సాక్షి నెట్‌వర్క్ : రాష్ట్రం ఒక్కటిగా ఉండటం కంటే మరో ప్రత్యామ్నాయమే లేదన్న నినాదంతో సీమాంధ్రలో ఎగసిన జనోద్యమం వరుసగా 85వ రోజైన బుధవారం కూడా ఉద్ధృతంగా సాగింది. కోస్తా, రాయలసీమల్లోని పలు జిల్లాల్లో జోరువర్షం కురుస్తున్నా సమైక్యవాదులు ఆందోళనలు కొనసాగించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో అన్ని జేఏసీలు కలిసి ర్యాలీ నిర్వహించాయి. పుంగనూరు రూరల్ నల్లగుట్టపల్లి గిరిజన తండాలో విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. చిత్తూరులో ఎన్జీవోలు గాంధీవిగ్రహం వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు.
అనంతపురం జిల్లా పామిడిలో విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. కుందుర్పిలో జేఏసీ నాయకులు, విద్యార్థులు గాడిదకు వినతిపత్రం అందజేశారు. కర్నూలు జిల్లా అంతటా వర్షం కురుస్తున్నా సమైక్యవాదులు ఆందోళన కార్యక్రమాలను కొనసాగించారు. డోన్‌లో ఆటో యూనియన్ నాయకులు ఆధ్వర్యంలో చిరంజీవి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కృష్ణాజిల్లా కలిదిండి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థుల మానవహారం చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాల్లో ఎన్జీవోలు, సమైక్యవాదులు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. మార్టేరులో డ్వాక్రా మహిళలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రి, పెద్దాపురంల్లో న్యాయవాదులు దీక్షలు కొనసాగిస్తున్నారు.
వైఎస్సార్సీపీ అలుపెరగని పోరు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణే లక్ష్యంగా నేతలు, కార్యకర్తల ఆందోళన కూడా కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా పలమనేరులో పార్టీ కార్యకర్తలు జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేపట్టారు. వైఎస్‌ఆర్ జిల్లా పోరుమామిళ్లలో జోరువానలో ధర్నా చేపట్టారు. పులివెందులలో ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా మల్కిపురంలో దింపు కార్మికుని తరహాలో కొబ్బరి దింపుతూ నిరసన తెలిపారు. పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు వరుదు కల్యాణి ఆధ్వర్యంలో శ్రీకాకుళం రూరల్ మండలం కుందువానిపేటలో సమైక్య శంఖారావం సభకు మద్దతుగా గ్రామస్తులంతా ర్యాలీ చేపట్టారు.