లక్షల గళాలు ఒక్కటై.. సీమాంధ్ర జిల్లాల్లో ఉద్యమం
సాక్షి నెట్‌వర్‌క : రాష్ర్ట విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర జిల్లాల్లో ఉద్యమం జోరుగా సాగుతోంది. అలుపెరగకుండా సాగుతున్న పోరు గురువారం నాటికి 51వ రోజుకు చేరుకుంది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఇచ్చిన పిలుపులో భాగంగా సీమాంధ్ర జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలను సమైక్యవాదులు మూసివేయిం చారు. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. ఆరు నూరైనా సమైక్యాంధ్ర ఒక్కటే మా ఆకాంక్ష అంటూ లక్షలాది గళాలు ఒక్కటై నినదిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో బ్యాంకింగ్ సేవలను స్తంభింపజేయడంతో రూ.100కోట్ల మేర లావాదేవీలు నిలిచిపోయాయి. గణపవరంలో సుమారు 20వేల మంది ‘సమైక్యాంధ్ర వర్థిల్లాలి’ అంటూ పంచ లక్ష గళార్చన చేశారు. చిత్తూరులో జేఏసీ నాయకులు సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. మాజీ ఎమ్మెల్యే ఎం. వెంకటరమణ ఆధ్వర్యంలో బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయాన్ని మూసివేయించారు. పలమనేరులో లక్షగళ గర్జన విజయవంతమైంది. చంద్రగిరి కోట ఆవరణలో సమైక్యవాదులు గురువారం చేపట్టిన ‘సమైక్య విజయం’ నాటిక అందరినీ ఆకట్టుకుంది. శ్రీకృష్ణదేవరాయలు నడిపిన భువన విజయాన్ని గుర్తుకు తెచ్చేవిధంగా ఈ నాటికను ప్రదర్శించారు.
శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా గూడూరులో వేలాది మందితో గూడూరు గర్జన నిర్వహించారు. అనంతపురం జిల్లా గుత్తిలో నిర్వహించిన విద్యార్థి గర్జనలో వేలాది మంది విద్యార్థులు పాల్గొని సమైక్య నినాదాలతో హోరెత్తించారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలో రణభేరి, విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 300ఆటోలతో మండల కేంద్రం నుంచి శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం వరకు, అక్కడ నుంచి భోగాపురం మండల కేంద్రం వరకు భారీర్యాలీ నిర్వహించారు. డెంకాడ మండలం అయినాడ జంక్షన్ వద్ద జాతీయ పతాకంతో ప్రదర్శన నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెం నుంచి అంతర్వేది వరకూ 24 కిలోమీటర్లు వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు పాదయాత్ర చేసి లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పలు సంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తీర్మానించారు.
ఎన్జీవోలను కించపరుస్తూ మంత్రి కొండ్రు మురళి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విశాఖలో ఏయూ ఉద్యోగులు మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. సింహాచల దేవస్థానం అర్చకులు ప్రధాన రహదారిపై కబడ్డీ ఆడారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించారు. విభజన నిర్ణయాన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన షేక్ అబ్దుల్లా ఖాన్ కుటుంబానికి మంత్రి టీజీ వెంకటేశ్ రూ.2 లక్షలు ఆర్థిక సాయాన్ని అందించారు. సీమాంధ్రలో సమైక్యాంధ్ర ద్రోహి ఎవరనే ప్రశ్నతో పశుసంవర్థక శాఖ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రజాబ్యాలెట్‌లో 4,941ఓట్లతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రథమస్థానంలో నిలిచారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 21న గుంటూరులో నిమ్మకాయల వ్యాపారాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు. ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద జూనియర్ కళాశాలల అధ్యాపకులు విద్యార్థులను రోడ్డుపై కూర్చొబెట్టి ‘విద్యార్థులకు పాఠాలు- విభజవాదులకు గుణపాఠాలు’ పేరుతో పాఠాలు చెప్పారు. ఇదిలాఉంటే, రాష్ట్ర విభజనతో మానసిక క్షోభకుగురై గురువారం ఇద్దరు గుండె పోటుతో మృతిచెందారు.
విజయవాడలో నేడు సేవ్ ఏపీ సభ
విజయవాడలో శుక్రవారం సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను నిర్వహిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల జిల్లా జేఏసీ అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ చెప్పారు. ఈ సభలో రాష్ట్రాన్ని ఎందుకు రక్షించాలి, విభజన జరిగితే ఎదురయ్యే సమస్యలు, నష్టాల గురించి వివరించనున్నట్లు తెలిపారు. గడపకు ఒకరు చొప్పున హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.
మన గుండెలపై తన్నిన సోనియా : చలసాని
సాక్షి, మచిలీపట్నం : ఇటలీ నుంచి వచ్చిన సోనియాను మనం గుండెల్లో పెట్టుకుంటే ఆమె మాత్రం మన గుండెలపై తన్నుతున్నారని ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో గురువారం జరిగిన సమైక్యాంధ్ర సమరభేరీలో ఆయన ప్రసంగించారు. భారతదేశంలో ఉంటూ 14 ఏళ్లపాటు ఇటలీ పౌరసత్వంతోనే కొనసాగిన సోనియాను ఈ దేశ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారన్నారు. ఆమె మాత్రం మన దేశ ఐక్యతను దెబ్బతీసేలా, తెలుగువారి మధ్య చిచ్చుపెట్టేలా రాష్ట్ర విభజనకు సీడబ్ల్యూసీ తీర్మానం చేయించారని విమర్శించారు.