ఒక్కటే లక్ష్యం.. మార్మోగుతున్న సమైక్యనాదం | samaikya slogans still continue in seemandhra regions | Sakshi
Sakshi News home page

ఒక్కటే లక్ష్యం.. మార్మోగుతున్న సమైక్యనాదం

Published Tue, Sep 17 2013 12:45 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM

ఒక్కటే లక్ష్యం.. మార్మోగుతున్న సమైక్యనాదం

ఒక్కటే లక్ష్యం.. మార్మోగుతున్న సమైక్యనాదం

జోరువర్షంలోనూ ఆగని జనోద్యమం   
 సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రం ఒక్కటిగా ఉండటం కంటే మరో ప్రత్యామ్నాయమే లేదంటూ సీమాంధ్రలో ఎగసిన జనోద్యమం వరుసగా 48వరోజైన సోమవారం నాడూ ఉద్ధృతంగా సాగింది. కోస్తా రాయలసీమల్లోని పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురిసినా జనం లెక్కచేయక రోడ్లపైకి వచ్చి సమైక్యనినాదాలు హోరెత్తించారు. రాష్ట్రం ముక్కలైతే తాగునీటికి తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందని విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం శొంఠ్యాంలో వందలాదిమంది మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. వర్శిటీ అధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో ఏయూ మెయిన్ గేట్ నుంచి సిరిపురం వరకు వందలాదిమంది జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. ‘క్రీడా గర్జన’ పేరిట తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జాతీయ రహదారిని దిగ్బంధించి ఆటలు ఆడారు. తాళ్లరేవులో పురోహితుడు ఏలూరు వెంకట కామేశ్వరరావు పంట కాలువలో శవాసనం వేసి 10 గంటల పాటు నీటిపై తేలియాడి సుమారు 10కిలోమీటర్లు తిరుగుతూ నిరసన తెలిపారు.
 
  పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో గంగపుత్రుల ఆధ్వర్యంలో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలో విజ్జేశ్వరం నుండి శెట్టిపేట వరకు 25 బోట్లతో సోమవారం ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బెండిగేటులో తప్పెటగుళ్ల ప్రదర్శనతో నిరసన చేపట్టారు. విజయవాడలో ఈ నెల 20న నిర్వహించ తలపెట్టిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం కావాలని మహిళా ఉద్యోగులు దుర్గగుడిలో అమ్మవారికి మెట్ల పూజలు చేశారు. వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో 56మంది ఉద్యోగులు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వారికి గుంటూరులో రక్తాన్ని అందజేశారు. ఒంగోలులో ఆర్యవైశ్యులు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటూ యజ్ఞం నిర్వహించారు.
 
 ఈ దీక్షలకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ నేతృత్వంలో జలదీక్ష చేపట్టారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు రోడ్లపైనే విద్యాబోధన చేసి నిరసన వ్యక్తం చేశారు. ైవెృఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో టింబర్ డిపోల వర్తకులు భారీ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో టీటీడీ కల్యాణకట్టకు చెందిన నాయీబ్రాహ్మణులు మేళతాళాలతో ర్యాలీ నిర్వహించారు. చంద్రగిరిలో సమైక్యవాదులు తమిళనాడుకు చెందిన టాక్సీలు, కార్లు, ఇతర వాహనాలను ఆపి‘కేంద్రమంత్రి చిదంబరం ప్రకటనతో ఆంధ్ర రాష్ట్రం అతలాకుతలమైందని, మీరైనా ఆయనకు బుద్ధి చెప్పాలని’ అభ్యర్థించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దంటూ కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని 19 గ్రామ పంచాయతీలు తీర్మానం చేసిన ప్రతులను రాష్ట్రపతి, ప్రధానికి పంపారు.  
 
 విభజిస్తే బూట్‌పాలిష్ చేసుకోవాల్సిందే : భూమన
 రాష్ట్ర విభజన జరిగితే విద్యావంతులు బూట్ పాలిష్  చేసుకుని బతకాల్సిందేనని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన సోమవారం తిరుపతిలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద వర్షంలో తడుస్తూ బూట్ పాలిష్ చేశారు. ఈ సందర్భంగా భూమన విలేకరులతో మాట్లాడుతూ విద్యావంతులకు ఉద్యోగాలు లేకపోతే బూట్ పాలిష్ లాంటి కార్యక్రమాలు చేసుకుని జీవనం సాగించాల్సిందేనన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం ప్యాకేజీ మాట్లాడుకోవడానికేనని ఆరోపించారు. తర్వాత తెలంగాణ లో పర్యటించడానికి బాబు సన్నాహాలు చేసుకుంటున్నారని భూమన తెలిపారు.
 
 గుండెపోటుతో జేఏసీ కో-కన్వీనర్ మృతి
 గుంతకల్లు (అనంతపురం), న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న గుంతకల్లు ప్రభుత్వాస్పత్రి వైద్యుడు, జేఏసీ కో కన్వీనర్ డాక్టర్ సుమంత్‌కుమార్ (59) సోమవారం ఉదయం టీవీలో ఉద్యమ వార్తలు చూస్తూ గుండెపోటుతో మృతి చెందారు. ఇతని స్వస్థలం రాజమండ్రి కాగా, ఉద్యోగ రీత్యా ఇక్కడి ప్రభుత్వాస్పత్రిలో ఈఎన్‌టీ స్పెషలిస్టుగా పనిచేస్తూ గత ఏడాది రిటైరయ్యారు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి.. గుంతకల్లు జేఏసీ కో కన్వీనర్‌గా పోరాటం చేశారు.  
 
 హోరెత్తిన సమైక్య ‘గర్జన
 రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెనపై రైతుల మహార్యాలీ
 సాక్షి, నెట్‌వర్క్ : రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ సోమవారం సీమాంధ్రలోని పలుచోట్ల ‘గర్జన’లు హోరెత్తాయి. రాజమండ్రి-కొవ్వూరు రోడ్ కమ్ రైల్వే వంతెనపై వ్యవసాయశాఖాధికారుల జేఏసీ ఆధ్వర్యంలో ‘రైతు గర్జన’ చేపట్టారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పదివేలమందికి పైగా రైతులు ట్రాక్టర్లతో వంతెనపై మహా ర్యాలీ నిర్వహించారు. రాష్ర్ట విభజన జరిగితే  నదులన్నీ ఎండిపోయి సీమాంధ్ర ప్రాంతమంతా ఎడారిని తలపిస్తుందని అధికారులు లెక్కలతో సహా వివరించారు. అమలాపురంలో వేలాది మంది విద్యార్థులు ‘విద్యార్థిగర్జన’ చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో సమైక్యాంధ్ర ఉద్యమ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్ష గళ గర్జన విజయవంతమైంది. గర్జన సందర్భంగా ఎంపీ కనుమూరి బాపిరాజును హిజ్రాగా చిత్రీకరించిన ఫ్లెక్సీని ఏర్పాటు చేయటం వివాదాస్పదమైంది. విశాఖ జిల్లా నర్సీపట్నంలో సమైక్య గర్జన ఆకట్టుకుంది. విజయనగరంలో జరిగిన ధూం..ధాం కార్యక్రమంలో కళాకారులు హోరెత్తించారు. కృష్ణాజిల్లా గుడివాడలో మునిసిపల్ జేఏసీ ఆధ్వర్యంలో సింహగర్జన చేపట్టారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలో బ్రహ్మగర్జన పేరుతో పెద్ద ఎత్తున సభ, ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్టూరులో జాతీయ రహదారిపై  రైతుగర్జన, మార్కాపురంలో చేపట్టిన ‘విద్యార్థి గర్జన’, చిత్తూరు జిల్లా  నగరిలో మహిళా గర్జన నిర్వహించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో లక్ష జన సమైక్య రణభేరి, మంగళగిరిలో సమైక్య మహిళా శంఖారావం కార్యక్రమాలు విజయవంతమయ్యాయి.
 
 ఆగని ప్రజాగ్రహం .. కడపలో మంత్రులకు, ఎంపీల ఇళ్లకు ‘హెచ్చరిక’ పోస్టర్లు
 సాక్షి నెట్‌వర్క్ : కాంగ్రెస్, టీడీపీ నేతలపై జనాగ్రహం కొనసాగుతోంది. సోమవారం విజయనగరంలో టీడీపీ ఎమ్మెల్యేలలితకుమారిని అడ్డుకున్నారు. విజయనగరం నుంచి రామభద్రాపురం వెళ్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామిని గజపతినగరంలో జేఏసీ సభ్యులు అడ్డుకున్నారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన దీక్షా శిబిరం వద్దకు వస్తున్న టి.సుబ్బరామిరెడ్డిని అక్కడే ఉన్న ఉపాధ్యాయులు అడ్డుకుని గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్ జిల్లా కడపలో మంత్రులు, ఎంపీల ఇళ్లకు ‘హెచ్చరిక’ పోస్టర్లను అంటించారు. ఈ నెల 18వ తేదీలోపు మంత్రులతో పాటు ఎంపీ సాయిప్రతాప్ రాజీనామాలు ఆమోదింపచేసుకుని సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని, లేనిపక్షంలో వారి ఇళ్ల వద్దే దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో జేసీ దివాకరరెడ్డి బస్సులను అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా  టెక్కలిలో ఎమ్మెల్యే కొర్ల భారతి ఇంటిని జేఏసీ నేతలు ముట్టడించారు. కాశీబుగ్గలో టీడీపీ నేతలు బండారు సత్యనారాయణమూర్తి, శివాజీలను అడ్డుకోగా, కర్నూలులో న్యాయవాదులు మంత్రి టీజీ వెంకటేష్‌కు చెందిన మౌర్య ఇన్ హోటల్‌ను ముట్టడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement