సీమాంధ్ర సమస్యల్ని పరిష్కరించిన తర్వాతే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలన్న పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు చేసిన ప్రకటనకు బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ మద్దతు పలికింది.
బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ సమర్థన
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర సమస్యల్ని పరిష్కరించిన తర్వాతే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలన్న పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు చేసిన ప్రకటనకు బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ మద్దతు పలికింది. బీజేపీలాంటి జాతీయ పార్టీకి అన్ని ప్రాంతాలు సమానమేనన్నది వెంకయ్య ప్రకటనతో తేటతెల్లమవుతోందని, దీన్ని ఆక్షేపించాల్సిన పనేమీ లేదని ప్రకటించింది. వెంకయ్య నాయుడు వ్యాఖ్యలకు పెడర్థాలు తీయాల్సిన పనిలేదని తెలంగాణ నేతలకు హితవుపలికింది. 2009 నుంచి ప్రత్యేక తెలంగాణ చుట్టూనే రాష్ట్ర నాయకత్వం పోరాటాలు చేసిందని, రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రుల మనోభావాలు ఎలా ఉంటాయో పసిగట్టడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని అభిప్రాయపడింది.
25 పార్లమెంటు సీట్లున్న ఓ పెద్ద ప్రాంతాన్ని జాతీయ నాయకత్వం విస్మరించలేదని, నరేంద్ర మోడీ ప్రధాని కావాలంటే ఈ ప్రాంత ఓట్లూ, సీట్లూ కూడా ముఖ్యమేనని సున్నితంగా హెచ్చరించింది. ‘‘పార్టీ అంటే తెలంగాణ మాత్రమే కాదు. 2009 ఎన్నికల్లో పార్టీకి తెలంగాణలో వచ్చిన ఓట్లు మూడుశాతం లోపే. సీట్లు గెలవకపోయినా సీమాంధ్రలోనూ 2.3 శాతం ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో వెంకయ్య చేసిన ప్రకటన సబబే’’నని ఉద్యమ కమిటీ నేత ఒకరు తెలిపారు. సీమాంధ్రలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అనేక మంది ఇతర పార్టీల నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని, వారిని ఆకట్టుకోవడానికి కూడా వెంకయ్య నాయుడు చేసిన ప్రకటన ఊతమిస్తుందని తెలిపారు. భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలని, పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన నిర్మించాలని తాము చేస్తున్న డిమాండ్లపై కేంద్రం తక్షణమే స్పందించాలని కోరారు.