మోడీ కేబినెట్ లో 7గురు మహిళలకు చోటు
న్యూఢిల్లీ: మరికొద్ది గంటల్లో భారత్ ప్రధానిగా పగ్గాలు చేపట్టబోతున్న నరేంద్ర మోడీ కేబినెట్ లో ఏడుగురు మహిళలకు స్థానం కల్పించారు.చిన్న కేబినెట్ అయితే సానుకూలంగా ఉంటుందని భావించిన మోడీ..అటు మహిళలకు సముచిత స్థానం కల్పించారు. తాజా కేబినెట్ లో చోటు దక్కిన వారిలో సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్, ఉమాభారతి, మేనకా గాంధీ, స్మృతి ఇరానీ, కిరణ్ ఖేర్, నజ్మా హెప్తుల్లా లు ఉన్నారు. కేబినెట్ లో చోటు దక్కిన నిర్మలా సీతారామన్ ప్రస్తుతం బీజేపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతుండగా, స్మృతి ఇరానీ మాత్రం తాజా లోక్ సభ ఎన్నికల్లో ఆమేథీలో రాహుల్ గాంధీ పై పోటీ చేసి ఓటమి పాలైయ్యారు.
నరేంద్ర మోడీ మంత్రివర్గంలో మొత్తం మీద 44 మందికి చోటు దక్కింది. వారిలో 23 మందికి కేబినెట్ హోదా, 11మందికి సహాయ మంత్రులు, 10మందికి స్వతంత్ర హోదా దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక రక్షణ శాఖను మోడీ తన ఆధ్వర్యంలోనే ఉంచుకోనున్నట్లు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాధ్ సింగ్కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దక్కనుంది. విదేశాంగమంత్రిగా సుష్మా స్వరాజ్, ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ, ఆరోగ్య శాఖ మంత్రిగా హర్షవర్థన్కు చోటు లభించే అవకాశం ఉంది. ఇక కేంద్ర కేబినెట్‌లో చేర్చుకునే సభ్యుల పేర్లను నరేంద్రమోడీ ఈరోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపారు.