తెలంగాణ బిల్లుపై చర్చ జరగాల్సిందే!
-
టీ బిల్లుపై చర్చకు పట్టుబట్టాలని
-
బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం
సవరణలు, పరిష్కారాలు అడుగుదాం, ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలందాం, భాగస్వాములు చర్చలో ఉండాల్సిందే, కాంగ్రెస్‌ది కపట నీతి అంటూ ధ్వజం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి పాటించడమే గాక తమను దోషిగా చిత్రించేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ మండిపడుతోంది. ఈ ప్రయత్నాలను పార్లమెంటులోనే తిప్పికొట్టాలని నిర్ణయించింది. ఆదివారం రాత్రి అద్వానీ నివాసంలో ఆయన అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. పలు అంశాలపై దాదాపు మూడు గంటలు సుదీర్ఘంగా చర్చించింది. మూడు రోజుల విరామం తర్వాత పార్లమెంటు సమావేశాలు తిరిగి మొదలవుతున్నందున అనుసరించాల్సిన వ్యూహంపై మల్లగుల్లాలు పడింది. పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, అగ్ర నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, ఎం.వెంకయ్యనాయుడు తదితరులు భేటీలో పాల్గొన్నారు.
తెలంగాణపై బీజేపీ యూ టర్న్ తీసుకుందన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ వ్యాఖ్యలు, వాటికి కొనసాగింపుగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేస్తున్న వ్యాఖ్యలపై సమావేశంలో ఆగ్రహం వ్యక్తమైంది. విభజన బిల్లుకు మద్దతివ్వాలని, కీలక బిల్లులు ఆమోదం పొందేందుకు సహకరించాలని ఓవైపు తమను ప్రధాని కోరుతుంటే, మరోవైపు రాహుల్ ఇలా విమర్శలకు దిగడం కాంగ్రెస్ కపట నీతిలో భాగమని నేతలు అభిప్రాయపడ్డారు. యూపీఏ అసమర్థ పాలన, అవినీతి, దానిపై దేశవ్యాప్తంగా నెలకొన్న వ్యతిరేకత తదితరాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలా చేస్తోందన్న భావన వ్యక్తమైంది. తెలంగాణపై పదేళ్లుగా తేల్చకుండా, ఇప్పుడిలా ఎన్నికల వేళ ఇరు ప్రాంతాలతో చర్చించకుండా హడావుడిగా బిల్లు తేవడం ఎత్తుగడలో భాగమేనని నేతలన్నారు.
లోక్‌సభలో బిల్లు పెట్టిన తీరే పూర్తిగా అప్రజాస్వామికమన్నారు. అదే పద్ధతిలో బలవంతంగా దాన్ని ఆమోదించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఎండగట్టాల్సిందేనని నిర్ణయించారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో బిల్లుపై లోక్‌సభలో చర్చ జరగాల్సిందేనని, అందుకు పట్టుబట్టాలని నిర్ణయానికి వచ్చారు. ‘చర్చ జరిగితే జరగనిద్దాం. బిల్లు తేవాలని ఎప్పట్నుంచో చెబుతూ వచ్చాం. మద్దతిస్తామని కూడా చెప్పాం. అదే సమయంలో సీమాంధ్ర డిమాండ్లను కూడా పరిష్కరించాలన్నాం. కానీ వాటిని కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో చర్చ సాఫీగా జరిగేలా చూద్దాం. అంతేగాక ఆ సందర్భంగా సీమాంధ్ర ప్రయోజనాలను నెరవేర్చేలా పరిష్కారం చూపమందాం. బిల్లుకు సవరణలు ప్రతిపాదించి ఆమోదింపజేసుకుందాం’’ అని సుష్మ, రాజ్‌నాథ్ అన్నట్టు సమాచారం. సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేతకు కూడా పట్టుబట్టాల్సిందేనని నేతలన్నారు. ‘‘సస్పెన్షన్లను మనం ముందు నుంచీ వ్యతిరేకిస్తున్నాం.
నిజానికి లోక్‌సభలో బిల్లు తెచ్చిన విధానమే అప్రజాస్వామికంగా ఉంది. పైగా రాష్ట్ర విభజనపై చర్చ జరుగుతుంటే అక్కడి ఎంపీలు చర్చలో ఉండకపోతే ఎలా? ఇరుప్రాంతాల సభ్యుల మధ్య చర్చ జరిగితే అది ప్రజాస్వామ్య పద్ధతి అనిపించుకుంటుంది. కాబట్టి సస్పెన్షన్లను కూడా వ్యతిరేకిద్దాం’’ అని పేర్కొన్నట్టు తెలుస్తోంది. భేటీ అనంతరం బీజేపీ నేతలెవరూ మీడియాతో మాట్లాడలేదు. అయితే చర్చ లేకుండా బిల్లును ఆమోదించుకోవాలన్న కాంగ్రెస్ కుయుక్తిని ఎండగట్టేలా తమ వైఖరి ఉంటుందని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. లోక్‌సభ నుంచి సస్పెన్షన్‌కు గురైన సీమాంధ్ర ఎంపీలు సబ్బం హరి, లగడపాటి రాజగోపాల్ బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీకి ముందు మధ్యాహ్నం అద్వానీని కలిశారని, సస్పెన్షన్ ఎత్తేయించాలని కోరారని సమాచారం.
ఏకమవనున్న విపక్షాలు!
విభజన బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీరుపై అన్ని పార్టీలూ గుర్రుగా ఉన్నాయి. అజెండాలో లేకుండా అకస్మాత్తుగా బిల్లు తెచ్చి, పది పదిహేను సెకన్లలో దాన్ని ప్రవేశపెట్టామంటున్న తీరును తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో 19వ తేదీన బిల్లుపై చర్చకు ప్రభుత్వం ప్రయత్నించినా ఆ పార్టీలు అంత సులువుగా అంగీకరించకపోవచ్చంటున్నారు. తెలంగాణకు ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పలు పార్టీలు సభ సజావుగా సాగించేందుకు ఒప్పుకోకపోవచ్చు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు కూడా నిరసనలకు దిగవచ్చంటున్నారు.
బిల్లు 19వ తేదీనే!
ప్రకటించిన లోక్‌సభ అజెండా ప్రకారం 17, 18 తేదీల్లో విభజన బిల్లు అజెండాలో లేదు. సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఉభయ సభల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అంతకుముందు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ అన్ని పార్టీలతో భేటీ కావచ్చు. తెలంగాణ బిల్లు 19వ తేదీనే చర్చకు రానున్నట్టు తెలుస్తోంది.