతోనే సాధ్యమైందని, ఈ విషయాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయనున్నామని వెల్లడించారు.
పార్టీ నేతలు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జెట్లీ, సుష్మాస్వరాజ్‌కు తమ నివేదికను అందజేసినట్టు వివరించారు. పార్లమెంటు సమావేశాల్లో బొగ్గు స్కామ్ వ్యవహారాన్ని చేపట్టి తెలంగాణ బిల్లు రాకుండా తమ పార్టీ సభను స్తంభింపచేయనున్నట్టు వస్తున్న వదంతులను తోసిపుచ్చారు. పార్టీ జాతీయ నాయకత్వమే తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తోందని, రాష్ట్రం రెండుగా విడిపోయి బాగా అభివృద్ధి సాధించాలని కోరుకుంటోందని చెప్పారు. బిల్లు పెట్టేంతవరకు కాంగ్రెస్‌ను విడిచిపెట్టబోమన్నారు. తెలంగాణలో ప్రచార కార్యక్రమాన్ని త్వరలో ఖరారు చేయనున్నట్టు తెలిపారు. సీమాంధ్రుల అపోహల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు. హైదరాబాద్ అందరిదని, దీనిపై కేంద్రం పెత్తనాన్ని అంగీకరించబోమన్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీ కొత్తప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని యెన్నం చెప్పారు.